కరెంట్‌ కష్టాలు

ABN , First Publish Date - 2023-02-11T23:40:53+05:30 IST

జిల్లాలో విద్యుత్‌ అప్రకటిత కోతలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వేసవికి ముందే ఈ పరిస్థితి ఉంటే మార్చి, ఏప్రిల్‌, మే, జూన్‌లో కరెంటు కోతలు ఏ విధంగా ఉంటాయోనని ఆందోళన చెందుతున్నారు.

 కరెంట్‌ కష్టాలు

- అదనపు వినియోగం పేరుతో బాదుడు

గణేశ్‌నగర్‌, ఫిబ్రవరి 11: జిల్లాలో విద్యుత్‌ అప్రకటిత కోతలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వేసవికి ముందే ఈ పరిస్థితి ఉంటే మార్చి, ఏప్రిల్‌, మే, జూన్‌లో కరెంటు కోతలు ఏ విధంగా ఉంటాయోనని ఆందోళన చెందుతున్నారు. సప్లయికి మించి విద్యుత్‌ వినియోగం పెరుగడంతో ఎన్‌పీడీసీఎల్‌ అధికారులు అప్రకటిత కోతలను విధిస్తున్నారు. కోతలు లేవని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో మరమ్మతుల పేరిట జిల్లా కేంద్రంతోపాటు జిల్లావ్యాప్తంగా అన్ని రంగాలకు ఇస్తున్న కరెంటు సరఫరాలో ఏదో ఒక సాకుతో కోతలు విధిస్తున్నారు.

రోజుకో సాకుతో సరఫరా నిలిపివేత

వ్యవసాయ, పరిశ్రమలు, గృహాలు, కమర్షియల్‌ సర్వీసులకు కరెంట్‌ సరఫరా ఉదయం 10 నుంచి సాయంత్రం మూడు గంటల వరకు నిలిపివేస్తున్నారు. సబ్‌స్టేషన్ల మరమ్మతులు, చెట్ల కొమ్మల తొలగింపు, స్మార్ట్‌ సిటీ పనులు, స్తంభాల ఏర్పాటు, లూజ్‌ వైర్ల మరమ్మతులు అంటూ విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నారు. విద్యుత్‌ బిల్లులు మాత్రం ఎప్పుడు వచ్చే వాటికన్నా ఎక్కవ రావడంతో వినియోగదారులు తలలు పట్టుకుంటున్నారు. గట్టిగా గాలి వీచినా, ఇతర ఏవైనా రిపేర్లు వచ్చినా కోతలు అదనంగా ఉంటాయి. కరీంనగర్‌ అర్బన్‌ లో స్మార్ట్‌ సిటీ పేరుమీద ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు కోతలు విధిస్తున్నారు. రూరల్‌ పరిధిలో మరమ్మతుల పేరుతో వివిద ప్రాంతాల్లో రిపేర్లు చేస్తున్నట్లు ప్రకటించి, నిత్యం 8 గంటల పాటు కరెంట్‌ కోత విధిస్తున్నారు. గ్రామాలు, పట్టణాల్లో సమస్యలు పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి కార్యక్రమాలు నిర్వహించింది. ఈ కార్యక్రమాల్లో ప్రధానంగా విద్యుత్‌ సమస్యలు పరిష్కరించడానికి సమయం కేటాయించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న పనులు గుర్తించి యుద్ధప్రాతిపదికన జారీచేశారు. అప్పట్లో చేసిన మరమ్మతులు తాత్కలికంగానే పని చేశాయి. నిత్యం ఎదో ఒక కారణంతో గంటల తరబడి కరెంట్‌ సరఫరాలో కోత విధించడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చిన్న ఫీడర్‌ అయినా, పెద్ద ఫీడర్‌ అయినా ఎనిమిది గంటల పాటు అన్ని సర్వీసులకు విద్యుత్‌ సరఫరా నిలిపి వేస్తున్నారు.

మోత మోగుతున్న బిల్లులు

జిల్లాలో కరెంటు కష్టాలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఓవైపు కరెంటు కోతలు.. మరోవైపు అదనపు వినియోగం పేరుతో వినియోగించిన కరెంటు చార్జీలకు బదులు మూడింతలు బిల్లులు పంపిస్తుండడంతో వినియోగదారులు షాక్‌కు గురవుతున్నారు. గతంలో అడిషనల్‌ సెక్యూరిటీ డిపాజిట్‌ (ఏఎస్‌డీ) పేరుతో అదనంనంగా డిపాజిట్‌ను కట్టించుకున్న ఎన్‌పీడీసీఎల్‌ ఇప్పుడు అడిషనల్‌ కన్‌జంప్షన్‌ డిపాజిట్‌ (ఏసీడీ) పేరుతో మళ్లీ బిల్లులు పంపిస్తోంది. జిల్లాలో మొత్తం విద్యుత్తు గృహ విద్యుత్‌ కనెక్షన్లు 2,65,733 ఉండగా వినియోగదారులు చెల్లించవలసిన మొత్తం ఏసీడీ బకాయిలు 19.60 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇప్పటివరకు 30 వేల మంది వినియోగదారులు చెల్లించిన 4.53 కోట్ల రూపాయలు చెల్లించారు.

Updated Date - 2023-02-11T23:40:59+05:30 IST