రాజన్న సిరిసిల్ల జిల్లాలో సాగు సందడి

ABN , First Publish Date - 2023-06-26T01:12:58+05:30 IST

చినుకు రాలింది. రైతన్నలు పొలం బాట పట్టారు. పల్లెల్లో ఎక్కడ చూసినా భూతల్లి ఒడిలో అన్నదాతల సందడి కనిపిస్తోంది.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో సాగు సందడి

- రుతుపవనాల రాకతో అన్నదాతల ఆశలు

- జిల్లాలో 2.40 లక్షల ఎకరాల్లో వానాకాలం పంటలు

- వరి 1.62 లక్షలు, పత్తి 74,492 ఎకరాల్లో సాగుకు సిద్ధం

- సబ్సిడీపై జీలుగు, జనుము విత్తనాలు

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

చినుకు రాలింది. రైతన్నలు పొలం బాట పట్టారు. పల్లెల్లో ఎక్కడ చూసినా భూతల్లి ఒడిలో అన్నదాతల సందడి కనిపిస్తోంది. రుతు పవనాల రాక ఆలస్యం కావడంతో విత్తనాలు వేసుకునేందుకు ఎదురు చూస్తున్నారు. జూలైలోనైనా వర్షాలు కురుస్తాయన్న ఆశతో వ్యవసాయ పనులు జోరుగా సాగిస్తున్నారు. మృగశిరకార్తెలో వర్షాలు ముఖం చాటేసినా వచ్చే కార్తెలో వర్షాలు కురుస్తాయని అన్నదాతలు ఖరీఫ్‌ సాగుపై ఆశలు పెంచుకుంటున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2.40 లక్షల ఎకరాల్లో వానాకాలం(ఖరీఫ్‌ ) సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. జూన్‌లో సాధారణ వర్షపాతం నమోదు కాకపోవడంతో రైతులు ఆందోళన చెందినా కాళేశ్వరం జలాలు, సమృద్ధిగా వర్షాలు పడుతాయనే అశతోనే వ్యవసాయ పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు.

వ్యవసాయ శాఖ సిద్ధం

జిల్లాలో వానాకాలం 2.40 లక్షల ఎకరాల్లో పునాస పంటల సాగుకు రైతులు సిద్ధం కాగా ఎరువులు, విత్తనాల సరఫరాపై వ్యవసాయశాఖ ఏర్పాట్లు చేపట్టింది. ప్రధానంగా వరి 1,62,036 ఎకరాలు, పత్తి 74,492 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. మిగతా పంటలు తక్కువగానే సాగు విస్తీర్ణం ఉంది. మొక్కజొన్న 1,347 ఎకరాలు, కందులు 1,756 ఎకరాలు, పెసర 97 ఎకరాలు, ఇతర పంటలు 333 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఇందుకోసం 47,980 మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరం అవుతాయని అంచనా వేసి వ్యవసాయ శాఖ సిద్ధం చేస్తుంది. వరిసాగుకు 32,407 క్వింటాళ్ల విత్తనా లు, మొక్కజొన్నకు 108 క్వింటాళ్లు, కంది సాగుకు 70.24 క్వింటాళ్లు, పత్తికి 2 లక్షల 45 వేల 868 ప్యాకెట్లు అవసరం అవుతాయని అంచనా వేశారు. సబ్సిడీ విత్తనాల్లో జీలుగు, జనుము రైతులకు అందిస్తున్నారు. జీలుగు విత్తనాలు కిలో రూ. 63.25 పైసలు ఉండగా ఇందులో సబ్సిడీ రూ. 41.11 పైసలు ఉంది. రైతు రూ.22.14 పైసలు చెల్లిస్తే సరిపోతుంది. జనుము కిలో 83.25 పైసలు ఉండగా సబ్సిడీ రూ. 52.11 పైసలు ఉంది. రైతు చెల్లించాల్సింది 29.14 పైసలు అవుతుంది. యూరియా 22,480 మెట్రిక్‌ టన్నులు, డీఏపీ 4,500 మెట్రిక్‌ టన్నులు, ఎంవోపీ 6 వేల మెట్రిక్‌టన్నులు, ఎన్‌పీకేఎస్‌ 15 వేల మెట్రిక్‌ టన్నులు అవసరం పడుతాయని అంచనాలు వేసి రైతులకు అందించడానికి సిద్ధం చేస్తున్నారు.

నకిలీ విత్తనాలపై నిఘా

జిల్లాలో ప్రధానంగా పత్తి రైతులను నకిలీ విత్తనాల బెడద వెంటాడు తోంది. ఖరీఫ్‌ ఆరంభంలోనే టాస్క్‌ఫోర్స్‌, వ్యవసాయ అధికారులు, పోలీసు లు నకిలీ విత్తనాలపై నిఘా పెట్టారు. ఫర్టిలైజర్‌ దుకాణాల్లో తనిఖీలు చేస్తున్నారు. జిల్లాలో వరితో పాటు పత్తి సాగుపై రైతులు ఎక్కువగా మొగ్గు చూపుతుండడంతో ప్రతి ఖరీఫ్‌ సీజన్‌లో పొరుగు రాష్ట్రాల నుంచి నకిలీ పత్తి విత్తనాలు జిల్లాకు చేరుకుంటూనే ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాకు పొరుగున మహారాష్ట్ర, అంధ్రప్రదేశ్‌ ఉండడంతో సరిహద్దు గ్రామా ల్లో నిల్వ చేసి విత్తనాలను జిల్లాలకు సరఫరా చేస్తున్నారు. తక్కువ ధర ఉండడంతో రైతులు కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నారు. పొరుగు రాష్ట్రాల్లో బీటీ 3 విత్తనాలపై నిషేధం లేకపోవడంతో ప్యాకింగ్‌ కవర్లు మార్చి జిల్లాలో విక్రయిస్తున్నారు. జిల్లాలో పత్తివిత్తనాల ఒక ప్యాకెట్‌ రూ.800 నుంచి రూ.1200 వరకు అమ్ముకుంటున్నారు. ప్రతి సంవత్సరం టాస్క్‌ఫోర్స్‌ అధికారుల తనిఖీల్లో విత్తనాలు పట్టుబడుతున్నా దందా మాత్రం అగడం లేదు.

సాధారణం కన్నా తక్కువ వర్షపాతం

జిల్లాలో జూన్‌లో సాధారణ వర్షపాతం కంటే 80 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 104.7 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 20.9 మిల్లీమీటర్ల మాత్ర మే నమోదైంది. గత సంవత్సరం జూన్‌లో 131.1 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అదివారం జిల్లాలో 9.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రుద్రంగి మండలంలో 16 మిల్లీమీటర్లు, చందుర్తిలో 0.7, వేములవాడ రూరల్‌లో 4.3, బోయినపల్లిలో 1.5, వేములవాడలో 3.9, సిరిసిల్లలో 9.1 , కోనరావుపేటలో 3.3, వీర్నపల్లిలో 0.4, ఎల్లారెడ్డిపేటలో 3.7, గంభీ రావుపేటలో 7.9, ముస్తాబాద్‌లో 28.7, తంగళ్లపల్లిలో 32.3, ఇల్లంత కుంటలో 7.7 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.

Updated Date - 2023-06-26T01:12:58+05:30 IST