కరోనా కలవరం..

ABN , First Publish Date - 2023-03-26T01:02:57+05:30 IST

చాపకింద నీరులా మళ్లీ కరోనా విస్తరిస్తోంది. వారం రోజుల వ్యవధిలో ర్యాండమ్‌ పరీక్షల్లోనే 18 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ కలగడం కలవరం కలిగిస్తున్నది.

కరోనా కలవరం..

- మాస్కులు, ముందు జాగ్రత్తలతో రక్ష

- వారం రోజుల్లో 18 మందికి కొవిడ్‌

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

చాపకింద నీరులా మళ్లీ కరోనా విస్తరిస్తోంది. వారం రోజుల వ్యవధిలో ర్యాండమ్‌ పరీక్షల్లోనే 18 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ కలగడం కలవరం కలిగిస్తున్నది. కొత్తరకం వైరస్‌తో కరోనా వేగంగా విస్తరిస్తోందని, దేశవ్యాప్తంగా కూడా ఆక్టివ్‌ కేసులు పెరుగుతున్నాయని, అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. జిల్లాలో కూడా ఆ లక్షణాలు కనిపిస్తున్నాయి. డిసెంబరు, జనవరి, ఫిబ్రవరిలో జిల్లాలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. మార్చి నెలలో గడిచిన వారం రోజుల్లో 18 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. జిల్లా ఆసుపత్రికి వచ్చినవారికి ర్యాండమ్‌గా కరోనా పరీక్షలు నిర్వహించగా ఈ కేసులు బయటపడ్డాయి. ప్రస్తుతం జిల్లాలో తొమ్మిది యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. రెండు యాక్టివ్‌ కేసులు కట్టరాంపూర్‌లో, మరో రెండు సప్తగిరికాలనీలో, తిమ్మాపూర్‌లో రెండు, మానకొండూర్‌లో రెండు, చామనపల్లిలో ఒక కరోనా కేసు నమోదైంది. కరోనా సోకినవారు ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నారు. వీరందరికి వారం రోజుల క్వారంటైన్‌ను అధికారులు సూచించారు. జిల్లాలో 11,19,947 మంది 18 ఏళ్లు నిండిన వారు ఉండగా, ఎనిమిది లక్షల మందికిపైగా రెండు డోసుల వ్యాక్సినేషన్లు తీసుకున్నారు. పలువురు పిల్లలకు కూడా వ్యాక్సినేషన్‌ చేశారు. బూస్టర్‌ డోసు కూడా కొందరు తీసుకోగా కరోనా ప్రభావం తగ్గిపోవడం, మూడో వేవ్‌లో పెద్దగా ప్రభావం చూపకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అందుకే బూస్టర్‌ డోస్‌కు చాలామంది ముందుకు రాలేదు. ప్రస్తుతం మళ్లీ కరోనా చాపకింద నీరులా విస్తరిస్తుండడంతో ఒక్కసారిగా ప్రజలు అప్రమత్తమవుతున్నారు. ఒకవైపు కరోనా, మరోవైపు ఫ్లూ విస్తరిస్తుండడంతో మాస్కులు ధరించడమే మంచిదనే అభిప్రాయాన్ని వైద్య, ఆరోగ్యశాఖ ప్రచారం చేస్తున్నది. మాస్కులు ధరించి, చేతులు శుభ్రం చేసుకోవడం, కనీస జాగ్రత్తలను పాటించడం ద్వారా వ్యాధి బారిన పడకుండా చూసుకోవచ్చని చెబుతున్నారు. ప్రజలు కూడా ఇప్పుడిప్పుడే కొందరు మాస్కులు ధరిస్తున్నారు.

విజృంభిస్తున్న ఫ్లూ..

జిల్లాలో రోజురోజుకు ఫ్లూ విస్తరిస్తోంది. వందలాది మంది జ్వరపీడితులుగా మారుతున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలపై ఫ్లూ ప్రభావం ఎక్కువగా ఉన్నది. పిల్లలు, పెద్దలు అందరికి 102, 103 డిగ్రీల జ్వరం, దగ్గు, జలుబు, ఒంటి నొప్పులు రావడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. భరించలేని బాధతో రోజురోజుకు ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య పెరిగిపోతున్నది. జిల్లా కేంద్ర ఆసుపత్రికి ప్రతిరోజు 700 నుంచి సుమారు వెయ్యి మంది వరకు ఔట్‌ పేషెంట్లు వస్తున్నారు. అందులో ఫ్లూ బాధితులే 50 శాతానికి మించి ఉంటున్నారు. జ్వర తీవ్రత ఎక్కువగా ఉన్నవారు ఆసుపత్రులలో చేరి చికిత్స పొందుతున్నారు. జిల్లా ఆసుపత్రిలో రోజుకు 100 నుంచి 150 మంది ఫ్లూ బాధితులు ఇన్‌పేషెంట్లుగా చేరుతున్నారు. జిల్లావ్యాప్తంగా ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో వెయ్యి నుంచి రెండు వేల మంది ఔట్‌ పేషెంట్లుగా, సుమారు వెయ్యి మంది ఇన్‌ పేషెంట్లుగా చేరుతున్నారని తెలుస్తున్నది. ప్రజలు ముందు జాగ్రత్తలు తీసుకొని మాస్కులు ధరించాలని, జనసమ్మర్ధం ఉన్న ప్రాంతాలో తిరగక పోవడం, భౌతిక దూరం పాటిస్తూ ఇళ్లలోనే తగు జాగ్రత్తలతో ఆహారం తీసుకుంటే ఫ్లూ, కరోనా రాకుండా ఉంటుందని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సూచిస్తున్నారు. శానిటైజర్లను వినియోగించాలని కూడా డాక్టర్లు సూచిస్తున్నారు.

ముందస్తు జాగ్రత్తలు పాటించాలి...

- డాక్టర్‌ రఘురామన్‌, సీనియర్‌ ఫిజిషియన్‌

ఫ్లూతో బాధపడేవారు కరోనా రాకుండా జాగ్రత్తలు పాటించాలి. శానిటైజర్‌తో చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. భౌతిక దూరం పాటించాలి. గుంపులుగా ఉన్న చోటకు వెళ్లకూడదు. ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లలో ఉండేవారు జాగ్రత్తగా ఉండాలి. వారిలో కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చినవారు లేదా, ఫ్లూతో బాధపడుతున్నవారు ఉంటే క్వారంటైన్‌లో ఉంచాలి. మందులు వాడాలి. సొంత వైద్యం చేసుకోవద్దు. డాక్టర్‌ను సంప్రదించాలి. వృద్దులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండేవారు జాగ్రత్తగా ఉండడం మంచిది.

Updated Date - 2023-03-26T01:02:57+05:30 IST