Share News

మూడు దశాబ్దాల తరువాత రామగుండంలో కాంగ్రెస్‌ విజయం

ABN , First Publish Date - 2023-12-05T00:07:28+05:30 IST

: మూడు దశాబ్దాల తరువాత రామగుండంలో కాంగ్రెస్‌ జెండా ఎగిరింది... మామూలుగా ఎగరలేదు... 30ఏళ్ల కసిని మూటగట్టుకుని భారీ మెజార్టీతో రామగుండం అసెంబ్లీలో మక్కాన్‌సింగ్‌ విజయం సాధించాడు. ఈ గెలుపు సునాయాసంగా జరిగిందేమి కాదు. పార్టీనంతా మూటకట్టుకుని, ప్రజలకు విశ్వాసాన్ని అందించి ఒక్కసారి అంటూ పక్కా ప్రణాళికతో రాజ్‌ఠాకూర్‌ రామగుండాన్ని హస్తగతం చేసుకున్నాడు.

మూడు దశాబ్దాల తరువాత రామగుండంలో కాంగ్రెస్‌ విజయం

కలిసి వచ్చిన అనుబంధ సంఘాలు... పార్టీ నాయకులు...

ఘన విజయంతో శ్రేణుల్లో నూతనోత్సాహం

చరిత్ర మార్చిన రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌సింగ్‌

గోదావరిఖని, డిసెంబరు 4: మూడు దశాబ్దాల తరువాత రామగుండంలో కాంగ్రెస్‌ జెండా ఎగిరింది... మామూలుగా ఎగరలేదు... 30ఏళ్ల కసిని మూటగట్టుకుని భారీ మెజార్టీతో రామగుండం అసెంబ్లీలో మక్కాన్‌సింగ్‌ విజయం సాధించాడు. ఈ గెలుపు సునాయాసంగా జరిగిందేమి కాదు. పార్టీనంతా మూటకట్టుకుని, ప్రజలకు విశ్వాసాన్ని అందించి ఒక్కసారి అంటూ పక్కా ప్రణాళికతో రాజ్‌ఠాకూర్‌ రామగుండాన్ని హస్తగతం చేసుకున్నాడు. ఎట్టకేలకు ఎప్పుడూ లేని విధంగా పార్టీ శ్రేణులు, అనుబంధ సంఘాలు ఆయన వెంట నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సారి కాంగ్రెస్‌ పక్షాన ఉన్న ఎవరూ కూడా ప్రలోభాలకు లోనుకాకుండా పార్టీని, రాజ్‌ఠాకూర్‌ను పట్టుకుని ముందుకు సాగారు. సమష్టిగా కష్టపడ్డారు. రామగుండంలో కాంగ్రెస్‌ది ఒక విషాద వైఫల్యగాధ... 1989 నుంచి ఇక్కడ అటు మేడారంగా ఉన్నప్పుడు, ఇటు రామగుండం అయిన తరువాత కాంగ్రెస్‌ పార్టీకి ఒక్క విజయమూ లేదు. రాష్ట్రంలో ఏ అసెంబ్లీ సెగ్మెంట్‌లో కూడా వరుసగా ఏడు సార్లు కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోయిన చరిత్ర రామగుండంలో తప్ప ఎక్కడా లేదు. కాంగ్రెస్‌ కష్టాల్లో ఉందని తెలిసి... కాంగ్రెస్‌ అభ్యర్థిగా రామగుండంలో పోటీ చేయడం సాహసమే అయినప్పటికీ రాజ్‌ఠాకూర్‌ కాంగ్రెస్‌ పక్షాన నిలబడి రామగుండంలో కలబడడం ఇది రెండో సారి. 1989లో కాంగ్రెస్‌ అభ్యర్థి మాతంగి నర్సయ్య విజయం తరువాత 1994లో స్వతంత్ర అభ్యర్థి మాలెం మల్లేషంపై కాంగ్రెస్‌ అభ్యర్థి బడికెల రాజలింగం ఓడిపోయారు. 1999లో టీడీపీ నుంచి మాతంగి నర్సయ్య కాంగ్రెస్‌ అభ్యర్థి లక్ష్మణ్‌కుమార్‌పై విజయం సాధించారు. 2004లో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పొత్తులో రామగుండం(మేడారం) సీటు టీఆర్‌ఎస్‌కే క్కింది. అప్పుడు కొప్పుల ఈశ్వర్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా విజయం సాధించాడు. 2008 ఉపఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి గుమ్మడి కుమారస్వామిపై విజయం సాధించాడు.

2009ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి బాబర్‌ సలీంపాషా పోటీ చేశారు. అప్పుడు సోమారపు సత్యనారాయణ బాబర్‌పై స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందాడు. 2014 ఎన్నికల్లో కూడా బాబర్‌, సత్యనారాయణల మధ్యనే పోటీ నెలకొన్నది. ఈ సారి సత్యనారాయణ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసి బాబర్‌పై రెండోసారి గెలిచారు. 2018ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌కు ఓటమే మిగిలింది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా సత్యనారాయణ, కాంగ్రెస్‌ అభ్యర్థిగా మక్కాన్‌సింగ్‌ పోటీ చేయగా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ నుంచి పోటీ చేసిన కోరుకంటి చందర్‌ విజయం సాధించాడు. ఇలా కాంగ్రెస్‌కు పరాజయ చరిత్ర తప్ప విజయగాధలు రామగుండంలో మూడు దశాబ్దాలుగా లేవు. దీనికి తోడు 30ఏళ్లుగా పరాజితం అవుతున్న కాంగ్రెస్‌ పార్టీలో అప్పటి తరం నాయకత్వం క్రమంగా అస్తమించింది. యువ నాయకత్వం కార్పొరేటర్‌ స్థాయి కంటే పెద్దగా ఎదగలేదు.

- ప్రజలనే నమ్ముకుని..

ప్రస్తుతం నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీకి సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు చెప్పుకోదగినంత లేరు. ప్రజాప్రాతినిధ్యం కూడా రామగుండంలో కాంగ్రెస్‌కు తక్కువగానే ఉంది. రామగుండం కార్పొరేషన్‌ పరిధిలోని 50డివిజన్లు ఉంటే అందులో 11డివిజన్లలో మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ నాయకత్వంలో కాంగ్రెస్‌ విజయం సాధించింది. ఈ 11మంది కార్పొరేటర్లలో ఒకరు చనిపోగా, మరో ముగ్గురు కార్పొరేటర్లు ఈ మధ్యనే బీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. వీటన్నీంటికి తోడుగా మక్కాన్‌సింగ్‌కు రామగుండంలో తనదంటూ సామాజిక వర్గం ఓట్లు లేకపోవడం మరో ప్రతికూలమైన అంశం. ఈ పరిణామాలకు ఎదురీదుతూ మక్కాన్‌సింగ్‌ రెండు మూడు మాసాలుగా ప్రజలనే నమ్ముకుని ప్రజల వద్దే తిరిగాడు. పార్టీ పరంగా మక్కాన్‌సింగ్‌కు స్థానికంగా భారీ బలగం లేకపోయినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్‌ఎస్‌కు వ్యతిరేక ఓటు ప్రభావం, మక్కాన్‌సింగ్‌ రెండు సార్లు వరుసగా ఓటమి పొందడం వల్ల కలిగే సానుభూతి ఇప్పుడు రాజ్‌ఠాకూర్‌కు ప్రధానమైన బలంగా మారింది. ఏది ఏమైనా రామగుండంలో మక్కాన్‌సింగ్‌ ఒక భారీ యుద్ధాన్ని చేసి గెలిచాడు. మళ్లీ కాంగ్రెస్‌కు రామగుండంలో మంచి కాలం ఏర్పడింది. రాష్ట్రంలో కాంగ్రెస్సే అధికారంలోకి రావడం కూడా ఇక్కడి కాంగ్రెస్‌ శ్రేణులకు మరింత బలాన్ని ఇచ్చింది. దశాబ్దాలుగా పరాజయ అవమానాన్ని, అనుభవాలను భరిస్తూ వచ్చిన కాంగ్రెస్‌ శ్రేణులు ఇప్పుడు రామగుండంలో సంబరాలు చేసుకుంటున్నాయి. 50వేలకుపై మెజార్టీతో రాజ్‌ఠాకూర్‌ను గెలిపించిన రామగుండం ప్రజలు ఆయనపై గంపడాశలు పెట్టుకున్నారు. రాజ్‌ఠాకూర్‌ కూడా ప్రజలకు అనేక సందర్భాల్లో అన్నీ తానవుతానని హామీ ఇచ్చాడు.

Updated Date - 2023-12-05T00:07:32+05:30 IST