Share News

పెద్దపల్లి పార్లమెంట్‌లో కాంగ్రెస్‌ క్లీన్‌ స్వీప్‌

ABN , First Publish Date - 2023-12-04T01:48:19+05:30 IST

శ్రామికులు, కార్మికు లు, కర్షకులు అధికంగా ఉండే పెద్దపల్లి పార్లమెంట్‌ నియోజక వర్గంలోని ఏడు అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్‌ పార్టీ గెలుచుకుని స్వీప్‌ చేసింది.

పెద్దపల్లి పార్లమెంట్‌లో కాంగ్రెస్‌ క్లీన్‌ స్వీప్‌

పెద్దపల్లి, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి) : శ్రామికులు, కార్మికు లు, కర్షకులు అధికంగా ఉండే పెద్దపల్లి పార్లమెంట్‌ నియోజక వర్గంలోని ఏడు అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్‌ పార్టీ గెలుచుకుని స్వీప్‌ చేసింది. ఒక్కో అభ్యర్థి మంచి మెజారిటీతో గెలుపొందారు. గత ఎన్నికల్లో మంథని నుంచి పోటీ చేసిన శ్రీధర్‌బాబు ఒక్కరే గెలుపొందగా, మిగతా ఆరు నియోజకవర్గాల నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలుపొందారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు స్వల్ప మెజారిటీతో ఓటమి చెందగా, ఈ ఎన్నికల్లో ఆ అభ్యర్థులే బంపర్‌ మెజారిటీతో గెలుపొందారు. పెద్దపల్లి నుంచి చింతకుంట విజయరమణారావు 1,18,888 ఓట్లు సాధించి బీ ఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డిపై 55,108 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మంథని నుంచి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు 1,03,822 ఓట్లు సాధించి, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పుట్ట మధూకర్‌పై 31,380 ఓట్ల మెజారితో, రామగుండం నుంచి రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌సింగ్‌ 92,227 ఓట్లు సాధించి ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌పై 56,794 ఓట్ల మెజారిటీతో విజయం సాధిం చారు. మంచిర్యాల నుంచి కక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు 1,05,945 ఓట్లు సాధించి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావుపై 66,116 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. చెన్నూర్‌ నుంచి మాజీ ఎంపీ డాక్టర్‌ జి వివేకానంద 87,541 ఓట్లు సాధించి, ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై 37,515 ఓట్లతో, బెల్లంపల్లి నుంచి గడ్డం వినోద్‌ 82,217 ఓట్లు సాధించి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై 36,878 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నుంచి అడ్లూరి లక్ష్మన్‌ కుమార్‌ 91,393 ఓట్లు సాధించి 22,032 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. దీంతో పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలో బీఆర్‌ఎస్‌ కోటలకు బీటలు వారాయి. 2019లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో ఇక్కడి నుంచి బోర్లకుంట వెంకటేష్‌ నేత గెలుపొందగా, వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ పాగా వేసేందుకు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పునాది కానున్నాయి.

Updated Date - 2023-12-04T01:48:44+05:30 IST