వాణిజ్య, విద్యాసంస్థల్లో ఫైర్‌సేఫ్టీ అడిట్‌ను నిర్వహించాలి

ABN , First Publish Date - 2023-03-26T00:41:59+05:30 IST

వేసవి కాలంలో అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న దృష్ట్యా ప్రత్యేక బృందాలతో జిల్లాలోని అన్ని వాణిజ్య భవనాలు, విద్యాసంస్థల్లో రెండు వారాల పాటు ఫైర్‌సేఫ్టీ అడిట్‌ను నిర్వహించాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అగ్నిమాపక శాఖ అధికారులను ఆదేశించారు.

వాణిజ్య, విద్యాసంస్థల్లో ఫైర్‌సేఫ్టీ అడిట్‌ను నిర్వహించాలి
అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

- కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

సిరిసిల్ల కలెక్టరేట్‌, మార్చి 25: వేసవి కాలంలో అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న దృష్ట్యా ప్రత్యేక బృందాలతో జిల్లాలోని అన్ని వాణిజ్య భవనాలు, విద్యాసంస్థల్లో రెండు వారాల పాటు ఫైర్‌సేఫ్టీ అడిట్‌ను నిర్వహించాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అగ్నిమాపక శాఖ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేక షెడ్యూల్‌ను వెంటనే సిద్ధం చేయాలన్నారు. సిరిసిల్ల కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లాలో అగ్నిప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్‌ అగ్నిమాపక శాఖ, పోలీస్‌, రెవెన్యూ, పంచాయితీరాజ్‌, మున్సిపల్‌, వేములవాడ దేవస్ధానం అధికారులతో సమీక్ష సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఫైర్‌సేఫ్టీ తనిఖీల కోసం ఏర్పాటు చేసిన బృందాలకు తనిఖీల సమయంలో పరిశీలించాల్సిన అంశాలు, చేయాల్సిన సూచనలపై శిక్షణ కార్యక్రమాలు అగ్నిమాపక శాఖ అధికారులు నిర్వహించాలని సూచించారు. రెండు వారాల్లోగా జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, గ్రామాల్లో వాణిజ్య వ్యాపార భవనాలు, విద్యాసంస్థలు, కలెక్టరేట్‌లోని అన్ని శాఖల కార్యాలయాలు, అసుపత్రులు, పెట్రోల్‌ బంక్‌లు, దేవాలయాలు, పౌరసరఫరాల గోదాములు, ఎతైన అపార్ట్‌మెంట్‌లలో ఫైర్‌ సేఫ్టీ అడిట్‌ను నిర్వహించి హాట్‌స్పాట్‌లను గుర్తించాలన్నారు. ఫైర్‌ ఎగ్జిట్‌ల ముందు లాక్‌కాకుండా చూడాలన్నారు. అత్యవసర ప్రవేశ మార్గాల్లో డోర్లకు ఏవైనా వస్తువులతో నింపి ఉంచిన ఫైర్‌సేఫ్టీ పరికరాలు లేకున్నా కండిషన్‌లో లేకున్నా వెంటనే సంబంధిత యజమానులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలన్నారు. గోదాములను నిర్వహించే వ్యాపారులు అన్నివ్యాపార భవనాల యాజమానులు ఫైర్‌సేఫ్టీ నిబంధనలు పాటించాలన్నారు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నిబంధనలు పాటించని వ్యాపారస్తులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదన్నారు.

ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాల, అగ్నిప్రమాదాల సమయంలో ప్రాణ, ఆస్థి నష్టం సంభవించకుండా చూసేందుకు అనుసరించాల్సిన మార్గాలపై జిల్లాలోని ఇద్దరు ఎస్‌ఐలు, పదిమంది కానిస్టేబుల్స్‌కు హైదరాబాద్‌లో శిక్షణ కార్యక్రమాలు ఇచ్చామన్నారు. ఫైర్‌సేఫ్టీ అడిట్‌లో వీరు పాల్గొంటారని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌, జిల్లా అగ్నిమాపక అధికారి వెంకన్న, జిల్లా పంచాయతీ అధికారి రవీందర్‌, జిల్లా ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్‌ మురళీధర్‌రావు, జిల్లా విధ్యాధికారి రమేష్‌కుమార్‌, జిల్లా మార్కెటింగ్‌ అధికారి ప్రవీణ్‌కుమార్‌, బీసీ, ఎస్సీ అభివృద్ధి అధికారి మోహన్‌రెడ్డి, జిల్లా పౌరసరఫరాల అధికారి జితేందర్‌రెడ్డి, గురుకుల పాఠశాలల కోఆర్డినేటర్‌ జాక్వీలాన్‌, మున్సిపల్‌ కమిషనర్‌ సమ్మయ్య, సిరిసిల్ల, వేములవాడ అగ్నిమాపక అఽధికారులు సతీష్‌, కమాలాకర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-03-26T00:41:59+05:30 IST