నేడు జిల్లాకు సీఎం రాక

ABN , First Publish Date - 2023-03-23T00:42:44+05:30 IST

టీవల కురిసిన వడగళ్ల వర్షాలకు నష్టపోయిన పంట పొలాలను, పండ్ల తోటలను పరిశీలించి రైతులకు మనోధైర్యం కలిగించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ గురువారం జిల్లాలో పర్యటించనున్నారు.

నేడు జిల్లాకు సీఎం రాక
సీఎం పర్యటనపై సమీక్ష నిర్వహిస్తున్న మంత్రి గంగుల కమలాకర్‌

- రామడుగు మండలంలో వడగళ్ల వానకు దెబ్బతిన్న పంటలను పరిశీలించనున్న ముఖ్యమంత్రి

కరీంనగర్‌, మార్చి 22 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): ఇటీవల కురిసిన వడగళ్ల వర్షాలకు నష్టపోయిన పంట పొలాలను, పండ్ల తోటలను పరిశీలించి రైతులకు మనోధైర్యం కలిగించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ గురువారం జిల్లాలో పర్యటించనున్నారు. అకాల వర్షాల పంట నష్టాలను పరిశీలించడానికి వివిధ జిల్లాల్లో పర్యటించనున్న సీఎం ఖమ్మం, వరంగల్‌ మీదుగా జిల్లాకు రానున్నారు. సాయంత్రం 3 గంటలకు ముఖ్యమంత్రి జిల్లాలోని రామడుగు మండలం లక్ష్మీపూర్‌ గ్రామానికి వచ్చి వాటర్‌ మిలన్‌, మస్క్‌ మిలన్‌ తోటలను, ఇతర పంట పొలాలను పరిశీలిస్తారు. అనంతరం రైతులతో మాట్లాడుతారు. వరుసగా మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వడగళ్ల వానలకు జిల్లాలోని రామడుగు, గంగాధర, చొప్పదండి, వీణవంక మండలాల్లో వరి, మొక్కజొన్న, మామిడి తోటలు, కూరగాయల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దాదాపు 10వేల ఎకరాలకు పైగా వరి, 8,500 ఎకరాల్లో మొక్కజొన్న, 50 ఎకరాల్లో కూరగాయల పంటలు, 800 ఎకరాల్లో మామిడి తోటలు దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాథమిక అంచనాలు వేశారు. పంట చేతికి వచ్చే సమయంలోనే అకాల వర్షాలు, వడగళ్ళ వానలు తమను కోలుకోలేని దెబ్బతీశాయని, పంట కోసం చేసిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోయిందని రైతులు తీవ్ర ఆందోళన చెందారు. దెబ్బతిన్న పంటలను పరిశీలించి పంట నష్టం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. గంగాధర, రామడుగు, చొప్పదండి మండల్లాలో వడగళ్ల వర్షంతో తీవ్ర నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించి పంట నష్టం అంచనా వేస్తున్నారు. రెండు రోజుల క్రితం రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి వినోద్‌కుమార్‌, కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌, ఇతర అధికారులు రామడుగు మండలంలోని లక్ష్మీపూర్‌ తదితర గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ రామడుగు మండలంలో అత్యధికంగా ంంట నష్టం జరిగిన లక్ష్మీపూర్‌ గ్రామాన్ని సందర్శించి, రైతులతో మాట్లాడి వారిలో మనోధైర్యం నింపుతారు. గాయత్రి పంప్‌హౌస్‌ను సందర్శించే అవకాశాలున్నట్లు తెలిసింది. సీఎం కేసీఆర్‌ పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌, పోలీస్‌ కమిషనర్‌ సుబ్బారాయుడు, ఇతర అధికారులు రామడుగు మండలంలోని లక్ష్మీపూర్‌ గ్రామాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. మంత్రి గంగుల కమలాకర్‌ కలెక్టరేట్‌లో సీఎం పర్యటనపై కలెక్టర్‌తోపాటు ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఫ సీఎం పర్యటనపై రైతుల ఆశలు

రామడుగు మండలంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు గురువారం పర్యటించనుండడంతో రైతులు ఆయన తమను ఆదుకుంటారని భావిస్తున్నారు. సీఎం పర్యటన సందర్భంగా మండలంలోని లక్ష్మీపూర్‌ గ్రావిటీ కెనాల్‌ వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌ వద్ద భద్రతను పెంచారు. ఇప్పటికే మండలం అంతా పోలీస్‌మయమయింది. తీవ్ర స్థాయిలో తమ పంటలను నష్టపోయిన రైతులు తమ పంటలను సీఎం చూడాలని ఆశిస్తున్నారు. సీఎం హెలీక్యాప్టర్‌ ద్వారా లక్ష్మీపూర్‌ హెలీప్యాడ్‌ వద్దకు చేరుకుని మస్క్‌మిలన్‌, వాటర్‌మిలన్‌ సాగుచేసి వడగళ్ల వానకు సుమారు 80 లక్షల వరకు నష్టపోయిన రైతు ద్యావ రామచంద్రారెడ్డితోపాటు పలువురు రైతులను కలవనున్నారు. దెబ్బతిన్న పంటలను పరిశీలించి రామడుగులోని రైతువేదిక వద్దకు చేరుకుని రైతులతో మాట్లాడనున్నారు.

Updated Date - 2023-03-23T00:42:44+05:30 IST