తేలిన బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు

ABN , First Publish Date - 2023-08-22T02:22:15+05:30 IST

బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరో రికార్డు బ్రేక్‌ చేశారు. మూడు నెలల ముందుగానే వచ్చే అసెంబ్లీలో నిలిపే అభ్యర్థుల జాబితా ను ప్రకటించారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పరిధిలో వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబుకు మినహా సిట్టింగ్‌ శాసనసభ్యులందరికీ ముఖ్యమంత్రి శుభవార్తే వినిపించారు.

తేలిన బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు

- ‘చెన్నమనేని’ అవుట్‌.. చల్మెడ ఇన్‌

- కోరుట్లలో తండ్రి స్థానంలో తనయుడు

- మిగతా సిట్టింగులందరూ సేఫ్‌

(ఆంధ్రజ్యోతిప్రతినిధి, కరీంనగర్‌)

బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరో రికార్డు బ్రేక్‌ చేశారు. మూడు నెలల ముందుగానే వచ్చే అసెంబ్లీలో నిలిపే అభ్యర్థుల జాబితా ను ప్రకటించారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పరిధిలో వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబుకు మినహా సిట్టింగ్‌ శాసనసభ్యులందరికీ ముఖ్యమంత్రి శుభవార్తే వినిపించారు. వేములవాడ స్థానంలో రమేశ్‌బాబుకు బదులు చల్మెడ లక్ష్మినర్సింహారావుకు అవకాశం కట్టబెట్టారు. కోరుట్ల శాసనసభ్యుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు కోరిక మేరకు ఆయనకు బదులు ఆయన తనయుడు డాక్టర్‌ సంజయ్‌కి ఈసారి పోటీచేసే అవకాశం కల్పించారు. మంత్రులు కేటీ రామారావు, గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌తో పాటు సిట్టింగ్‌ శాసనసభ్యులందరికీ వారివారి స్థానాల్లో మళ్లీ పోటీచేసేందుకు అవకాశం ఇచ్చారు. జగిత్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి జిల్లాల్లోని ఒక్కో స్థానంలో అభ్యర్థుల పేర్లను మలి జాబితాలో ప్రకటిస్తారని ముందు ప్రచారం జరిగినా 115 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాలని కేసీఆర్‌ నిర్ణయం తీసుకోవడంతో జిల్లాలోని అన్ని స్థానాల అభ్యర్థులెవరో తేలిపోయింది. మరోసారి పోటీచేసే అవకాశం రావడంతో సిట్టింగ్‌ శాసనసభ్యులు వారి అనుచరగణం సంబరాలు జరుపుకుంటున్నారు. వేములవాడ, చొప్పదండి, రామగుండం నియోజకవర్గాల్లో గత కొద్ది నెలలుగా సిట్టింగ్‌ శాసనసభ్యులకు వ్యతిరేకంగా పలువురు గళమెత్తారు. తమ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వవద్దని, కొత్తవారికి ఎవరికి అవకాశమిచ్చినా గెలిపించుకుంటామని అధిష్ఠాన పెద్దలకు విన్నవించుకున్నారు. వేములవాడలో మాత్రం శాసనసభ్యుడు రమేశ్‌బాబుకు వ్యతిరేకంగా, అనుకూలంగా రెండు శిబిరాలు ఏర్పడ్డాయి. ఆయన అనుకూల శిబిరం నిన్నటి వరకు కూడా కొత్త అభ్యర్థి చల్మెడ లక్ష్మినర్సింహారావుకు టికెట్‌ ఇవ్వవద్దని, రమేశ్‌బాబుకే మరోసారి అవకాశమివ్వాలని కోరారు. అయితే పార్టీ అధినేత కేసీఆర్‌ అభ్యర్థుల పేర్లు ప్రకటించిన తర్వాత అందరి గొంతులు మౌనం దాల్చాయి. అధినేత నిర్ణయానికి వ్యతిరేకంగా ఏ నియోజకవర్గంలో కూడా ఎవరూ మాట్లాడలేదు. అయితే రమేశ్‌బాబు మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభ్యర్థుల జాబితా ప్రకటించడానికి కొద్దిసేపటికి ముందే ట్విట్టర్‌లో చేసిన ట్విట్‌ చర్చనీయాంశంగా మారింది. ‘రాజకీయాలు ప్రజల కోసమే చేయాలి.. పదవుల కోసం కాదు అని చెప్పిన మా తండ్రి గారి మాటలను ప్రతిసారి స్మరించుకుంటూ ఆ పనిని నా తుది శ్వాస ఉన్నంత వరకు చేస్తానని నాతో ఉన్నవారందరికీ భరోసా ఇస్తున్నానని ట్విట్‌ చేశారు. అంతేకాకుండా అధిష్ఠానవర్గాన్ని ఉద్దేశించి దయచేసి నిర్ణయాలు మా అందరితో సంప్రదించి మా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా తీసుకోవాలి లేనిపక్షంలో ఆత్మాభిమానాలు దెబ్బతింటాయి. ప్రజల ఆమోదం లభించదు.. ఇది మనమందరం తెలంగాణ ఉద్యమంలో నేర్చుకున్న మొదటి పాఠం’’ అంటూ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రం పార్టీ నాయకుడు నల్ల మనోహర్‌రెడ్డి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 2014 నుంచి తాను టికెట్‌ అడుగుతూ వస్తున్నా నాయకత్వం పట్టించుకోవడం లేదని, బీఆర్‌ఎస్‌లో యువతను తొక్కిపెడుతున్నారని ఆయన ఈ సందర్భంగా ఆరోపించారు. ఏది ఏమైనా తాను పెద్దపల్లి నియోజకవర్గం నుంచి పోటీలో ఉండడం ఖాయమని ప్రకటించారు. ఈ రెండు సంఘటనలు మినహా ఉమ్మడి జిల్లా పరిధిలో ఎక్కడా అసంతృప్తిరాగాలు వినిపించలేదు.

అందరూ అనుభవజ్ఞులే..

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అభ్యర్థులను ప్రకటించడంతో జిల్లాలో రాజకీయ వేడి రాజుకున్నది. నియోజకవర్గాల్లో అధికారపార్టీ అభ్యర్థులకు పోటీగా నిలిచే కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థులెవరంటూ అంతటా చర్చ జరుగుతోంది. ఉమ్మడి జిల్లా పరిధిలో మళ్లీ పోటీలో నిలువనున్న వారిలో మంత్రులుగా ఉన్న కేటీఆర్‌, గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌ విజయపరంపరను ఏళ్లతరబడి కొనసాగిస్తూ వస్తున్నవారే కావడం విశేషం. మంత్రి కేటీఆర్‌ సిరిసిల్ల నియోజకవర్గం నుంచి 2009, 2014, 2018 ఎన్నికల్లో, 2010లో జరిగిన ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా నాటి టిఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీచేసి గెలుస్తూ వచ్చారు. ఇప్పుడు ఆయన ఐదవసారి ఎన్నికల బరిలో తలపడనున్నారు. కరీంనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తలపడనున్న మంత్రి గంగుల కమలాకర్‌ నాల్గవసారి అసెంబ్లీ బరిలో ఉన్నారు. 2009లో టీడీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలిచిన ఈయన 2013 తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న కాలంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. 2014లో, 2018లో ఆయన ఆనాటి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా బరిలో నిలిచి విజయం సాధించి మంత్రి పదవి అధిష్టించారు. ఇప్పుడు నాల్గవసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టడానికి పోటీచేసేందుకు కేసీఆర్‌ ఆయనకు క్లియరెన్సు ఇచ్చారు. మరో మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఐదవసారి అసెంబ్లీకి తలపడనున్నారు. 2009, 2014,2018 ఎన్నికల్లో 2010 ఉప ఎన్నికలో ఆయన ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పుడు ఐదవ సారి ఈ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీపడుతున్నారు. నియోజకవర్గాల పునర్విభజన జరుగక ముందు మేడారం అసెంబ్లీ నియోజకవర్గంలో 2004,2008 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. అసెంబ్లీ పరంగా చూస్తే ఈయన ఎనమిదవ సారి ఎన్నికల బరిలో ఉండనున్నారు. చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2018లో ఎమ్మెల్యేగా ఎన్నికైన సుంకె రవిశంకర్‌ రెండవసారి అసెంబ్లీ బరిలో తలపడుతున్నారు. మానకొండూర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో 2014,2018 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన రసమయి బాలకిషన్‌కు పార్టీ అధినేత కేసీఆర్‌ మూడవసారి అవకాశమిచ్చారు. హుస్నాబాద్‌ నియోజకవర్గం నుంచి వొడితెల సతీష్‌బాబు 2009, 2014,2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు గెలిచి నాల్గవసారి ఇదే స్థానం నుంచి బరిలో నిలిచారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ నుంచి మొదటిసారి బరిలో నిలిచిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2022లో జరిగిన ఉప ఎన్నికల సమయంలో బీఆర్‌ఎస్‌లో చేరిన కౌశిక్‌రెడ్డి ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచారు. పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో దాసరి మనోహర్‌రెడ్డి 2010లో టీఆర్‌ఎస్‌లో చేరి 2014,2018 ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. ప్రస్తుతం ఆయన మూడవసారి అసెంబ్లీ బరిలో ఉన్నారు. మంథని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టికెట్‌ లభించిన పుట్ట మధు నాల్గవసారి అసెంబ్లీ బరిలో పోటీపడుతున్నారు. 2009లో పిఆర్‌పి అభ్యర్థిగా ఈ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయిన ఆయన 2014లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2018లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీలో నిలిచి పరాజయం పాలయ్యారు. రామగుండం అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసేందుకు అవకాశం పొందిన కోరుకంటి చందర్‌ 2009లో మహాకూటమి అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. 2014,2018 ఎన్నికల్లో ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌బ్లాక్‌ అభ్యర్థిగా పోటీచేశారు. 2018లో గెలుపొందిన వెంటనే టీఆర్‌ఎస్‌లో చేరారు. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఎంపికయ్యారు. జగిత్యాల అభ్యర్థిగా తిరిగి బరిలో ఉండనున్న డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ 2014లో పోటీచేసి ఓడిపోయారు. 2018లో ఎమ్మెల్యేగా గెలుపొంది ఇప్పుడు మూడోసారి బరిలో ఉండనున్నారు. కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న డాక్టర్‌ సంజయ్‌ కల్వకుంట్లకు ఇది తొలి పోటీ. ఆయన తండ్రి కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు కోరుట్ల నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి జరిగిన 2009,2010,2014,2018 ఎన్నికల్లో వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనారోగ్య కారణాలతో ఈసారి తన కుమారిడికి అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరగా అందుకు ఆయన ఆమోదం తెలిపారు. వేములవాడ అసెంబ్లీ నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా తొలిసారి బరిలో నిలుస్తున్న చల్మెడ లక్ష్మినర్సింహారావు గతంలో కరీంనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా రెండుసార్లు పోటీచేసి ఓడిపోయారు. ప్రస్తుతం ఆయన అధికారపార్టీ అభ్యర్థిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

Updated Date - 2023-08-22T02:22:15+05:30 IST