చంద్రబాబు ఏజెంట్ రేవంత్‌రెడ్డి
ABN , First Publish Date - 2023-03-05T01:20:36+05:30 IST
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి ఏజెంట్. బెదిరించి డబ్బులు దండుకోవడమే రేవంత్‌రెడ్డి నైజం’ అని అని నాఫ్స్‌కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్‌రావు అన్నారు.
- నాఫ్స్‌కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్‌రావు
గంభీరావుపేట, మార్చి 4 : ‘టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి ఏజెంట్. బెదిరించి డబ్బులు దండుకోవడమే రేవంత్‌రెడ్డి నైజం’ అని అని నాఫ్స్‌కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్‌రావు అన్నారు. గంభీరావుపేట మండల కేంద్రంలో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. లింగాపూర్ వద్ద రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. కమీషన్ల కోసమే కాలేశ్వరం ప్రాజెక్టు పనుల్లో జాప్యం అంటూ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో నిజమం లేదన్నారు. బెదిరించి, డబ్బులు సంపాదించడమే రేవంత్‌రెడ్డి దినచర్య అన్నారు. లైనింగ్ పనులు పూర్తయిన కాలువ వద్దకు వెళ్లి పరిశీలించి వెళ్లడం కరెక్ట్ కాదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టడమే రేవంత్‌రెడ్డి ప్రధాన లక్ష్యమన్నారు. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో కాంగ్రెస్‌ను భూ స్ధాపితం చేయడమే రేవంత్‌రెడ్డి ఎజెండా అన్నారు. కాలేశ్వరం 9వ ప్యాకేజీ పనుల టెండర్ కాంగ్రెస్ హయాంలోనే జరిగిన విషయం రేవంత్‌రెడ్డి మరిచి పోయాడా? అంటూ ప్రశ్నించారు. 2013లో కిరణ్‌కుమార్ సీఎం ఉన్న సమయంలోనే కడప జిల్లాకు చెందిన కాంట్రాక్టర్‌కు ఈ కాలేశ్వరం ప్యాకేజీ టెండర్‌ను అప్పగించారని గుర్తు చేశారు. 9వ ప్యాకేజీ పనులను కడప జిల్లా కాంట్రాక్టర్‌కు తెలంగాణ ప్రభుత్వం అప్పగించారనే వ్యాఖ్యల్లో నిజం లేదన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు పథకాన్ని సరైన ప్రణాళికతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లడం వల్లే ఈ రోజు భూగర్బ జలాలు వృద్ధి చెంది, శాశ్వతంగా నీటి సమస్య సమిసి పోయిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు అన్ని రకాల యాసంగి పంట 28 ఎకరాల లక్షలు ఉండగా, ఈ రోజు 68 లక్షల ఎకరాల పంటలు సాగులోకి వచ్చాయన్నారు. అదనంగా 40 లక్షల ఎకరాల పంటలు సాగులోకి రావడం మామూలు అంశం కాదన్నారు. సీఎం కేసీఆర్ భగీరథ ప్రయత్నమే లక్షలాది పంటల దిగుబడి వచ్చిందన్నారు. ఈ సారి కోటీన్నర టన్నుల ధాన్యం కొనుగోలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానికి పెద్ద పీట వేసిందని, పంట మార్పిడి విధానం, నీళ్లు అధికంగా ఉండడంతో అనేక గొప్ప గొప్ప కార్యక్రమాలకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని అన్నారు. సమావేశంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పాపగారి వెంకటస్వామి, సెస్ డైరెక్టర్ గౌరినేని నారాయణరావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ దయాకర్‌రావు, ఆర్‌బీఎస్ చైర్మన్ రాజేందర్, పట్టణ అధ్యక్షుడు వెంకటి, సింగిల్‌విండో వైస్ చైర్మన్ రామాంజనేయులు, నాయకులు సురేందర్‌రెడ్డి, లక్ష్మణ్, లింగంయాదవ్, కలాకర్‌రెడ్డి, ఎల్లాగౌడ్, శ్రీమతి, మల్లేశం, రాజు తదితరులు ఉన్నారు.