దివ్యాంగులకు అండగా కేంద్ర ప్రభుత్వం
ABN , Publish Date - Dec 28 , 2023 | 12:25 AM
దివ్యాంగులకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు.
- ప్రతి ఒక్కరికీ సహాయ ఉపకరణాలు అందేలా చూస్తాం
- ఎంపీ బండి సంజయ్‌కుమార్
కరీంనగర్ టౌన్/గణేశ్‌నగర్, డిసెంబరు 27: దివ్యాంగులకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. బుధవారం నగరంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో వికలాంగులకు సహాయ ఉపకరణాల ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ మాట్లాడుతూ గతంలో హుజూరాబాద్, కరీంనగర్ డివిజన్లలో నిర్వహించిన ఎంపిక శిబిరాల్లో దివ్యాంగుల వివరాలు సేకరించామన్నారు. ప్రస్తుతం 731 మంది దివ్యాంగులు సహాయ ఉపకరణాలకు ఎంపికయ్యారని, ఈ ఉపకరణాల విలువ 68.28 లక్షలు అని తెలిపారు. జాబితాలో పేరు రానివారికి మళ్లీ అవకాశం ఇస్తామన్నారు. మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, మిషన్ శక్తి, మిషన్ వాత్సల్య, చైల్డ్ హెల్ప్‌లైన్, పోషణ్ అభియాన్ వంటి అనేక కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ఎం సరస్వతి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, సీడీపీవో భాగ్యలక్ష్మి, ఏసీడీపీవోలు సౌందర్య, అరవింద, సూపరింటెండెంట్ శ్రీనివాస్ పాల్గొన్నారు.