రాష్ట్ర ప్రభుత్వంపై కేసులు పెట్టాలి

ABN , First Publish Date - 2023-03-19T00:26:05+05:30 IST

జిల్లా కేంద్రానికి చెందిన నిరుద్యోగి చిటికెన నవీన్‌ ఆత్మహత్యకు సంబంధించి పోలీసులు రాష్ట్ర ప్రభుత్వంపై కేసులు పెట్టాలని కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు ఆది శ్రీనివాస్‌ అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వంపై కేసులు పెట్టాలి
సిరిసిల్లలో మాట్లాడుతున్న ఆది శ్రీనివాస్‌

సిరిసిల్ల టౌన్‌, మార్చి 18 : జిల్లా కేంద్రానికి చెందిన నిరుద్యోగి చిటికెన నవీన్‌ ఆత్మహత్యకు సంబంధించి పోలీసులు రాష్ట్ర ప్రభుత్వంపై కేసులు పెట్టాలని కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు ఆది శ్రీనివాస్‌ అన్నారు. ఉద్యోగం లేదనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న జిల్లా కేంద్రంలోని బీవైనగర్‌కు చెందిన చిటికెన నవీన్‌ కుటుంబాన్ని ఆది శ్రీనివాస్‌, టీపీసీసీ సభ్యుడు నాగుల సత్యనారాయణ, నాయకులు శనివారం పరామర్శించారు నవీన్‌ అంతిమయాత్రలో పాల్గొన్నారు. అనంతరం సిరిసిల్ల ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో ఆది శ్రీనివాస్‌ మాట్లాడారు. నిరుద్యోగి నవీన్‌ ఆత్మహత్య చేసుకోవడం కలిచి వేసిందన్నారు. నవీన్‌ ఆత్మహత్యపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్పందించారని, నవీన్‌ కుటుంబానికి కాంగ్రెస్‌ అండగా ఉంటుందని అన్నారు. నవీన్‌ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం కోటి రూపాయాల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామన్న కేసీఆర్‌ అధికారంలోకి వచ్చాక మర్చిపోయారని ఆరోపించాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాటి ప్రభుత్వం హయాంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల నియామకాలు జరిగాయని, ఎనిమిదేళ్లలో ఇప్పటి వరకు ఉపాధ్యాయుల నియామకాల నోటిఫికేషన్‌ ఇవ్వలేదని అన్నారు. ప్రతి పక్షాల ఒత్తిడితో కొన్ని ఉద్యోగాల నోటిఫికేషన్‌ ఇచ్చిన క్రమంలో ప్రశ్న పత్రాలు లీక్‌ కావడంతో నిరుద్యోగ యువత ఆవేదనకు గురవుతోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం తన అనుచరుల కుటుంబాల యువతీ యువకులకు ఉద్యోగాలను కల్పించాలన్న లక్ష్యంతో ప్రగతి భవన్‌ నుంచి టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్న పత్రాలు లీక్‌ చేసిందని ఆరోపించారు. యువరాజు కేటీఆర్‌ సొంత నియోజక వర్గం సిరిసిల్లలో నిరుద్యోగ యువకుడు నవీన్‌ ఆత్మహత్య చేసుకున్నాడంటే అది ముమ్మాటికి ప్రభుత్వ విధానాలతో జరిగిన హత్యగా భావిస్తున్నామన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో రైతులు, నిరుద్యోగ యువత, సర్పంచ్‌లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేయాలని అంటే ప్రభుత్వం మీనమేశాలు లేక్కిస్తోందని అన్నారు. నిరుద్యోగుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు సూర దేవరాజు, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, జిల్లా నాయకుడు ప్రకాష్‌ పాల్గొన్నారు.

ఎల్లారెడ్డిపేట : నిరుద్యోగుల జీవితాలతో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య డిమాండ్‌ చేశారు. సిరిసిల్ల పట్టణంలో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి చిటికెన నవీన్‌ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఆ పార్టీ నాయకులు శనివారం ఎల్లారెడ్డిపేట తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. నిష్పక్షపాతంగా నిర్వహించాల్సిన పరీక్షలను గాలికి వదిలేస్తోందని ధ్వజమెత్తారు. పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని ఆశ పడిన తల్లిదండ్రులకు ప్రభుత్వం కడుపు శోకాన్ని మిగుల్చుతోందని మండి పడ్డారు. పరీక్ష పత్రాల లీకేజీలతో నిరుద్యోగులు కలత చెంది ఆత్మహత్య చేసుకుంటున్నారన్నారు. అనంతరం తహసీల్దార్‌ జయంత్‌కుమార్‌కు వినతి పత్రం అందజేశారు. నాయకులు లింగాగౌడ్‌, శ్రీనివాస్‌, బాబు, రాజునాయక్‌, రమేశ్‌, గంగన్న, రామచంద్రం, ఇమాం, రాములు, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.

గంభీరావుపేట : గంభీరావుపేట మండల కేంద్రంలో తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో శనివారం రాస్తారోకో చేపట్టారు. ప్రశ్నపత్రాల లీకేజీ సమస్యతోపాటు సిరిసిల్లలో నిరుద్యోగ యువకుడి ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని నాయకులు డిమాండ్‌ చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు హమీద్‌, ఎంపీటీసీ పర్శరాములు, నాయకులు లచ్చయ్య, ఎడబోయిన ప్రబాకర్‌, ఎల్లారెడ్డి, సత్యం, భాస్కర్‌, నర్సింహులు, నుస్రతుల్లా, తాహేర్‌, సోషల్‌ మీడియ మండల కన్వీనర్‌ ప్రసాద్‌రావు తదితరులు ఉన్నారు.

తంగళ్లపల్లి: యూత్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో తంగళ్లపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్‌ విగ్రహం ఎదుట ఫ్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. జిల్లా యూత్‌ కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రెటరీ మునిగెల రాజు, సిరిసిల్ల అసెంబ్లీ యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు చుక్క రాజశేఖర్‌, మానవ హక్కుల యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు భరత్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు

Updated Date - 2023-03-19T00:26:05+05:30 IST