భవన నిర్మాణ అనుమతులు త్వరగా ఇవ్వాలి

ABN , First Publish Date - 2023-06-01T00:31:10+05:30 IST

మున్సిపాలిటీల్లో నూతన భవన నిర్మాణాల అనమతులను త్వరగా ఇవ్వాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ గరిమ అగర్వాల్‌ మున్సిపల్‌ అధికారులకు సూచించారు.

భవన నిర్మాణ అనుమతులు త్వరగా ఇవ్వాలి
సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా అదనపు కలెక్టర్‌ గరిమా అగర్వాల్‌

కరీనంగర్‌ టౌన్‌, మే 31: మున్సిపాలిటీల్లో నూతన భవన నిర్మాణాల అనమతులను త్వరగా ఇవ్వాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ గరిమ అగర్వాల్‌ మున్సిపల్‌ అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో మున్సిపల్‌ పనుల పురోగతిపై మున్సిపల్‌ కమిషనర్లు, టౌన్‌ ప్లానింగ్‌, టెక్నికల్‌ సిబ్బందితో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భవన నిర్మాణాలకు అనుమతుల జారీలో జాప్యం చేయవద్దని, జాప్యం చేస్తే మున్సిపల్‌ యాక్ట్‌ ప్రకారం జరిమానా విధించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం ఇరిగేషన్‌ అధికారులతో సమీక్షిస్తూ తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్‌ 2 నుంచి 22 వరకు నిర్వహించనున్న ఉత్సవాల్లో అందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో చెరువుల పండుగలో ప్రజలు పెద్ద మొత్తంలో భాగస్వాములు అయ్యేలా చూడాలని సూచించారు. జూన్‌ 8న నిర్వహించనున్న ఊరూరా చెరువు పండుగలో భాగంగా చెరువులను ఎంపిక చేసి చెరువు పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా పంచాయతీ కార్యదర్శులు చూడాలని తెలిపారు. ఊరూరా చెరువుల పండుగ సందర్భంగా ప్రతి నియోజకవర్గంలోని గ్రామాల్లో వేడుకలు నిర్వహించాలని, బతుకమ్మ ముగ్గులు వేయాలని, మైసమ్మ బోనాలు నిర్వహించంతోపాటు వచ్చిన వారికి భోజనాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రతిరోజు నిర్వహించాల్సిన కార్యక్రమాలపై ముందుగానే సమావేశాలను నిర్వహించుకోవాలని సూచించారు. సమావేశంలో కరీంనగర్‌, హుజూరాబాద్‌ ఆర్డీవోలు ఆనంద్‌ కుమార్‌, హరిసింగ్‌, డీపీవో వీరబుచ్చయ్య, సంధ్యారాణి, ఎస్పీ కార్పొరేషన్‌ అధికారి నాగార్జున, ఉద్యావనశాఖ అధికారి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-06-01T00:31:10+05:30 IST