జగిత్యాల నుంచే బీఆర్‌ఎస్‌ జైత్రయాత్ర

ABN , First Publish Date - 2023-09-14T00:04:14+05:30 IST

రానున్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జగిత్యాల నుంచే బీఆర్‌ఎస్‌ జైత్రయాత్ర ప్రారంభమవుతుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బుధవారం పట్టణ శివారులోని చల్‌గల్‌ పండ్ల మార్కెట్‌లో నిర్వహించిన ఎమ్మెల్యే డాక్టర్‌ మాకునూరి సంజయ్‌కుమార్‌ అధ్యక్షతన నిర్వహించిన జగిత్యాల నియోజకవర్గస్థాయి బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా ఆమే హాజరయ్యారు.

జగిత్యాల నుంచే బీఆర్‌ఎస్‌ జైత్రయాత్ర

- ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

జగిత్యాల, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): రానున్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జగిత్యాల నుంచే బీఆర్‌ఎస్‌ జైత్రయాత్ర ప్రారంభమవుతుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బుధవారం పట్టణ శివారులోని చల్‌గల్‌ పండ్ల మార్కెట్‌లో నిర్వహించిన ఎమ్మెల్యే డాక్టర్‌ మాకునూరి సంజయ్‌కుమార్‌ అధ్యక్షతన నిర్వహించిన జగిత్యాల నియోజకవర్గస్థాయి బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా ఆమే హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తల ను ఉద్దేశించి ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. రాష్ట్రంలోనే అన్ని అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో జగిత్యాల నియోజకవర్గం ముందంజలో ఉందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో కొట్లాడి తెలంగాణను తెచ్చుకున్నామన్నారు. ఇవాళ ప్రతీ పల్లెకు నీళ్లు, నిధులు, ప్రతీ ఒక్క యువకుడికి నియామకం కల్పించే పరిస్థితికి వచ్చామని స్పష్టం చేశారు. దేశంలో అన్ని రంగాల్లో తెలంగాణ నంబర్‌ వన్‌గా ఉందన్నారు. కేసీఆర్‌ అంటే కైండ్‌ హార్టెడ్‌ కమిటెడ్‌ రెస్పాన్సిబుల్‌ లీడర్‌ అని వివరించారు. ఇటువంటి నాయకులు చాలా తక్కువగా ఉంటారని, తెలంగాణకు అటువంటి నాయకుడు దొరకడం ప్రజల అదృష్టమని తెలిపారు. తెలంగాణను సాధించి బీఆర్‌ఎస్‌ చరిత్ర సృష్టించిందన్నారు. వికలాంగులకు తెలంగాణలో నెలకు నాలుగు వేల రూపాయల పెన్షన్‌ ఇస్తుంటే, కర్నాటకలో రూ. 400, గుజరాత్‌లో రూ. 1,250, రాజస్థాన్‌లో రూ. 750, చత్తీస్‌ఘడ్‌లో రూ. 500 మాత్రమే ఇస్తున్నారని తెలిపారు.

మాటమీద నిలబడని జీవన్‌రెడ్డి..

రాష్ట్రంలో ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగినా జగిత్యాలలో కాంగ్రెస్‌ నేత తాటిపర్తి జీవన్‌రెడ్డి నేను పోటీ చేసే చివరి ఎన్నికలు ఇవే అంటూ వరసగా బరిలో దిగుతున్నారని, మాటమీద నిలబడని వ్యక్తి జీవన్‌రెడ్డి అని అన్నారు. నియోజకవర్గంలో గతంలో రెండు పర్యాయాలు జరిగిన ఎన్నికల్లో పోటీ ఇదే చివరి సారి అంటూ పోటికి దిగి ప్రజలను మోసం చేశారన్నారు. ప్రజలు ఎమ్మె ల్యేగా గెలిపిస్తే, కార్యకర్తలు, ప్రజలు, అనుచరులకు ఏమి చేశాడని ప్రశ్నించారు. కుటుంబ సభ్యులకే రాజకీయ అవకాశాలు కల్పించారని ఆరోపించారు.

అల్లీపూర్‌, ఒడ్డెలింగాపూర్‌ను మండలాలుగా చేస్తాం..

రాయికల్‌ మండలంలోగల అల్లీపూర్‌, ఒడ్డె లింగాపూర్‌లను ప్రత్యేక మండలా లుగా చేయాలని అక్కడి ప్రజలు కోరుతున్నారని, మరోమారు బీఆర్‌ఎస్‌ సర్కారు ఏర్పడ్డ తర్వాత మండలాలుగా చేస్తామని కవిత అన్నారు. జిల్లా కేంద్రంలో మహిళా భవనం నిర్మాణానికి రెండు ఎకరాల స్థలం కేటాయించేలా మంత్రి ఈశ్వర్‌, ఎమ్మెల్యే సంజయ్‌ చొరవ చూపాలని కోరారు. సీనియర్‌ నాయకుడు, ఎమ్మెల్సీ రమణ బీఆర్‌ఎస్‌లో చేరికతో పార్టీకి వెయ్యి ఏనుగుల బలం వచ్చిందన్నారు. జగిత్యాలలో తొందరలోనే గృహలక్ష్మి లబ్ధిదారులకు ప్రొసీడింగ్‌లు, డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల లబ్ధిదారులకు ఇళ్లు పంపిణీ చేస్తామ న్నారు. జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ను 60 వేల ఓట్ల పై చిలుకు మెజార్టీతో గెలిపించాలని కోరారు. సమావేశంలో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌ రావు, జడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత సురేశ్‌, ఎమ్మెల్సీ ఎల్‌ రమణ, మాజీ మంత్రి రాజేశం గౌడ్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ డాక్టర్‌ గొల్లపల్లి చంద్రశేఖర్‌గౌడ్‌, డీసీఎంఎస్‌ చైర్మన్‌ ఎలాల శ్రీకాంత్‌రెడ్డి, రాష్ట్ర ఒడ్డెర సంఘం అధ్యక్షుడు పల్లెపు మొగలి, కౌన్సిలర్‌ రేణుక పలువురు బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-14T00:04:14+05:30 IST