తెలంగాణ బిడ్డల భవిష్యత్ కోసమే బీఆర్‌ఎస్
ABN , First Publish Date - 2023-05-27T00:22:52+05:30 IST
తెలంగాణ బిడ్డల భవిష్యత్ కోసమే బీఆర్‌ఎస్ పార్టీ ఉందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖమంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్ రూరల్, మే 26: తెలంగాణ బిడ్డల భవిష్యత్ కోసమే బీఆర్‌ఎస్ పార్టీ ఉందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖమంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శుక్రవారం రేకుర్తిలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాలులో బీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో వివక్షకు గురైందని, ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రం సాధించక పోతే మన భవిష్యత్తు అంధకారమయ్యేదన్నారు. తెలంగాణ వనరులను దోచుకెళ్లేందుకు మరోసారి పార్టీలు కుట్రలు పన్నుతున్నాయన్నారు. రాబోయే ఎన్నికల్లో కార్యకర్తలు కలిసికట్టుగా వారి కుట్రలను భగ్నం చేయాల్సిన అవసరం ఉందన్నారు. పాదయాత్రల పేరుతో కొన్ని విష సర్పాలు తెలంగాణపై దాడి చేసేందుకు వస్తున్నాయన్నారు. రాష్ట్రాన్ని సాధించిన సీఎం కేసీఆర్‌కు ప్రతి కార్యకర్త అండగా ఉండాలన్నారు. బిఆర్‌ఎస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన కార్యకర్తలను పార్టీ కడుపులో పెట్టుకుని చూసుకుంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి క్షేత్ర స్థాయిలోకి తీసుకెళ్లడానికి కార్యకర్తలు ప్రభుత్వానికి పార్టీకి వారధిగా పనిచేయాలన్నారు. సమైక్య రాష్ట్రంలో కరీంనగర్ అభివృద్ధి కోసం అనాటి ముఖ్యమంత్రులు ఒక్కపైసా ఇవ్వలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత వందల కోట్లతో కరీంనగర్‌ను అభివృద్ధి చేశామన్నారు. పది సంవత్సరాల కాలంలో కరీంనగర్ రూపు రేఖ లు మారిపోయాయన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మానేరు రివర్ ఫ్రంట్, తీగల వంతెన పనులు తుదిదశకు చేరుకుని పర్యాటక శోభ సంతరించుకుందన్నారు. జూన్ 17వ తేదీన తీగల వంతెనను, ఆగస్టు15వ తేదీన మానేరు రివర్ ఫ్రంటు మొదటి దశ పనులను ప్రారంభి స్తామ న్నారు. బీఆర్‌ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు చల్లా శంకర్ ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రికి ఆత్మీయ సమ్మేళనానికి పెద్ద ఎత్తున స్వాగత కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, సుడా ఛైర్మన్ జీవీ రామకృష్ణారావు నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి, మార్కెట్ ఛైర్మన్ రెడ్డవేణి మధు, కార్పొరేటర్లు, డివిజన్ కమిటీల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.