Share News

బీజేపీతోనే మీ పిల్లలకు భవిష్యత్‌

ABN , First Publish Date - 2023-11-19T23:52:49+05:30 IST

ప్రజలు బీజేపీకి ఓటు వేస్తే తమ పిల్లల భవిష్యత్‌కు ఓటు వేసినట్టేనని వేములవాడ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెన్నమనేని వికాస్‌రావు అన్నారు.

బీజేపీతోనే మీ పిల్లలకు భవిష్యత్‌
ఓటు అభ్యర్థిస్తున్న వికాస్‌ రావు

కోనరావుపేట, నవంబరు 19: ప్రజలు బీజేపీకి ఓటు వేస్తే తమ పిల్లల భవిష్యత్‌కు ఓటు వేసినట్టేనని వేములవాడ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెన్నమనేని వికాస్‌రావు అన్నారు. మండలంలోని మామిడిపల్లి, బావుసాయిపేట, గోవిందరావుపేట తండా, వట్టిమల్ల, గొల్లపల్లి, కమ్మర్‌పేట తండా, భూక్యరెడ్డి తండా, మరిమడ్ల, అజ్మీర తండా, నిమ్మపల్లి, కోనరావుపేట, ఎగ్లాస్‌పూర్‌, శివంగాలపల్లి గ్రామాల్లో ఆదివారం ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు ఓటు వేస్తే ప్రజలందరినీ గెలిపిస్తానని, వేములవాడ నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని నంబర్‌ వన్‌గా చేస్తానని అన్నారు. మంత్రి కేటీఆర్‌ ఇప్పుడు రాజన్న పుణ్యక్షేత్రాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని అంటున్నాడని, తొమ్మిదేళ్ల పాలలో ఏం చేశారని ప్రశ్నించారు. సిరిసిల్లలో జరిగిన అభివృద్ధి వేములవాడలో జరగలేదన్నారు. వేములవాడ అభివృద్ధిలో వెనుకబడిందని, తనను గెలిపిస్తే ప్రజల అందరిని గెలిపిస్తానని అన్నారు. పదవిలో లేనప్పుడే ప్రతిమ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. మారుమూల గ్రామాల్లో మెరుగైన వైద్యం అందించేందుకు ప్రతీ మండలానికి అంబులెన్స్‌ను ఏర్పాటు చేశామన్నారు. కరీంనగర్‌ ప్రతిమ వైద్య భవన్‌ ఆధ్వర్యంలో పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించామన్నారు. తనను ఒక అన్నగా, తమ్ముడిగా భావించి ఓటు వేసి గెలిపిస్తే ఐదు సంవత్సరాలు వెంటుండి అభివృద్ధి చేస్తానని అన్నారు. వేములవాడ నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానన్నారు. వేములవాడ నియోజకవర్గం దత్తత తీసుకునే దమ్ము ఎవరికీ లేదన్నారు. తన తండ్రి విద్యాసాగర్‌ రావు అడుగుజాడల్లో నడుస్తూ ప్రజల కష్టాల్లో పాలుపంచుకుంటానన్నారు. ప్రధానమంత్రి మోదీని విశ్వ గురువుగా భావిస్తున్నారన్నారు. మహిళా సాధికారత కోసం మహిళా బిల్లును ప్రవేశపెట్టిన ఘనత మోదీకే దక్కుతుందన్నారు. మోదీ మొదటిసారిగా ప్రధానమంత్రి అయ్యాక ఎస్సీని, రెండవసారి ప్రధాని అయ్యాక గిరిజన మహిళను రాష్ట్రపతిగా నియమించారన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే బీసీని ముఖ్యమంత్రి చేస్తారన్నారు. తాను ప్రజలకు సేవ చేయడానికి వచ్చానన్నారు. తనకు డబ్బుపైన ఆశ లేదని, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసమే పాటు పడతానని అన్నారు. తాను గెలిచిన తర్వాత కేంద్ర ప్రభుత్వ పథకాలను నియోజకవర్గ ప్రజలకు అందజేస్తానన్నారు. యువత కోసం పరిశ్రమలను తీసుకొచ్చి ఉద్యోగ భద్రత కల్పిస్తానన్నారు. ప్రభుత్వ నిధులే కాకుండా పైవ్రేట్‌ నిధులను తీసుకొస్తానని, ప్రభుత్వ పాఠశాలలను మోడల్‌ స్కూల్‌గా మారుస్తానని అన్నారు. కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనలో యువతకు ఉద్యోగ భద్రత లేకపోవడంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. యువతకు ఉద్యోగాలు రావాలంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలన్నారు. భారతీయ జనతా పార్టీతోనే సామాజిక న్యాయం జరుగుతుందన్నారు. బీఆర్‌ఎస్‌ నేతలు ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. వారి మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. ప్రధానమంత్రి మోదీ పాలనలో దేశం అభివృద్ధి చెందిందన్నారు. కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి తనను గెలిపిస్తే కంటికి రెప్పలా ప్రజలను కాపాడుకుంటానన్నారు. పదవుల్లో లేనప్పుడే గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్నారు. గ్రామాల్లో వాటర్‌ ప్లాంట్‌ లు ఏర్పాటు చేశామన్నారు. తన తండ్రి విద్యాసాగర్‌రావు పదవుల్లో ఉన్నప్పుడు ప్రతీ గ్రామంలో బస్సు షెల్టర్లు, దోబీ ఘాట్లు, రవాణా సౌకర్యం, కమ్యూనిటీ భవనాలు ఏర్పాటు చేశామన్నారు. అనంతరం పలువురు యువకులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అంతకుముందు ప్రతీ గ్రామంలో వేములవాడ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెన్నమనేని వికాస్‌రావు ప్రచార కార్యక్రమానికి బ్రహ్మరథం పట్టారు. ప్రతీ గ్రామంలో మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఈ ప్రచార కార్యక్రమానికి జనం తండోపతండాలుగా వచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గోపాడి సురేందర్‌రావు, పురుషోత్తమరావు, మిర్యాల్కర్‌ బాలాజీ, మండల అధ్యక్షుడు గుట్ట రామచంద్రం, కిష్టస్వామి, మాజీ జెడ్పిటిసి పల్లం అన్నపూర్ణ, మాజీ మండల పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ అంబోజ లక్ష్మీనారాయణ, మాజీ సర్పంచ్‌ గోపాడి జ్యోతి, మట్టిమల్ల ఎంపీటీసీ కోనేటి రేణుక పాల్గొన్నారు.

వేములవాడ: వేములవాడ బీజేపీ అభ్యర్థి చెన్నమనేని వికాస్‌రావుకు మద్దతుగా పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వికాస్‌రావు సతీమణి చెన్నమనేని దీప, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాపరామకృష్ణ, రాపల్లి శ్రీధర్‌ భగవంతరావు నగర్‌లో నిర్వహించిన కార్నర్‌ మీటింగ్‌లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి చెన్నమనేని వికాస్‌రావును గెలిపించాలని కోరారు.

బీజేపీలో చేరిన అజ్మీరా తండా బీఆర్‌ఎస్‌ సర్పంచ్‌

కోనరావుపేట : కోనరావుపేట మండలం అజ్మీరతండా బీఆర్‌ఎస్‌ సర్పంచ్‌ దివ్య ప్రవీణ్‌ బీఆర్‌ఎస్‌ నుంచి ఆదివారం బీజేపీలో చేరారు. దీంతో బీఆర్‌ఎస్‌ పార్టీకి భారీ షాక్‌ తగిలింది. అజ్మీరా తండా బీఆర్‌ఎస్‌ సర్పంచ్‌ దివ్య ప్రవీణ్‌ బీజేపీ వేములవాడ ఎమ్మెల్యే అభ్యర్థి చెన్నమనేని వికాస్‌ రావు సమక్షంలో బీజేపీలో చేరారు.

Updated Date - 2023-11-19T23:52:51+05:30 IST