బడ్జెట్‌లో బీసీలకు మరోసారి అన్యాయం

ABN , First Publish Date - 2023-02-07T00:15:04+05:30 IST

బడ్జెట్‌లో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం జరిగిన బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా ఆయన విలేకరులతో మాట్లాడారు.

బడ్జెట్‌లో బీసీలకు మరోసారి అన్యాయం
సమస్యలు తెలుసుకుంటున్న ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

- బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

ధర్మారం, ఫిబ్రవరి 6: బడ్జెట్‌లో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం జరిగిన బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో సగం బీసీలు ఉంటే బడ్జెట్‌లో కేవలం మూడు శాతం నిధులు మాత్రమే కేటాయించారని ఆయన మండిపడ్డారు. రూ. 1.5లక్షల కోట్లు కేటాయిచాల్సిన చోట కేవలం రూ. 6వేల కోట్లు కేటాయించి బీసీలపై వివక్షత చూపారని ఆయన ఆరోపించారు. బీసీల కోసం ఖర్చు చేయాల్సిన సొమ్ముతో పాలకులు లిక్కర్‌ స్కాం, సొంత విమానాల కొనుగోలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో మైనార్టీలు పది శాతం ఉంటే రూ. 2వేల కోట్లు మాత్రమే కేటాయించారన్నారు. బహుజన ప్రజలను మోసం చేయడానికి సీఎం కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో బహుజన సమాజ్‌ పార్టీకి పెరుగుతున్న ఆదరణను చూసి ఎస్సీ సామాజిక వర్గాన్ని దూరం చేయడం కోసమే బడ్జెట్‌లో ఎస్సీలకు అత్యధికంగా రూ. 36వేల కోట్లు కేటాయించారని ఆయన ఆరోపించారు. మండలంలోని నర్సింగాపూర్‌, పత్తిపాక, మల్లాపూర్‌, కటికెనపల్లి, బంజేరుపల్లి, ధర్మారంలో జరిగిన యాత్రలో భాగంగా ప్రజల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. యాత్రలో జిల్లా ఇన్‌చార్జి మద్దెల నారాయణ, నియోజకవర్గ ఇన్‌చార్జి నక్క విజయ్‌, మండల శాఖ అధ్యక్షుడు ప్రశాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-07T00:15:07+05:30 IST