బ్యాంకర్లు రుణాల లక్ష్యాలను చేరుకోవాలి

ABN , First Publish Date - 2023-02-21T23:43:40+05:30 IST

బ్యాంకర్లు ప్రజలకు అందించే రుణాల్లో నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ అన్నారు

బ్యాంకర్లు రుణాల లక్ష్యాలను చేరుకోవాలి
ట్రాన్స్‌జెండర్‌కు రుణ మంజూరి పత్రాన్ని అందజేస్తున్న కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌

కరీంనగర్‌, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): బ్యాంకర్లు ప్రజలకు అందించే రుణాల్లో నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్‌ త్రైమాసికం వరకు జరిగిన ప్రగతిపై బ్యాంకర్లతో మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో డీసీ, డీఎల్‌ఆర్సీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ నుంచి డిసెంబరు వరకు 6751.54 కోట్ల రుణాలను మంజూరు చేసినట్లు తెలిపారు. ఇందులో భాగంగా వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలకు 2691.43 కోట్లు ఎంఎస్‌ఎంఈ రంగంలో 1222.54 కోట్లు, విద్యా రుణాలకు 17 కోట్లు, హౌసింగ్‌ లోన్స్‌ 83 కోట్లు, ఎస్‌హెచ్‌జీ గ్రూపులకు 657 కోట్లు, ఇతర రంగాలకు సంబంధించి 2081 కోట్ల రుణాలను మంజూరు చేసినట్లు తెలిపారు. అర్హులైన రైతులందరికీ రుణాలు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుత సంవత్సరంలో అగ్రికల్చర్‌ ఇన్ఫాస్ట్రక్చర్‌ ఫండ్‌ కింద 21 కోట్ల రుణాలు అందించాలని ఆదేశించారు.జిల్లా ఆర్థికంగా ఎదుగుతున్న కారణంగా నూతన పరిశ్రమలను స్థాపించడానికి అర్హులైన వారికి రుణాలు అందించాలని ఆదేశించారు. కొత్త పంట రుణాలు, డెయిరీ రుణాపై దృష్టి సారించాలని సూచించారు. సైబర్‌ మోసాలు, ఓటీపీల షేరింగ్‌ వల్ల నిరక్షరాస్యులు, గ్రామీణ ప్రాంత ప్రజలు మోసపోకుండా అవగాహన కల్పించాలన్నారు. బ్యాంకర్లు, జిల్లా అధికారులందరూ సమిష్టిగా కృషి చేసి జిల్లా అభివృద్ధి కోసం పని చేయాలన్నారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ గరిమా అగర్వాల్‌, జడ్పీ సీఈవో ప్రియాంక, లీడ్‌ బ్యాంక్‌ డిస్ర్టిక్ట్‌ మేనేజర్‌ ఆంజనేయులు, ఆర్‌బీఐ అధికారి సాయిచరణ్‌, నాబార్డు ఏజీఎం అనంత్‌, ఎస్‌బీఐ ఏజీఎం రవిశేఖర్‌, యుబీఐ ఏజీఎం వంశీకృష్ణ, అన్ని బ్యాంకుల కంట్రోలర్స్‌, కరీంనగర్‌ లోకల్‌ బ్రాంచి మేనేజర్స్‌, జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్‌, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్‌ మేనేజర్‌ నవీన్‌ మెప్మా, పీడీ రవీందర్‌, జిల్లా ఉద్యానవనశాఖ అధికారి శ్రీనివాస్‌, జిల్లా పశు సంవర్థకశాఖ అధికారి నరేందర్‌, పాల్గొన్నారు.

నీటి ఎద్దడి సమస్యలు రాకుండా ప్రణాళికలు సిద్ధం చేయాలి

రానున్న వేసవిలో నీటి ఎద్దడి సమస్యలు రాకుండా పక్కా ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఇరిగేషన్‌ అధికారులతో నీటి ఎద్దడి సమస్యలపై కలెక్టర్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎల్‌ఎండీలో డెడ్‌ స్టోరేజీలోను ఇంట్రా, రూరల్‌ వాటర్‌ సప్లయి సజావుగా జరిగేలా చూడాలని అన్నారు.

ట్రాన్స్‌జెండర్‌కు పీఎంఈజీపీ ద్వారా రుణం

కరీంనగర్‌ టౌన్‌: పీఎంఈజీపీ పథకం కింద స్వయం ఉపాధి యూనిట్‌ స్థాపన కోసం రాష్ట్రంలోనే ప్రథమంగా జిల్లాలోని ట్రాన్స్‌జెండర్‌కు సబ్సిడీ రుణం మంజూరు చేసినట్లు కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో నిర్వహించిన డీసీసీ, డీఎల్‌ఆరషీ సమావేశంలో ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్‌ జనరేషన్‌ ప్రోగ్రామ్‌ పథకం కింద స్వయం ఉపాధి కోసం ట్రాన్స్‌జెండర్‌కు రుణ మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్రంలోనే ప్రథమంగా జిల్లాలోని ట్రాన్స్‌జెండర్‌ ఆషాఢం ఆశ(ఎస్సీ)కు ఫోటోగ్రఫీ యూనిట్‌ స్థాపన కోసం ఐదు లక్షల రూపాయల రుణం మంజూరు చేశామని తెలిపారు. అనంతరం మరో ట్రాన్స్‌జెండర్‌ నక్క సింధుకు ఫోర్‌ వీలర్‌ డ్రైవింగ్‌ లైసెన్సును కలెక్టర్‌ అందజేశారు.

Updated Date - 2023-02-21T23:43:43+05:30 IST