మరో పది రోజులపాటు ‘బడి బాట’
ABN , First Publish Date - 2023-06-26T01:16:44+05:30 IST
విద్యార్థుల సంఖ్యను పెంచి ప్రభుత్వ పాఠశాలలకు పూర్వవైభవం తెచ్చేందుకు నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో ఆశించిన మేరకు పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు జరుగలేదు.
- నేటి నుంచి పాఠశాలల్లో పఠనోత్సవం
- డిప్యుటేషన్లు ఎప్పుడో...ఖాళీలు భర్తీ చేసేదెన్నడో..
కరీంనగర్ టౌన్, జూన్ 25: విద్యార్థుల సంఖ్యను పెంచి ప్రభుత్వ పాఠశాలలకు పూర్వవైభవం తెచ్చేందుకు నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో ఆశించిన మేరకు పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు జరుగలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం బడి బాట కార్యక్రమాన్ని మరో పది రోజులపాటు జూలై 6వ తేదీ వరకు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో మన ఊరు...మన బడి, మన బస్తీ...మన బడి కార్యక్రమంలో ఎంపిక చేసిన 213 పాఠశాలల ఆధునీకరణ పనులు పూర్తి కాలేదు. మరోవైపు పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయక పోవడం, బదిలీలు, పదోన్నతులు కల్పించక పోవడం, కనీసం డిప్యుటేషన్ ప్రక్రియ కూడా పూర్తి చేయక పోవడంతోపాటు పాఠశాలల్లోని సమస్యలను పరిష్కరించక పోవడంపై ఉపాధ్యాయ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతున్నది. ఈ నేపథ్యంలో బడిబాట పొడగింపుతో కూడా లక్ష్యం మేరకు విద్యార్థుల చేరిక కష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పుస్తక పఠనం కోసం ఓక పీరియడ్
జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నేటి నుంచి పఠనోత్సవం కార్యక్రమం నిర్వహించనున్నారు. రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు ఈ నెల 26 నుంచి జూలై 31 వరకు ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు పఠనోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. విద్యార్థులు చదవడం ఒక అలవాటుగా చేసుకోవడం, చదువుతూ ఆనందం పొందడం, స్వతంత్ర పాఠకులుగా ఎదగడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం. పాఠశాల స్థాయిలో ఉపాధ్యాయులందరూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రధానోపాధ్యాయులను ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు. కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు పుస్తక పఠనం కోసం ఒక పీరియడ్(లైబ్రరీ) కేటాయించనున్నారు. ప్రతి రోజు ప్రతి పీరియడ్‌లో ప్రతి ఉపాధ్యాయుడు తన సబ్జెక్టుకు సంబంధించిన అంశాన్ని విద్యార్థులతో పది నిమిషాల బాహ్య పఠనం చేయిస్తారు. చార్టులపై లేదా నల్లబల్లలపై పదాలను రాసి ప్రదర్శిస్తారు. విద్యార్థులతో కథల పుస్తకాలు చదివించనున్నారు. మూడు రోజులు మాతృభాషలో, మిగతా మూడు రోజులు ఆంగ్ల భాషలోకి కథల పుస్తకాలు చదివిస్తారు. గ్రంథాలయ కమిటీలను ఏర్పాటు చేసి విద్యార్థుల ఆసక్తికి అనుగుణంగా పుస్తకాలు ఎంపిక చేసుకుని చదివేలా ప్రోత్సహిస్తారు. విద్యార్థులు చదివే స్థాయిని బట్టి వారిని గ్రూపులుగా విభజించి ఒకరికొకరు సహాయం చేసుకునే విధంగా చూస్తారు. ఇంటి వద్ద విద్యార్థులు చదివేలా గ్రంథాలయ పుస్తకాలతోపాటు రకరకాల మ్యాగజైన్లు ఇచ్చి తల్లిదండ్రులకు చదివి వినిపించేలా చర్యలు తీసుకోనున్నారు. ప్రతిరోజు ప్రార్థన సమయంలో ఇద్దరు, ముగ్గురు విద్యార్థులతో పుస్తకాలను చదివించనున్నారు. వాటిని వీడియో తీసి పాఠశాల గ్రూపులలో షేర్ చేయనున్నారు. విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంచేందుకు ప్రతి శనివారం పఠన పోటీలు నిర్వహిస్తారు.
ప్రతి నెల మూడో శనివారం తల్లిదండ్రులతో సమావేశం
ప్రతి నెలలో మూడో శనివారం తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి విద్యార్థులతో చదివిస్తారు. బాగా చదివే పిల్లలను అభినందిస్తారు. విద్యార్థుల పుట్టిన రోజు సందర్భంగా వారికి బహుమతులుగా పుస్తకాలను అందించనున్నారు. స్వచ్ఛంద సంస్థలను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయనున్నారు. అన్ని పాఠశాలలో జూలై 10 నుంచి 15 వరకు గ్రంఽథాలయ వారోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహిస్తారు. జూలై 15న అన్ని పాఠశాలల్లో తల్లిదండ్రులసమావేశాన్ని నిర్వహించనున్నారు, దీనికి ప్రముఖులను ఆహ్వానించనున్నారు. ప్రతి ఉపాధ్యాయుడు తమ తరగతిలో ఎంతమంది విద్యార్థులు ధారాళంగా చదువుతారు, ఎంత మంది నెమ్మదిగా చదువుతారు, ఎంతమంది చదువు రానివారు ఉన్నారు తదితర వివరాలు కలిగి ఉండాలని, ప్రధానోపాధ్యాయుల వద్ద మొత్తం పాఠశాలలకు సంబంధించి వివరాలు ఉండాలని విద్యాశాఖ ఆదేశించింది. కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు తమ పరిధిలోని అన్ని పాఠశాలలను నెలకు ఒకసారి కనీసంగా సందర్శించి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించాలి, సమీక్షించుకోవాలని సూచించారు.
నెలకోసారి జిల్లా స్థాయి సమీక్ష సమావేశం
మండల విద్యాధికారులు, నోడల్ అధికారులు తొలిమెట్టు కార్యక్రమంలో సూచించిన విధంగా వివిధ పాఠశాలలను సందర్శించినప్పుడు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించనున్నారు. మండల, జిల్లా స్థాయిలో తెలుగు, ఆంగ్లం, హిందీ, ఉర్దూ మీడియం ఉపాధ్యాయులతో కోర్ కమిటీ టీం ఏర్పాటు చేసి, వారు ఒక వాట్సాప్ గ్రూపు ద్వారా కథలు, గేయాలు, ఆడియో స్టోరిస్ మొదలైన వాటిని పాఠశాలలకు పంపేలా చూడాలని ఆదేశించారు. జిల్లా స్థాయిలో నెలకోసారి మండల విద్యాధికారులు, నోడల్ అధికారులు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులతో సమీక్ష సమావేశం నిర్వహించి, ఇందులో డైట్ లెక్చరర్లను భాగస్వాములను చేయనున్నారు. రాష్ట్రస్థాయిలో ఎస్‌సీఈఆర్‌టీ సమగ్ర శిక్షణ అధికారులు వివిధ జిల్లాల్లో మానిటరింగ్ నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం నిర్వహిస్తే దీని ద్వారా ఆశించిన ఫలితాలను సాధించవచ్చని భావిస్తున్నారు.