యాసంగి సాగుకు భరోసా
ABN , Publish Date - Dec 23 , 2023 | 12:54 AM
జిల్లాలో ఈ యాసంగికి సాగు నీటికి డోకా లేదు. జిల్లా రైతులకు వరప్రదాయిని అయిన శ్రీరాంసాగర్‌లో సాగుకు సరిపడా నీళ్లు ఉండడంతో ఈ సీజన్‌కు ఆన్‌అండ్‌ఆఫ్ పద్ధతిలో నీటిని విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
- విడుదలైన ఎస్సారెస్పీ నీళ్లు
- వరి సాగుకే మొగ్గు చూపుతున్న రైతులు
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
జిల్లాలో ఈ యాసంగికి సాగు నీటికి డోకా లేదు. జిల్లా రైతులకు వరప్రదాయిని అయిన శ్రీరాంసాగర్‌లో సాగుకు సరిపడా నీళ్లు ఉండడంతో ఈ సీజన్‌కు ఆన్‌అండ్‌ఆఫ్ పద్ధతిలో నీటిని విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెండురోజుల క్రితం కాకతీయ ప్రధాన కాలువకు నీటిని విడుదల చేయడంతో జిల్లాకు చేరాయి. ఎస్సారెస్పీలో శుక్రవారం నాటికి 76.743 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. కాకతీయ ప్రధాన కాలువకు 3,500 టీఎంసీల నీటిని వదిలిపెడుతున్నారు. జిల్లాలో డి-83 కాలువ ద్వారా 1,03,339 ఎకరాలు, డి-86 ద్వారా 79,360 ఎకరాలు, మొత్తం 1,82,699 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ యాసంగి సీజన్‌లో 2,10,000 ఎకరాల్లో వరి, మొక్కజొన్న, వివిధ రకాల పంటలు సాగు కావచ్చని అధికారులు అంచనా వేశారు. ఇందులో అత్యధికంగా లక్షా 95 వేల ఎకరాల్లో వరి సాగు కావచ్చని వ్యవసాయ శాఖాధికారులు అంచనా వేశారు. ఎస్సారెస్పీలో యాసంగికి సరిపడా నీళ్లు ఉన్నాయని భావించిన రైతులు అధికంగా వరి పంట సాగుపైనే దృష్టి సారించారు. ఇప్పటికే వ్యవసాయ బావుల పరిధిలో కొంత మంది రైతులు వరి నార్లు పోయగా, వ్యవసాయ బావులు లేని రైతులు కాలువ నీళ్లు వస్తుండడంతో నార్లు పోసేందుకు సన్నద్ధం అవుతున్నారు. ఈ సీజన్‌లో సన్న రకాలకు బదులు దొడ్డు రకం 1010ధాన్యం, ఐఆర్-64 వంటి రకాలను రైతులు సాగు చేస్తున్నారు. తక్కువ కాల వ్యవధిలో సాగయ్యే పంటలనే సాగు చేయాలని రైతులు భావిస్తున్నారు. ఏప్రిల్ వరకు కోతకు వచ్చే వరి రకాలను సాగు చేస్తున్నారు.
ఫ సుమారు 1.95 లక్షల ఎకరాల్లో సాగు అంచనా..
గడిచిన వర్షాకాలం సీజన్‌లో కూడా ఆశించిన స్థాయికి మించి భారీ వర్షాలు కురియడంతో ఎస్సారెస్పీకి జలకళ వచ్చింది. పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో పాటు గేట్ల ద్వారా గోదావరిలోకి 144టీఎంసీల నీటిని వదిలిపెట్టారు. వానాకాలం సీజన్‌కు కూడా ఆన్‌అండ్‌ఆఫ్ పద్ధతిలో నీళ్లు ఇవ్వగా, ఇప్పుడు కూడా అదే విఽధానంలో 10 రోజులు నీటిని సరఫరా చేసి 8 రోజుల పాటు నీటిని నిలిపివేయనున్నారు. ఏప్రిల్ నెలాఖరు వరకు ఎనిమిది నుంచి పది తడుల వరకు నీటిని విడుదల చేసే అవకాశాలున్నాయి. గత ఏడాది ఇదే యాసంగి సీజన్‌లో ఎస్సారెస్పీలో 88.114 టీఎంసీల నీళ్లు ఉండగా, ఈ ఏడాది అంతకు 12 టీఎంసీల నీళ్లు తక్కువగా ఉన్నాయి. ఈ నీళ్లను పొదుపుగా వాడుకుంటేనే చివరి వరకు నీటిని విడుదల చేసే అవకాశాలు ఉంటాయి. లేనట్లయితే చివరి ఆయకట్టు భూములైన ఓదెల, కాల్వశ్రీరాంపూర్ మండలాలకు సాగు నీరు అందడం కష్టం. ఒక్క ఎకరా పంట కూడా ఎండిపోకుండా చర్యలు తీసుకోవాలి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మంథని నుంచి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పెద్దపల్లి నుంచి చింతకుంట విజయరమణారావు, రామగుండం నుంచి మక్కాన్‌సింగ్ గెలుపొందారు. శ్రీధర్‌బాబుకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి పదవి వరించింది. ఆయన నేతృత్వంలో ఎమ్మెల్యేలతో కలిసి నీటి పారుదల శాఖాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి చివరి ఆయకట్టు భూములు ఎండిపోకుండా ఉండేందుకు ఎస్సారెస్పీ నీళ్లు అందే విధంగా ప్రణాళికలు రూపొందించాలని రైతులు అభిప్రాయ పడుతున్నారు.