బకాయిలు వచ్చేనా?
ABN , Publish Date - Dec 24 , 2023 | 12:44 AM
గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి పనుల బిల్లుల బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారని సభ్యులు ప్రశ్నించారు. ప్రభుత్వం మారడంతో పెండింగ్ బిల్లులపై పలువురు సభ్యులు అనుమానాలు వ్యక్తం చేశారు. జడ్పీ చైర్‌పర్సన్ న్యాలకొండ అరుణ అధ్యక్షతన శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశం సాదాసీదాగా సాగింది
- అభివృద్ధి పనుల బిల్లులపై ప్రజాప్రతినిధుల అనుమానాలు
- అభివృద్ధి, సంక్షేమం కోసం కలిసి పనిచేద్దాం : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
- సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలి : జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ
- సాదాసీదాగా జడ్పీ సర్వసభ్య సమావేశం
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల/ కలెక్ల్టరేట్)
గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి పనుల బిల్లుల బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారని సభ్యులు ప్రశ్నించారు. ప్రభుత్వం మారడంతో పెండింగ్ బిల్లులపై పలువురు సభ్యులు అనుమానాలు వ్యక్తం చేశారు. జడ్పీ చైర్‌పర్సన్ న్యాలకొండ అరుణ అధ్యక్షతన శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశం సాదాసీదాగా సాగింది. ప్రభుత్వం మారిన తరువాత తొలిసారి జరిగిన సమావేశానికి వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ హాజరయ్యారు. శ్రీనివాస్‌ను జడ్పీ చైర్‌పర్సన్ న్యాలకొండ అరుణ, సభ్యులు, అధికారులు సన్మానించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అదనపు కలెక్టర్ గౌతమిని ప్రజాప్రతినిధులు సన్మానించారు. అనంతరం వేములవాడ ఎంపీపీ బండ మల్లేశం మాట్లాడుతూ పశువుల పాకల నిర్మాణాలు పూర్తి కావాల్సినవి ఉన్నాయని, బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు. మర్రిపల్లి కస్తూర్బాపాఠశాలలో మరుగుదొడ్లు లేక విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. మరుగుదొడ్ల నిర్మాణాల పేరిట తల్లిదండ్రుల నుంచి డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. అదనపు డీఆర్‌డీవో మదన్‌మోహన్ ఎన్నికల కోడ్ ఉండడంతో నిర్మాణాలు నిలిచిపోయాయని, ప్రభుత్వ అదేశాలు రావడంతోనే పనులు ప్రారంభిస్తామని అన్నారు. ముస్తాబాద్ ఎంపీపీ జనగామ శరత్‌రావు మాట్లాడుతూ వైకుంఠధామాల నిర్మాణాలకు సంబధించి చివరి బిల్లు రాకపోవడంతో సర్పంచులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. లక్షల రూపాయలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. మిషన్‌భగీరథ నల్లాల ద్వారా బురదనీరు వస్తోందని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మిషన్‌భగీరథ పాత ట్యాంకులు లీకేజీ అవుతున్నాయన్నారు. పంచాయతీ రాజ్ ఈఈ సూర్యప్రకాష్ మాట్లాడుతూ పనులు జరిగిన దానిని బట్టి బిల్లుల చెల్లించామన్నారు. త్వరలోనే బిల్లులు చెల్లిస్తామన్నారు. మిషన్‌భగీథర ఈఈ జానకి మాట్లాడుతూ దెబ్బతిన్న చోట మరమ్మతు చేస్తున్నామని గ్రామస్థుల ముందే నీటి పరీక్షించి తాగే విధంగా అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఎల్లారెడ్డిపేట జడ్పీటీసీ చీటి లక్ష్మణ్‌రావు మాట్లాడుతూ డబుల్ బెడ్‌రూం ఇళ్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, ఇప్పించాలని కోరారు. కోనరావుపేట ఎంపీపీ చంద్రయ్య మాట్లాడుతూ కుల సంఘాలకు సంబంధించిన కమ్యూనిటీ హాల్‌ల నిర్మాణాలకు గత వేములవాడ ఎమ్మెల్యే ప్రొసీడింగ్‌లు ఇచ్చారని, ప్రభుత్వం మారడంతో నిర్మాణాలు జరుగుతాయా? అని అనుమానం వ్యక్తం చేశారు. ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ మాట్లాడుతూ ఇప్పటికే మొదలైన నిర్మాణాలు కొనసాగిస్తామని, ఇంకా మొదలు పెట్టనివాటిపై ప్రభుత్వ నిర్ణయం ప్రకారం చేపడుతామని అన్నారు. ఎంపీపీ చంద్రయ్య మాట్లాడుతూ ప్రధాన రోడ్లపై అనుమతులు లేకుండానే స్పీడ్ బ్రేకర్లునిర్మించారని దీంతో వాహనదారులు ఇబ్బందుడు పడుతున్నారని అన్నారు. కొలనూర్, ధర్మారం వద్ద ఇద్దరు వాహనదారులు చనిపోయిన సంఘటనలు ఉన్నాయని అన్నారు. గాయపడిన వారిని జిల్లా అసుపత్రికి పంపిస్తే పట్టించుకోక నిర్లక్ష్యంగా వ్యవహరించారని ప్రజాప్రతినిధిగా స్కానింగ్ చేయాలని కోరినా కరీంనగర్‌కు పంపించారని అన్నారు. జడ్పీ చైర్‌పర్సన్ న్యాలకొండ అరుణ స్పందిస్తూ ఆసుపత్రిలో పూర్తిస్థాయిలో సేవలు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని, ప్రమాద భరితంగా ఉన్న స్పీడ్ బ్రేకర్లను తొలగించాలని సూచించారు. తంగళ్లపల్లి జడ్పీటీసీ పూర్మాణి మంజుల మాట్లాడుతూ తంగళ్లపల్లి, పద్మనగర్, ఇందిరానగర్, అంకుసాపూర్ గ్రామాల్లో అంగన్‌వాడీ కేంద్రాల భవన నిర్మాణాలను పూర్తి చేయాలని కోరారు. సంక్షేమాధికారి లక్ష్మీరాజం స్పందిస్తూ సాంకేతిక కారణాలతో నిర్మాణాలు నిలిచిపోయాయని, మళ్లీ కొనసాగిస్తామని అన్నారు. గంభీరావుపేట ఎంపీపీ వంగ కరుణ మాట్లాడుతూ కుట్టు మిషన్ల లబ్ధిదారుల సమాచారం ప్రజాప్రతినిధులకు ఇవ్వకపోవడంతో లబ్ధిదారులు సమాచారం కోసం వస్తున్నారని సమాచారం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. తంగళ్లపల్లి ఎంపీపీ మానస మాట్లాడుతూ క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవులకు ఇచ్చే గిఫ్ట్ ఫ్యాక్‌లు తక్కువ వచ్చాయని, వేడుకలకు రూ.30 వేలకు బదులు రూ.20 వేలు ఇచ్చారని అన్నారు. గతంలో మాదిరిగానే ఇవ్వాలని కోరారు. వీర్నపల్లి ఎంపీపీ బూల మాట్లాడుతూ వీర్నపల్లిలో వంతెన రోడ్డు నిర్మాణాలు పూర్తికాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు మాట్లాడుతూ ఇల్లంతకుంట మండలంలో ఈ సారి పొద్దు తిరుగుడు సాగు ఎక్కువగా చేశారని, సిరిసిల్లలోని మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని కోరారు. జడ్పీ చైర్‌పర్సన్ అరుణ మాట్లాడుతూ సభ్యులు పెండింగ్ బిల్లులు, ప్రభుత్వం మారడంపై అందోళన చెందుతున్నారని విప్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ పూజారి గౌతమి, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, జడ్పీ సీఈవో గౌతంరెడ్డి, ముస్తాబాద్ జడ్పీటీసీ నర్సయ్య, వీర్నపల్లి జడ్పీటీసీ కళావతి, గంభీరావుపేట జడ్పీటీసీ విజయ, బోయినపల్లి జడ్పీటీసీ కత్తెరపాక ఉమ, వేములవాడ రూరల్ జడ్పీటీసీ ఏశ వాణి, చందుర్తి జడ్పీటీసీ నాగం కుమార్, వేములవాడ అర్భన్ జడ్పీటీసీ మ్యాకల రవి, కో ఆప్షన్‌సభ్యుడు చాంద్‌పాషా, ఎంపీపీలు పిల్లి రేణుక, తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వ తోడ్పాటు
- ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అది శ్రీనివాస్
అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లలా ప్రభుత్వం భావిస్తున్నందున పథకాలు క్షేత్ర స్థాయిలో ప్రభావవతంగా అమలయ్యేలా జిల్లా అధికారులు కృషి చేయాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరారు. త్వరలోనే జిల్లాలో నెలకొన్న సమస్యలపై కలెక్టర్, జిల్లా అధికారులతో సమీక్షిస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీన ప్రాంతాల సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తోందన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో మహాలక్ష్మీ పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణా సౌకర్యాన్ని కల్పించినట్లు, రూ.5లక్షలకే పరిమితమైన రాజీవ్ ఆరోగ్యశ్రీ మొత్తాన్ని రూ.10లక్షలకు పెంచినట్లు చెప్పారు. మిగిలిన నాలుగు పథకాలను 100 రోజుల్లో ప్రారంభిస్తామన్నారు. గత ప్రభుత్వం మిగిల్చిన బడ్జెట్‌ను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని అసెంబ్లీలో చర్చిస్తున్నామన్నారు. వాటిపై శ్వేత పత్రాలను విడుదల చేసి ప్రజలకు వివరిస్తున్నామని తెలిపారు. పండుగలు వచ్చిన సందర్భంగా అసెంబ్లీ సమావేశాలను వాయిదా వేసినట్లు చెప్పారు. జడ్పీటీసీలు, ఎంపీపీలు సమస్యల పరిష్కారానికి సర్వసభ్య సమావేశాన్ని వేదికగా ఉపయోగించుకోవాలన్నారు. ముఖ్య సమస్యలు ఉంటే సర్వసభ్య సమావేశం జరిగే వరకు వేచి చూడకుండా తన దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. స్నేహపూర్వక వాతావరణంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తూ అంకిత భావంతో పని చేయాలన్నారు.
సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలి
- జడ్పీ చైర్‌పర్సన్ న్యాలకొండ అరుణ
జడ్పీ సమావేశంలో సభ్యులు ప్రస్తావించిన సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని, సాధ్యమైనంత త్వరగా అధికారులు పరిష్కారం చూపాలని జడ్పీ చైర్‌పర్సన్ న్యాలకొండ అరుణ అన్నారు. మండలాల్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాల గురించి ఎంపీపీలు, జడ్పీటీసీలతో సహా స్థానిక ప్రజాప్రతినిధులకు అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. సమస్యలపై అలసత్వం చూడకుండా వెంటనే పరిష్కరించాలని అన్నారు.
సమస్యలను పరిష్కరిస్తాం
- అదనపు కలెక్టర్ పూజారి గౌతమి
జిల్లా పరిషత్ సమావేశంలో సభ్యులు తీసుకొచ్చిన సమస్యలపై అధికారులతో చర్చిస్తామని అదనపు కలెక్టర్ పూజారి గౌతమి అన్నారు. సమస్యలను పరిశీలించి పరిష్కరిస్తామని, అధికారులు, ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు.
ప్రభుత్వ విప్‌కు ఘన స్వాగతం
ప్రభుత్వ విప్‌గా బాధ్యతలు స్వీకరించి తొలిసారిగా జడ్పీ సమావేశానికి వచ్చిన ఆది శ్రీనివాస్‌కు అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. జడ్పీ చైర్‌పర్సన్ న్యాలకొండ అరుణ, జిల్లా అదనపు కలెక్టర్లు పూజారి గౌతమి, ఖీమ్యానాయక్‌తోపాటు జిల్లా అధికారులు ఉన్నారు.