ఏకగ్రీవ పంచాయతీలకు ఏదీ ప్రోత్సాహం?
ABN , Publish Date - Dec 17 , 2023 | 12:35 AM
ఏకగ్రీవంగా సర్పంచులతో సహా పాలకవర్గాన్ని ఎన్నుకునే గ్రామపంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల రూపాయల నజరానా ప్రకటించింది. దీంతో అనేక గ్రామాల్లో ప్రజలంతా కలిసి గ్రామ సమస్యల పరిష్కారం, అభివృద్ధిని కాంక్షిస్తూ ఏకగ్రీవంగా సర్పంచులతోపాటు పాలకవర్గాన్ని ఎన్నుకున్నారు.
- ఎన్నికలు సమీపిస్తున్నా అందని నజరానా
- కాంగ్రెస్ సర్కారైనా అందించేనా.... ఆనవాయితీని కొనసాగించేనా
కరీంనగర్ టౌన్, డిసెంబరు 16: ఏకగ్రీవంగా సర్పంచులతో సహా పాలకవర్గాన్ని ఎన్నుకునే గ్రామపంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల రూపాయల నజరానా ప్రకటించింది. దీంతో అనేక గ్రామాల్లో ప్రజలంతా కలిసి గ్రామ సమస్యల పరిష్కారం, అభివృద్ధిని కాంక్షిస్తూ ఏకగ్రీవంగా సర్పంచులతోపాటు పాలకవర్గాన్ని ఎన్నుకున్నారు. ఒక్కో ఊరిలో ఇద్దరు, ముగ్గురు అంతకంటే ఎక్కువ మంది కూడా సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల పదవులపై ఆశలు పెంచుకొని పోటీకి సిద్ధమయ్యారు. ఆ ఊరు జనమంతా కలిసి ఏకగ్రీవ ఎన్నికకు పోటీలోని అభ్యర్థులను ఒప్పించి ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సహాయంతో గ్రామంలోని కొన్నైనా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని భావించివారి పోటీ నుంచి తప్పించారు. దీతో గ్రామపంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. 2019లో నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 106 గ్రామపంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. కరీంనగర్ జిల్లాలో 15, పెద్దపల్లిలో 13, జగిత్యాలలో 37, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 41 ఏకగ్రీవ పంచాయతీలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఐదు లక్షల రూపాయల సాయంతో కొన్ని ఏకగ్రీవ గ్రామాల్లో అత్యవసర పనులకు పాలకవర్గాలు తీర్మానం చేసుకొని పనులను కూడా పూర్తి చేసి ప్రభుత్వం ఇచ్చే నిధుల కోసం నిరీక్షిస్తున్నారు.
ఫ పదవీకాలం ముగియనున్నా...
గ్రామపంచాయతీ పాలకవర్గాల పదవీ కాలం 2024 జనవరితో ముగియనుంది. తిరిగి ఎన్నికలను కూడా జనవరిలోనే నిర్వహిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికీ ఏకగ్రీవ గ్రామపంచాయతీలకు ప్రభుత్వం ఐదు లక్షల రూపాయల నజరానాలో రూపాయి కూడా విడుదల చేయలేదు. దీంతో ఆయా గ్రామాల సర్పంచ్‌లు, పాలకవర్గ సభ్యులు పలుమార్లు ప్రభుత్వం దృష్టికి ఆదర్శ గ్రామ పంచాయతీల ప్రోత్సాహ నగదును ఇప్పించాలని కోరినప్పటికీ ఫలితం లేదు. కొన్ని గ్రామాల్లో సర్పంచ్‌లు, పాలకవర్గ సభ్యులు ప్రభుత్వం డబ్బులు ఇస్తే తీసుకుంటామనే భావనతో పనులు పూర్తిచేయగా, మరికొందరు పనులను మధ్యలోనే నిలిపివేశారు. కొన్ని చోట్ల అసలు ఆ డబ్బులు రాకపోవడంతో ఎలాంటి పనులు చేపట్టక గ్రామస్థులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వమైనా వచ్చే గ్రామ పంచాయతీ ఎన్నికల్లోపు ఏకగ్రీవ గ్రామపంచాయతీలకు గత ప్రభుత్వం ప్రకటించిన ఐదు లక్షల రూపాయలను ఇస్తుందని సర్పంచులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఫ కొత్త ప్రభుత్వమైనా ప్రోత్సాహం ఇవ్వాలి..
- మొగుళ్ల ఎల్లయ్య, ఇన్‌చార్జి సర్పంచ్, పందికుంటపల్లి, రామడుగు మండలం
ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామపంచాయతీలకు ఐదు లక్షల రూపాయల ప్రోత్సాహం ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది కానీ ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వలేదు. నాలుగున్నరేళ్లుగా ప్రోత్సాహం కోసం ఎదురు చూస్తున్నా ఫలితం లేదు. గ్రామంలో ఎనిమిదిన్నర లక్షల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు చేశాం. అప్పులు తెచ్చి పనులు చేసినా వాటి బిల్లులు ప్రభుత్వం ఇవ్వలేదు. గత ప్రభుత్వం ఏకగ్రీవ గ్రామపంచాయతీలకు ప్రోత్సాహం ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసిది. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వమైనా అందిస్తుందని ఆశిస్తున్నా...
ఫ బీఆర్‌ఎస్ సర్కార్ మోసం చేసింది
- చింతలపల్లి నర్సింహారెడ్డి, సర్పంచ్, సాంబయ్యపల్లి, గన్నేరువరం మండలం
గత బీఆర్‌ఎస్ సర్కార్ ఏకగ్రీవ గ్రామపంచాయతీలకు ఇస్తామని ప్రకటించిన ఐదు లక్షల రూపాయల నజరానాను ఇవ్వకుండా మోసం చేసింది. ఎమ్మెల్యే ఫండ్ నుంచి 15 లక్షల ఇస్తానని ప్రకటించిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాటతప్పారు. ఈ నిధులతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవచ్చని, నన్ను ఏకగ్రీవంగా ప్రజలు ఎన్నుకున్నారు. నిధులు రాక గ్రామంలో అభివృద్ధి కుంటుపడింది. సీసీ రోడ్లు వేసేందుకు కూడా నిధులు లేవు. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు ఇచ్చి అభివృద్ధి చేస్తాయని ఆశిస్తున్నాం.
ఫ కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీలను బలోపేతం చేస్తుంది
- సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఉప్పుల అంజనీప్రసాద్
రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామపంచాయతీలకు ప్రోత్సాహాన్ని అందించి బలోపేతం చేస్తుందని ఆశిస్తున్నాము.. సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామపంచాయతీలకు ఐదు లక్షల రూపాయలను వెంటనే విడుదల చేశారు.. ఇప్పుడూ అదే తరహాలో ప్రోత్సాహం ఇవ్వాలని, పెండింగ్ బిల్లులను కూడా చెల్లించాలని ప్రభుత్వానికి వినతిపత్రం అందిస్తాం.