సిరిసిల్లకు మరో మణిహారం

ABN , First Publish Date - 2023-04-12T01:16:57+05:30 IST

విద్యారంగంలో ప్రత్యేకహబ్‌గా మారుతున్న జిల్లాలో మరో మణిహారం ఆవిష్కృతం కానుంది. రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద వ్యవసాయ డిగ్రీ కళాశాల క్యాంపస్‌ ఆధునిక హంగులతో రూపుదిద్దుకుంది.

సిరిసిల్లకు మరో మణిహారం
వ్యవసాయ డిగ్రీ కళాశాల భవన సముదాయం

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

విద్యారంగంలో ప్రత్యేకహబ్‌గా మారుతున్న జిల్లాలో మరో మణిహారం ఆవిష్కృతం కానుంది. రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద వ్యవసాయ డిగ్రీ కళాశాల క్యాంపస్‌ ఆధునిక హంగులతో రూపుదిద్దుకుంది. తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల శివారులో 35 ఎకరాల విస్తీర్ణంలో రూ.69.50 కోట్ల వ్యయంతో వ్యవసాయ కళాశాల భవన సముదాయం నిర్మించారు. బుధవారం వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు ప్రారంభించనున్నారు. కళాశాల భవన ప్రారంభోత్సవం అనంతరం రైతులను, ప్రజలను ఉద్దేశించి మంత్రులు ప్రసంగిచేందుకు వేదికను సిద్ధం చేశారు.

16 ఎకరాల్లో జీ ప్లస్‌ 2 భవన నిర్మాణాలు

సిరిసిల్లలో వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాలకు తోడుగానే 2018లో వ్యవసాయ డిగ్రీ కళాశాల మంజూరైంది. తాత్కాలికంగా సర్ధాపూర్‌లోని వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాలలో తరగతులు ప్రారంభించారు. విద్యార్థులకు అన్ని సౌకర్యాలు ఉండే విధంగా 35 ఎకరాల్లో చేపట్టిన వ్యవసాయ డిగ్రీ కళాశాల స్థలంలో 16 ఎకరాల్లో జీ ప్లస్‌ 2 పద్ధతిలో కళాశాల భవనం, విద్యార్థినీ, విద్యార్థులకు వేర్వేరు హాస్టల్‌లు నిర్మించారు. 19 ఎకరాల్లో వ్యవసాయ పరిశోధన కేంద్రం, ఫాంలాండ్స్‌, అత్యాఽధునిక కంప్యూటర్‌ ల్యాబ్‌, ప్రయోగశాల, కాన్ఫరెన్స్‌హాల్‌, అధ్యాపకులకు గదులు, ఆధునిక ల్రైబెరీ, డీన్‌ చాంబర్‌ వంటివి నిర్మించారు. అంతకుముందు 2015-2016లో ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా పాలిటెక్నిక్‌ కళాశాల ప్రారంభించారు. రెండేళ్ల కోర్సులో 60 మంది విద్యార్థులతో ప్రత్యేక తరగతుల కోసం ఆధునిక భవనాన్ని నిర్మించి ప్రారంభించారు. డిగ్రీ కళాశాల నిర్వహణతో పాలిటెక్నిక్‌ విద్యార్థులకు సిద్దిపేటలో తరగతులు బోధిస్తున్నారు. డిగ్రీ కళాశాల భవనం పూర్తికావడంతో యథావిధిగా పాలిటెక్నిక్‌ కళాశాల కొనసాగుతోంది. వ్యవసాయ బీఎస్సీ విభాగంలో నాలుగు సంవత్సరాలపాటు విద్యార్థులకు బోధన జరగబోతోంది. ఎంసెట్‌ ద్వారా 56 మంది అడ్మిషన్లు పొంది డిగ్రీ పూర్తి చేశారు. ప్రస్తుతం బీఎస్సీ అగ్రికల్చర్‌లో 190 మంది విద్యార్థులు ప్రవేశాలు పొంది ఉన్నారు. కళాశాలలో 15 విభాగాల్లో అడ్మిషన్లు పొందవచ్చు. వ్యవసాయ శాస్త్రం, జన్యు శాస్త్రం, మొక్కల పెంపకం, మృత్తిక శాస్త్రం, వ్యవసాయ ర సాయన శాస్త్రం, కీటక శాస్త్రం, హార్టికల్చర్‌, వ్యవసాయ విస్తరణ, వ్యవసాయ ఆర్థిక శాస్త్రం, అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్‌, మైక్రో బయాలజీ, అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ తదితర కోర్సులు ఉన్నాయి. ఈ విద్యా సంవత్సరం 120 మంది అడ్మిషన్లు పొందనున్నారు. వ్యవసాయ డిగ్రీ కళాశాల వ్యవసాయ రంగానికి ఊతమిస్తుందని భావిస్తున్నారు.

సిరిసిల్ల వైపు విద్యార్థుల చూపు

విద్యారంగంలో అన్ని సంస్థలను తన ఒడిలో చేర్చుకుంటున్న రాజన్న సిరిసిల్ల జిల్లా వైపు విద్యార్థుల చూపు మరలుతోంది. ఈ విద్యా సంవత్సరం మెడికల్‌ కళాశాల అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే కేజీ టు పీజీ విద్యా సంస్థల సముదాయం, జేఎన్‌టీయూ కళాశాల పాలిటెక్నిక్‌ కళాశాల డిగ్రీ కళాశాలతోపాటు రాష్ట్రంలోనే తొలి అంతర్జాతీయ డ్రైవింగ్‌ శిక్షణ కేంద్రం, ఫైన్‌ ఆర్ట్స్‌ కళాశాలలు ఏర్పాటు చేశారు. నర్సింగ్‌ కళాశాలతోపాటు గురుకులాలు, కేజీబీవీ పాఠశాలలు, మోడల్‌ స్కూల్‌లు ఏర్పడ్డాయి, కార్పొరేట్‌ రెస్పాన్స్‌ఫండ్‌తో ప్రభుత్వ పాఠశాలలు ఆధునిక హంగులు సంతరించుకున్నాయి. ఈ క్రమంలోనే డిగ్రీ కళాశాల ప్రారంభించుకోనుండడంతో విద్యార్థులో అనందం వ్యక్తమవుతోంది.

ఏర్పాట్ల పరిశీలన

ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల శివారులో నిర్మించిన భవన సముదాయ ప్రారంభోత్సవ ఏర్పాట్లను జిల్లా అఽధికారులు, ప్రజాప్రతినిధులు మంగళవారం వేర్వేరుగా పరిశీలించారు. కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ అదనపు కలెక్టర్‌లు సత్యప్రసాద్‌, ఖీమ్యానాయక్‌ ఇతర జిల్లా అధికారులు పరిశీలించారు. జడ్పీ చైర్‌ పర్సన్‌ న్యాలకొండ అరుణ, నాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు, పవర్‌లూం టెక్స్‌టైల్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ గూడూరి ప్రవీణ్‌, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు మధు ఏర్పాట్లను పరిశీలించారు. కళాశాల భవన సముదాయాన్ని ప్రారంభించడానికి పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు, స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌, కళాశాల ప్రతినిధులు హాజరుకానున్నారు.

Updated Date - 2023-04-12T01:17:01+05:30 IST