బీఎస్పీ అభ్యర్థుల ప్రకటన
ABN , First Publish Date - 2023-10-04T02:20:36+05:30 IST
బహుజన్ సమాజ్ పార్టీ ఉమ్మడి జిల్లా పరిధిలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. బీఆర్‌ఎస్ పార్టీ మొట్ట మొదటగా తన అభ్యర్థులను ప్రకటించగా ఇతర పార్టీలు అభ్యర్థుల విషయంలో నిర్ణయం తీసుకోవడంలో తర్జనభర్జన పడుతుండగా బీఎస్పీ మాత్రం 20 మంది అభ్యర్థులను ప్రకటించింది.
- చొప్పదండికి కొంకటి శేఖర్
- మానకొండూర్‌కు నిషాని రాంచందర్
- పెద్దపల్లిలో దాసరి ఉష
- ధర్మపురి బరిలో నక్క విజయ్‌కుమార్
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
బహుజన్ సమాజ్ పార్టీ ఉమ్మడి జిల్లా పరిధిలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. బీఆర్‌ఎస్ పార్టీ మొట్ట మొదటగా తన అభ్యర్థులను ప్రకటించగా ఇతర పార్టీలు అభ్యర్థుల విషయంలో నిర్ణయం తీసుకోవడంలో తర్జనభర్జన పడుతుండగా బీఎస్పీ మాత్రం 20 మంది అభ్యర్థులను ప్రకటించింది. అందులో ఉమ్మడి జిల్లాకు చెందినవి నాలుగు స్థానాలున్నాయి. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ మంగళవారం తనతోపాటు మరో 19 మందిని అభ్యర్థులుగా ప్రకటించారు. మానకొండూర్(ఎస్సీ) స్థానానికి బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, న్యాయవాది నిషాని రాంచందర్‌ను, చొప్పదండి(ఎస్సీ)కి కొంకటి శేఖర్, పెద్దపల్లికి దాసరి ఉష, ధర్మపురి(ఎస్సీ)కి నక్క విజయ్‌కుమార్‌ను అభ్యర్థులుగా ప్రకటించారు.
మానకొండూర్ అభ్యర్థి నిషాని రాంచందర్ కరీంనగర్‌లో న్యాయవాద వృత్తిలో ఉంటూ 2004 నుంచి బహుజన్ సమాజ్ పార్టీలో కొనసాగుతున్నారు. ఆయన బీఎస్పీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. బెజ్జంకి మండలం శీలాపూర్ గ్రామానికి చెందిన రాంచందర్ ప్రస్తుతం మానకొండూర్ నుంచి అసెంబ్లీ బరిలో ఉండనున్నారు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రాంచందర్ పోటీ చేశారు.
చొప్పదండి నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించిన కొంకటి శేఖర్ రాజన్న సిరిసిల్ల జిల్లా దేశాయిపల్లి గ్రామానికి చెందినవారు. ప్రస్తుతం ఆయన బీఎస్పీ చొప్పదండి నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన తెలంగాణ విద్యార్థి ఉద్యమ జాక్ చైర్మన్‌గా, మాదిగ విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడిగా క్రియాశీలపాత్ర వహించారు. స్వేరో నెట్‌వర్క్‌లో చేరిన ఆయన ఫిట్ ఇండియా ఫౌంటేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
పెద్దపల్లి అభ్యర్థి దాసరి ఉష ఓదెల మండలం కనగర్తి గ్రామానికి చెందినవారు. ఆమె తండ్రి కూడా బహుజన్ సమాజ్ పార్టీలో పని చేస్తున్నారు. ఐఐటీ పూర్తి చేసిన ఆమె రాజకీయాల మీద ఆసక్తితో బీఎస్పీలో చేరి క్రియాశీల కార్యకర్తగా పని చేస్తున్నారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ విద్యావంతురాలైన ఆమెకు పెద్దపల్లి నుంచి పోటీ చేసే అవకాశం కల్పించారు.
ధర్మపురి అభ్యర్థి నక్క విజయ్ కుమార్ జగిత్యాల మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందినవారు. ఫ్లైట్ సూపర్‌వైజర్ వృత్తిలో ఉన్న ఆయన టీ-మాస్ అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శిగా, తెలంగాణ సామాజిక ప్రజా సంఘాల ఐక్య వేదిక జగిత్యాల చైర్మన్‌గా పనిచేశారు.