సమస్యల్లో ‘మధ్యాహ్న భోజన’ కార్మికులు

ABN , First Publish Date - 2023-06-06T01:08:56+05:30 IST

మధ్యాహ్న భోజన పథకం కార్మికులు పలు సమస్యలతో సతమతమవుతున్నారు.

 సమస్యల్లో ‘మధ్యాహ్న భోజన’ కార్మికులు

- నెలంతా పని చేస్తే ఇచ్చేది వెయ్యి రూపాయలే

- ధరలకు అనుగుణంగా పెరగని బడ్జెట్‌

కరీంనగర్‌ టౌన్‌, జూన్‌ 5: మధ్యాహ్న భోజన పథకం కార్మికులు పలు సమస్యలతో సతమతమవుతున్నారు. అరకొర వసతులతో అష్టకష్టాలు పడుతూ విద్యార్థులకు వండి పెడుతున్నా తమకు కనీస వేతనం చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని గతంలో 45 రోజుల పాటు ధర్నాలు, ఆందోళనలు నిర్వహించారు.. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పందించి మధ్యాహ్న భోజన పథకం కార్మికుల గౌరవ వేతనాన్ని నెలకు మూడు వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. 2022 ఫిబ్రవరిలో వేతనం పెంపు జీవోను ప్రభుత్వం జారీ చేసింది. కానీ వేతనాలు మాత్రం పెరగలేదు. అధికారులను అడిగితే బడ్జెట్‌ కేటాయించ లేదని చెబుతున్నారు.

రోజురోజుకు పెరుగుతున్న పని భారం

జిల్లాలో 651 ప్రభుత్వ పాఠశాలలు, 11 ఆదర్శ పాఠశాలల్లో 47,875 మంది విద్యార్థులు 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతుండగా వారికి మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నారు. ఒకటి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఒక్కొక్కరికి 5.45 పైసలు, 9,10 తరగతుల విద్యార్థులకు ఒక్కొక్కరికి 8.17 పైసలు, ఒక్కో కోడిగుడ్డుకు 5 రూపాయల చొప్పున కార్మికులకు ప్రభుత్వం చెల్లిస్తోంది. ఓవైపు మార్కెట్‌లో ఽధరలు భగ్గుమంటుంటే ప్రభుత్వం పెరిగిన ధరలకు అనుగుణంగా బడ్జెట్‌ పెంచాల్సి ఉండగా ఆ ధరలను మాత్రం సవరించడం లేదు. సరికదా మధ్యాహ్న భోజనం మెనూలో మార్పులు చేస్తూ వంటకార్మికులకు ఆర్థిక భారంతోపాటు పనిభారం పెంచుతోందనే విమర్శలున్నాయి. ఈ విద్యాసంవత్సరం నుంచి రాగి జావా కూడా విద్యార్థులకు ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికులకు ఎలాంటి హెల్పర్లను ఇవ్వకుండానే ఆ పని కూడా మీరే చేయాలంటూ ఆదేశించింది. మార్కెట్‌లో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ప్రస్తుత బడ్జెట్‌ను సవరించాలని, 1 నుంచి 8వ తరగతి విద్యార్థి ఒక్కొక్కరికి 15, తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు 20 రూపాయలు ఇవ్వాలని కార్మికులు కోరుతున్నారు. కార్మికుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

నెలల తరబడి బిల్లుల పెండింగ్‌

ప్రభుత్వమే విద్యార్థులకు అవసరమైన బియ్యం సరఫరా చేస్తున్నా హమాలీ చార్జీలు మధ్యాహ్న భోజన కార్మికులే భరిస్తున్నారు. ఇన్ని చేసినా నెలవారిగా మెస్‌ బిల్లులు చెల్లిస్తారా అంటే అదీ లేదు. మూడు, నాలుగు నెలలకు ఒకసారి కాని బిల్లులు రాని పరిస్థితుల్లో మధ్యాహ్న భోజన కార్మికులు ఇంటి నుంచి పెట్టుబడి పెట్టాల్సి వస్తున్నది. గత జనవరి నుంచి కార్మికులకు బిల్లులు చెల్లించలేదు. ఐదు నెలలుగా కోడిగుడ్ల బిల్లులను ఇవ్వలేదు. ఇచ్చే వెయ్యి రూపాయల గౌరవ వేతనం కూడా మూడు, నాలుగు నెలలకోసారి ఇస్తున్నారు. మధ్యాహ్న భోజనం వండేందుకు ప్రభుత్వం గ్యాస్‌ సరఫరా చేయాలని, మెస్‌ చార్జీలు కాకుండా వంట సరుకులు సరఫరా చేయాలని కొన్నేళ్లుగా కోరుతున్నా ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం లేదు. కట్టెల పొయ్యిపైనే వంట చేయడం వల్ల మధ్యాహ్న భోజన కార్మికులు ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బుల బారిన పడాల్సి వస్తున్నదని వాపోతున్నారు.

కనీస వేతనాలను రూ.10,500కు పెంచాలి

- బాబాయమ్మ, మధ్యాహ్న భోజన వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

20 సంవత్సరాలుగా పాఠశాలల విద్యార్థులకు భోజనం వండి పెడుతున్నాం. ప్రభుత్వం ఇచ్చే గౌరవ వేతనం మాకు సరిపోవడం లేదు. కనీస వేతనం నెలకు 10,500 రూపాయల ఇవ్వడంతోపాటు ఉద్యోగ భద్రత, బీమా సౌకర్యం కల్పించాలి. . 2022లో సీఎం కేసీఆర్‌ గౌరవ వేతనాన్ని మూడు వేలకు పెంచినా ఇప్పటికీ బడ్జెట్‌ కేటాయించక పోవడంతో నెలకు వెయ్యి రూపాయలు మాత్రమే ఇస్తున్నారు.

నిత్యావసర సరుకులను ప్రభుత్వమే సరఫరా చేయాలి

- మంజుల, మధ్యాహ్న భోజన వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు

ప్రభుత్వం ఇచ్చే డబ్బుతో నిత్యావససర సరుకులు కొనలేకపోతున్నాం. ప్రభుత్వం చెల్లించే ధరలకు మార్కెట్‌లో సరుకులు రావడం లేదు. మేము ఇంటి నుంచి డబ్బులు కలిపి తీసుకురావాల్సి వస్తుంది. వంటకు కావాల్సిన వంట చెరుకు కొనుగోలుకు ఇబ్బందిగా ఉంది. నిత్యావసర సరుకులు, గ్యాస్‌ ప్రభుత్వం సరఫరా చేస్తే విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించగలుగుతాం.

Updated Date - 2023-06-06T01:08:56+05:30 IST