రాజీవ్‌ రహదారిపై పెళ్లి బస్సు బోల్తా

ABN , First Publish Date - 2023-06-26T23:49:12+05:30 IST

శుభకార్యానికి వెళ్లి వస్తున్న ఓ కుటుంబం వారి బంధువులు ప్రయాణిస్తున్న ఓ ప్రైవేట్‌ బస్సు సుల్తానాబాద్‌ మండలంలోని కాట్నపల్లి వద్ద ప్రమాదానికి గురైంది. ఈ సంఘటనలో దాదాపు నలబై మందికి పైగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన 20 మందిని హుటాహుటిన సుల్తానాబాద్‌, కరీంనగర్‌ అసుపత్రులకు తరలించారు.

రాజీవ్‌ రహదారిపై పెళ్లి బస్సు బోల్తా
ప్రమాదంలో నుజ్జు నుజ్జు అయిన బస్సు ముందు భాగం

- 40 మందికి పైగా గాయాలు

- రిసెప్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం

సుల్తానాబాద్‌, జూన్‌ 26: శుభకార్యానికి వెళ్లి వస్తున్న ఓ కుటుంబం వారి బంధువులు ప్రయాణిస్తున్న ఓ ప్రైవేట్‌ బస్సు సుల్తానాబాద్‌ మండలంలోని కాట్నపల్లి వద్ద ప్రమాదానికి గురైంది. ఈ సంఘటనలో దాదాపు నలబై మందికి పైగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన 20 మందిని హుటాహుటిన సుల్తానాబాద్‌, కరీంనగర్‌ అసుపత్రులకు తరలించారు. పోలీసులు, బాధితుల వివరాల ప్రకారం.. రామగుండం జెన్‌కోలో జూనియర్‌ ప్లాంట్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ముస్తాఫా అలియాస్‌ బాబా అనే వ్యక్తి కూతురు వివాహం రెండు రోజుల క్రితం జరిగింది. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన రిసెప్షన్‌ కోసం రామగుండం నుంచి కుటుంబ సభ్యులు బంధువులు రెండు ప్రైవేట్‌ బస్సుల్లో హైదరాబాద్‌కు వెళ్లారు. రాత్రి జరిగిన డిన్నర్‌లో పాల్గొన్నారు. సోమవారం తెల్లవారజామున నాలుగున్నర గంటలకు రామగుండంకు రెండు బస్సుల్లో బయలుదేరారు. ఒక బస్సులో పెళ్లి కూతురుతో సహా ఇతరులు వెళ్లిపోగా మరో బస్సులో నలబై మంది పెద్దలు మరో 20 మంది పిల్లలు వస్తున్నారు. ఈ బస్సు సుల్తానాబాద్‌ మండలంలోని కాట్నపల్లి స్టేజీ వద్ద రాజీవ్‌ రహదారిపై ఎదురుగా ఓ కారు, అతర్వాత అటో రాగా వాటిని తప్పించే ప్రయత్నంలో బస్సు అదుపు తప్పి కుడి పక్కనున్న డివైడర్‌ను ఢీకొని కరీంనగర్‌ వైపు వెళ్లే మార్గంలో బస్సు బోల్తా పడింది. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులకు ఏం జిరిగిందో తెలిసేలోగా గాయాలయ్యాయి.

- తీవ్ర గాయాలు.. విరిగిన చేతులు, కాళ్లు..

బస్సు బోల్తా పడిన సంఘటనలో అందులో ఉన్న చాలా మంది తలలకు తీవ్ర గాయాలయ్యాయి. మరి కొందరికి కాళ్లు చేతులు విరిగాయి. ఎండీ రిజ్వాన్‌ తలకు పొట్టలో తీవ్రగాయలు కాగా హసియా అనే మహిళలకు పది కుట్లు పడ్డాయి. షేక్‌ బాబు, జకియా బేగం, రజియా బేగం, రేష్మా, రఫియా బేగం తదితరుల తలలకు తీవ్రగాయాలయ్యాయి. నాజియా, ఎండీ గౌస్‌, ఎస్‌కే జిలానీ, నూర్జాహాన్‌, మీర్జా మహ్మద్‌, యాస్మిన్‌ భేగ్‌, జోహన్‌, షాహిన్‌ సుల్తానా, సానియా, రేష్మా, ఎండీ సలీమ్‌, సనా, మదియా ఫలిమా,రియాన్‌, అజీద్‌, మాంచల్‌, రుక్సానా బేగం తదితరులకు తీవ్ర గాయాలయ్యాయి.

- సహాయక చర్యలను పర్యవేక్షించిన ఏసీపీ

ప్రమాద సమాచారం అందుకున్న పెద్దపల్లి ఏసీపీ ఎడ్ల మహేష్‌, సీఐ జగదీష్‌, ఎస్‌ఐ విజేందర్‌, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే పలు అంబులెన్సులను అక్కడికి రప్పించి తీవ్రంగా గాయపడిన వారిని కరీంనగర్‌, మిగతా వారిని సుల్తానాబాద్‌ ఆసుపత్రులకు తరలించారు. సుల్తానాబాద్‌ ఆసుపత్రిలో డాక్టర్లు, సిబ్బంది క్షతగాత్రులకు చికిత్స చేసి తీవ్రగాయాలైన వారిని కరీంనగర్‌ ఆసుపత్రికి తరలించారు.

- బాధితులకు పలువురి పరామర్శ..

ప్రమాదంలో గాయపడిన వారిని మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు, అంతటి అన్నయ్యగౌడ్‌, మినుపాల ప్రకాష్‌రావు, చిలుక సతీష్‌ తదితరులతో పాటు స్థానిక ముస్లిం నేతలు పరామర్శించారు. రఫీక్‌, రఫీ, సాజిద్‌ తదితరులు బాధితులకు మంచినీళ్లు, టీ బిస్కట్లు ఇతరత్రా సమకూర్చారు.

Updated Date - 2023-06-26T23:49:12+05:30 IST