రాష్ట్ర మంత్రి వర్గంలో ఉమ్మడి జిల్లా నేతలకు చోటు?
ABN , First Publish Date - 2023-12-05T01:24:14+05:30 IST
రాష్ట్ర మంత్రివర్గంలో ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరికి చోటు లభించనున్నది.
శ్రీధర్‌బాబు, పొన్నంకు దక్కే అవకాశం
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
రాష్ట్ర మంత్రివర్గంలో ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరికి చోటు లభించనున్నది. మంథని శాసనభ్యుడు, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును మరోసారి మంత్రి పదవి వరించనుండగా తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌కు ఆ పదవి దక్కనున్నదని భావిస్తున్నారు.
ఐదోసారి శాసనసభకు శ్రీధర్‌బాబు
శ్రీధర్‌బాబు మంథని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 1999, 2004, 2009, 2018 ఎన్నికలతోపాటు తాజాగా జరిగిన ఎన్నికల్లో కూడా శాసనసభ్యుడిగా గెలుపొందారు. ఐదుసార్లు మంథని శాసనసభ్యుడిగా గెలుపొందిన ఆయన ఇదే నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎన్నికైన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు రికార్డును తిరగరాశారు. శ్రీధర్‌బాబు డీసీసీ అధ్యక్షుడిగా, ఏఐసీసీ కార్యదర్శిగా, ఇటీవల జరిగిన ఎన్నికల్లో కర్ణాటక రాష్ట్ర ఇన్‌చార్జిగా పదవులు నిర్వహించారు. వైఎస్సార్, రోశయ్య ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా, కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో పౌరసరఫరాలు, శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు నిర్వహించారు. ప్రభుత్వ విప్‌గా పనిచేశారు. ఈ ట్రాక్ రికార్డుతో ఆయనకు రాష్ట్ర మంత్రి వర్గంలో బెర్త్ ఖాయమని భావిస్తున్నారు.
ఉద్యమ నాయకుడు ‘పొన్నం’
హుస్నాబాద్ శాసనసభ్యుడిగా ఎన్నికైన పొన్నం ప్రభాకర్‌కు మంత్రి పదవి దక్కనున్నట్లు సమాచారం. 2009 నుంచి 2014 వరకు కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా బాధ్యతలు నిర్వహించిన పొన్నం ఏపీ మార్క్‌ఫెడ్ చైర్మన్‌గా కూడా పనిచేశారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు కూడా నిర్వహించారు. తెలంగాణ ఉద్యమ కాలంలో కాంగ్రెస్ ఎంపీగా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు పోరాటంలో క్రియాశీలపాత్ర నిర్వహించిన ప్రభాకర్ తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో తొలి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించాలని కోరుకుంటున్నారు. ఆయన కోరిక ఫలించే అవకాశాలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లా పరిధిలోని 13 అసెంబ్లీ స్థానాల్లో ఐదు స్థానాలను బీఆర్‌ఎస్ దక్కించుకోగా ఎనిమిది స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి చెందినవారు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. వీరిలో శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ పార్టీ రాజకీయాల్లో సీనియర్లుగా ఉన్నారు. దీంతో వీరిద్దరికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది. హైదరాబాద్‌లో జరిగిన లెజిస్లేచర్ సమావేశంలో శ్రీధర్‌బాబును రాష్ట్ర శాసనసభ స్పీకర్ పదవిని చేపట్టాలని కోరినట్లు సమాచారం. ఆయన అందుకు నిరాకరించారని, దీంతో ఆయనకు మంత్రి పదవి దక్కనుందని భావిస్తున్నారు.