ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి

ABN , First Publish Date - 2023-09-22T00:19:18+05:30 IST

నిరంతరం ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ఆలోచన చేసే నేతలను, ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ సూచించారు.

ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి
గృహలక్ష్మి ప్రొసీడింగ్‌ కాపీని పంపిణీ చేస్తున్న మంత్రి కొప్పుల

మంథని, సెప్టెంబరు 21: నిరంతరం ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ఆలోచన చేసే నేతలను, ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ సూచించారు. మంథని మున్సిపల్‌ పరిధిలోని కూచిరాజ్‌పల్లి వద్ద బొక్కలవాగు పై ఆరు కోట్ల రూపాయలతో వంతెన నిర్మాణం, రెండు కోట్ల రూపాయలతో మోడ్రన్‌ దోబీఘాట్‌ నిర్మాణానికి శుంకుస్థాపన చేశారు. మంథని తొలి ఎమ్మెల్యే గులుకోట శ్రీరాములు, స్వాతంత్య్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్‌ బాపుజీ విగ్రహాలను అవిష్కరించారు. బొక్కలవాగు కట్ట పై, శ్రీరామ కాలనీలో సీసీ రోడ్ల తోపాటు పలు అభివృద్ధి పనులను మంత్రి కొప్పుల గురువారం ప్రారంభించారు. అనంతరం స్థానిక ఎస్‌ఎల్‌బీ గార్డెన్స్‌లో నియోజకవర్గాని కి మంజూరైన గృహలక్ష్మి పథకం లబ్ధిదారులకు ప్రొసీడింగ్‌ కాపీలను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఈశ్వర్‌ మాట్లాడుతూ.. గృహలక్ష్మి పథకం చాలా డిమాండ్‌ ఉన్న స్కీం అని, ఇది నిరంతరం కొనసాగుతుందన్నారు. తొలి విడుతలో రాష్ట్రంలో రూ. 250 కోట్లతో 25 వేల మందికి, మంథని నియోజకవర్గంలో రూ. 40 కోట్లతో 15 వందల మందికి గృహలక్ష్మి స్కీంను మంజూరు చేశామన్నారు. గత పాలకులు 61 వేల కుటుంబాలకు ఇళ్లు మంజూరు చేస్తే ఇంకా ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాల్లో ఇళ్లు లేని ఇంతమంది ఎలా ఉన్నారని ప్రశ్నించారు. కేవలం ప్రజలను మభ్య పెట్టడానికే నాటకాలు ఆడారన్నారు. ఇంకా ఇప్పటికి ప్రజలు పడుతున్న కష్టాలకు గత కాంగ్రెస్‌ పార్టీ పాలన పాపం కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 48 లక్షల మంది లబ్ధిదారులకు వివిధ రకాల పెన్షన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. మంథని నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయన్నారు. మంథనిలో ప్రజలు బీఆర్‌ఎస్‌ పార్టీ నేతకు అండగా నిలవాలని కోరారు.

- మంథనితో ఓటు బంధం కాదు.. పేగు బంధం..

మంథని నియోజకవర్గ ప్రజలతో తనకు ఉన్నది ఓటు బంధం కాదని.. పేగు బంధమని జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధు అన్నారు. సభలో పుట్ట మధు మాట్లాడుతూ.. మంతి కొప్పుల ఈశ్వర్‌ సహకారంతో జిల్లాలో అధికంగా మంథని ప్రాంతానికి గృహలక్ష్మి పథకం, అభివృద్ధి, సంక్షేమ పనులు చేయించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఎమ్మెల్యేగా ప్రజలు ఓటమి పాలు చేస్తే సీఎం కేసీఆర్‌ జెడ్పీ చైర్మన్‌గా అవకాశం కల్పించడంతో మంథని ప్రజలకు అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందించడానికి వీలు కలిగిందన్నారు. కలెక్టర్‌ ముజామ్మిల్‌ఖాన్‌ మాట్లాడుతూ.. జిల్లాలో ఎనిమిది వేల గృహాలక్ష్మి యూనిట్లు మొదటి విడతలో మంజూరు చేసి అన్ని జిల్లాల కంటే ముందున్నామన్నారు. నెలలో 25 వేల గృహాలక్ష్మి యూనిట్లు మంజూరు చేస్తామన్నారు. కార్యక్రమంలో మంథని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పుట్ట శైలజ, భూపాలపల్లి జడ్పీ చైర్మన్‌ జక్కు శ్రీహర్షిని, ఎంపీపీ కొండ శంకర్‌, జెడ్పీటీసీ తగరం సుమలత, వైస్‌ చైర్మన్‌ ఆరెపల్లి కుమార్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ కొత్త శ్రీనివాస్‌, ఏఎంసీ చైర్మన్‌ ఎక్కేటి అనంతరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2023-09-22T00:19:18+05:30 IST