భావితరాలకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలి
ABN , First Publish Date - 2023-06-11T00:42:12+05:30 IST
అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా పనిచేసి భావితరానికి బంగారు భవిష్యత్తు అందించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు.
- జిల్లాల పునర్విభజనతో సుపరిపాలన, జవాబుదారీతనం
- మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్, జూన్10(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా పనిచేసి భావితరానికి బంగారు భవిష్యత్తు అందించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. శనివారం కలెక్టరేట్ ఆడిటోరియంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని సుపరిపాలన దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు ఎన్నో ఉద్యమాలు, ఎందరో త్యాగధనుల ఆత్మబలిదానాలు, ఉద్యమ పోరాటాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రత ప్రజలకు అందించేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి పనిచేయాలని అన్నారు. తెలంగాణ ప్రజలందరూ జరుపుకునే పండుగ దశాబ్ది ఉత్సవాలని, రంజాన్, దసరా, క్రిస్మస్ పండగలా అన్ని మతాల ప్రజలు 21 రోజులపాటు జరుపుకునే పండుగ ఈ ఉత్సవాలని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన సంస్కరణల వల్ల ప్రజలవద్దకే పాలన, సులభతరమైన సుపరిపాలన తీసుకురావడం జరిగిందన్నారు. ఆన్‌లైన్ విధానంతో ప్రజల్లో ప్రభుత్వాలపై నమ్మకం, విశ్వాసం ఏర్పడిందన్నారు. నిరంతరం ఏదో ఒక సమస్యతో కొట్టుమిట్టాడుతున్న భావితరానికి బంగారు భవిష్యత్తు అందించేందుకు కరీంనగర్ జిల్లాలో అద్భుతమైన రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మానేరు రివర్ ఫ్రంట్, కేబుల్ బ్రిడ్జి, వైద్య కళాశాల, టీటీడీ శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయ నిర్మాణం, సెంట్రల్ లైటింగ్ సిస్టం వంటి ఎన్నో అద్భుతమైన ఐటీ టవర్ లాంటి అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. కలెక్టర్ ఆర్వీకర్ణన్ మాట్లాడు తూ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల వల్ల ప్రజల వద్దకే సుపరిపాలన వచ్చిందన్నారు. అనంతరం దశాబ్ది ప్రగతి నివేదికను మంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ వై సునీల్‌రావు, అదనపు కలెక్టర్లు జీవీ శ్యాంప్రసాద్‌లాల్, గరిమా అగర్వాల్, జడ్పీ సీఈవో ప్రియాంక, కరీంనగర్ ఆర్డీవవో ఆనంద్ కుమార్, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, ఇరిగేషన్ ఎస్‌ఈ శివప్రసాద్, మిషన్ భగీరథ ఈఈ రామ్‌కుమార్, పంచాయతీరాజ్ ఈఈ శ్రీనివాసరావు, ఎలక్ర్టిసిటీ ఈఈ గంగాధర్, సీపీవో కొమురయ్య, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.