27 సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు
ABN , First Publish Date - 2023-12-05T00:10:19+05:30 IST
సింగరేణిలో గుర్తిం పు సంఘం ఎన్నికల సందడి మొదలైంది. ఈ నెల 27న సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరుగనున్నాయి. నిన్నటిదాకా అసెంబ్లీ ఎన్నికలతో సందడిగా ఉన్న సింగరేణి ప్రాంతంలో రెండు రోజులుగా ప్రశాంతంగా, నిశ్శబ్దంగా గడిచింది.
- పాత నోటిఫికేషన్‌పైనే కొత్త షెడ్యూల్
గోదావరిఖని, డిసెంబరు 4: సింగరేణిలో గుర్తిం పు సంఘం ఎన్నికల సందడి మొదలైంది. ఈ నెల 27న సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరుగనున్నాయి. నిన్నటిదాకా అసెంబ్లీ ఎన్నికలతో సందడిగా ఉన్న సింగరేణి ప్రాంతంలో రెండు రోజులుగా ప్రశాంతంగా, నిశ్శబ్దంగా గడిచింది. కానీ వెంటనే సింగరేణి ఎన్నికల ప్రక్రియ మొదలైంది. గుర్తింపు సంఘం ఎన్నికలకు గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కోర్టు జోక్యం తో వాయిదా పడింది. అసెంబ్లీ ఎన్నికలకంటే ముందే డిసెంబరు 27న ఎన్నికలకు ఆర్‌ఎల్‌సీ, ఎన్ని కల రిటర్నింగ్ అధికారి శ్రీనివాసులు నోటిఫికేషన్ జారీ చేశారు. నామినేషన్లు, ఉపసంహరణలు అన్నీ జరిగిపోయాయి. నవంబరు 30 వరకే ఎన్నికలు జరుగాల్సి ఉండాలి. కానీ సాధారణ ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడిన సింగరేణి ఎన్నికలు ఇప్పుడు ముందు పడ్డాయి.
సోమవారం ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీనివాసులు తిరిగి కార్మిక సంఘాల ప్రతినిధులతో హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో సమావేశమయ్యారు.ఈ సమా వేశంలో ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియను తిరిగి ప్రారంభిస్తున్నట్టు పేర్కొన్నారు. గతంలో వేసిన నామినేషన్లనే పరిగణలోకి తీసుకుని ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. కార్మిక సంఘాలు కూడా ఇందుకు అంగీకారం తెలిపాయి. ఈ నెల 27న ఉదయం 7గంటల నుంచి సింగరేణి వ్యాప్తంగా అన్నీ బొగ్గు గనులు, విభాగాలు, ఓపెన్‌కాస్టుల్లో ఎన్నికలు జరుగుతాయి. అదే షెడ్యూల్డ్‌ను సోమవారం రిటర్నింగ్ అధికారి శ్రీనివాసులు తిరిగి సోమవారం మరోసారి విడుదల చేశారు. అయితే నామినేషన్ల ప్రక్రియ ముగిసినట్టు తెలిపారు. ఎన్నికల్లో ఎన్ని సంఘాలు అర్హత ఉంది, వాటి గుర్తుల కేటాయింపు కూడా అక్టోబరు 10న ముగిసినట్టు ఆయన ప్రకటించారు. ఇక మిగిలింది ఎన్నిక మాత్రమే. ఈ ఎన్నికల్లో సింగరేణి వ్యాప్తంగా 39,832 మంది కార్మికులు, ఉద్యోగులకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉందని ఆయన తెలిపారు. దీంతో రాజకీయ పార్టీల సందడి ముగిసి కార్మిక సంఘాల సందడి మొదలైంది. సోమవారం ఆర్‌ఎల్‌సీ వద్ద జరిగిన ఎన్నికల సమావేశంలో కార్మిక సంఘాల నాయకులు బీ వెంకట్రావ్, రాజిరెడ్డి, కే మల్లయ్య, సీతారామయ్య, జనక్ ప్రసాద్, ధర్మపురి, నర్సింహారెడ్డి, రియాజ్ అహ్మద్, యాదగిరి సత్తయ్య, ఐ కృష్ణ పాల్గొన్నారు.
ఎన్నికల్లో పోటీకి అర్హత పొందిన సంఘాలు గుర్తులు
గోదావరిలోయ బొగ్గుగని కార్మిక సంఘం చక్రంలో సుత్తి
ప్రజా తెలంగాణ సింగరేణి కార్మిక సంఘం రెండు ఆకులు
సింగరేణి కోల్‌మైన్స్ కార్మిక సంఘ్ కాగడ
సింగరేణి కోల్‌మైన్స్ లేబర్ యూనియన్ టేబుల్ గడియారం
సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ ఉదయిస్తున్న సూర్యుడు
సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్ మోటార్ సైకిల్
సింగరేణి గని కార్మిక సంఘం పిక్ యాక్స్
సింగరేణి మైనర్స్ అండ్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ తరాజు
శ్రామిక శక్తి గోదావరిలోయ బొగ్గు గని కార్మక సంఘం సింహం
తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం బాణం
తెలంగాణ గోదావరిలోయ బొగ్గు గని కార్మిక సంఘం పిడికిలో పానా
సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ చుక్క
తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం ల్యాంప్ హెల్మెట్