Jagan: హెల్ప్‌.. ప్లీజ్‌!

ABN , First Publish Date - 2023-03-18T03:08:33+05:30 IST

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కీలక దశకు చేరిన తరుణంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఢిల్లీకి వెళ్లి... వచ్చారు! శుక్రవారం ఆయనప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు.

Jagan: హెల్ప్‌.. ప్లీజ్‌!

మోదీ, షాకు జగన్‌ మొర!?.. అవినాశ్‌ పైనే చర్చ?

కీలక దశకు వివేకా కేసు.. అదే సమయంలో ఢిల్లీకి

రాత్రి సీఎం నివాసంలోనే అవినాశ్‌రెడ్డి

న్యూఢిల్లీ, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కీలక దశకు చేరిన తరుణంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఢిల్లీకి వెళ్లి... వచ్చారు! శుక్రవారం ఆయనప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. తన తమ్ముడు అవినాశ్‌ రెడ్డిని సీబీఐ నుంచి కాపాడుకోవడమే లక్ష్యంగా జగన్‌ ఢిల్లీ యాత్ర సాగినట్లు ప్రచారం సాగుతోంది. పర్యటన ఆసాంతం అవినాశ్‌ రెడ్డి కూడా ఆయనతోనే ఉండటం విశేషం. మోదీ, షాలతో భేటీలు మాత్రం ఏకాంతంగానే సాగాయి. వివేకా హత్య కేసులో అవినాశ్‌ రెడ్డితోపాటు ఆయన తండ్రి భాస్కర్‌ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు సంగతి తెలిసిందే. శుక్రవారం ఉదయం తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో అవినాశ్‌ అరెస్టుకు కూడా ‘లైన్‌ క్లియర్‌’ అయ్యింది. మరోవైపు ఇదే కేసులో సీబీఐ జగన్‌ ఓఎస్డీ కృష్ణమోహన్‌ రెడ్డి, సీఎం సతీమణి భారతి వ్యక్తిగత సహాయకుడు నవీన్‌లను సీబీఐ ఇప్పటికే ప్రశ్నించింది.

వీటన్నింటి నేపథ్యంలో జగన్‌ ఆకస్మికంగా ఢిల్లీకి వెళ్లారు. అసెంబ్లీ సమావేశాలను సైతం పక్కనపెట్టేశారు. పార్లమెంటు భవనంలో ప్రధానితో 35 నిమిలషాలపాటు భేటీ జరిగింది. ఆ తర్వాత మధ్యాహ్నం హోం మంత్రితో దాదాపు 25 నిమిషాల పాటు భేటీ అయ్యారు. ఎప్పట్లాగే రాష్ట్రానికి చెందిన పలు అంశాలపై ఢిల్లీ పెద్దలకు వినతిపత్రం ఇచ్చినట్లు చెబుతున్నా... అవినాశ్‌ రెడ్డిని కాపాడుకోవడంతోపాటు వివేకా హత్యకేసులో సీబీఐ దూకుడుకు కళ్లెం వేయడం గురించే విన్నపాలు చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, ఢిల్లీ పర్యటనలో ఎంపీ అవినాశ్‌ రెడ్డి సీఎం జగన్‌ వెంటే ఉన్నారు. గురువారం రాత్రి ఆయన సీఎం అధికారిక నివాసంలోనే బస చేశారు. రోజంతా ఆయన ముభావంగా ఉన్నట్లు సమాచారం. ప్రధానిని కలుసుకోడానికి జగన్‌ పార్లమెంటుకు వచ్చేకంటే ముందే అవినాశ్‌ అక్కడికి చేరుకున్నారు. జగన్‌ వెంట ప్రధాని కార్యాలయంలోకి మాత్రం వెళ్లలేదు. కాగా, ప్రఽధాన మంత్రి కార్యాలయంలోకి జగన్‌ వెంట ఎంపీ విజయసాయి రెడ్డి మాత్రమే వెళ్లారు. ఫొటో తీసుకున్న తర్వాత ఆయన బయటకు వచ్చేశారు. ప్రధాని, అమిత్‌ షాతో సీఎం జగన్‌ ఏకాంతంగానే చర్చలు జరిపారు.

Updated Date - 2023-03-18T04:00:23+05:30 IST