అపెక్స్‌ కౌన్సిల్‌కు లేఖ రాయండి

ABN , First Publish Date - 2023-06-02T02:29:01+05:30 IST

కృష్ణా నదిలో తెలుగు రాష్ట్రాల నీటి వాటాను తేల్చడానికి వీలుగా కేంద్ర అపెక్స్‌ కౌన్సిల్‌కు లేఖ రాయాలని కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ)ని తెలంగాణ కోరింది.

అపెక్స్‌ కౌన్సిల్‌కు లేఖ రాయండి

కృష్ణాలో నీటి వాటాను తేల్చండి.. కేఆర్‌ఎంబీకి తెలంగాణ లేఖ

హైదరాబాద్‌, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): కృష్ణా నదిలో తెలుగు రాష్ట్రాల నీటి వాటాను తేల్చడానికి వీలుగా కేంద్ర అపెక్స్‌ కౌన్సిల్‌కు లేఖ రాయాలని కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ)ని తెలంగాణ కోరింది. ఈ మేరకు కేఆర్‌ఎంబీ చైర్మన్‌ శివ్‌నందన్‌ కుమార్‌కు తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్‌ లేఖ రాశారు. 2023-24 వాటర్‌ ఇయర్‌ నుంచి కృష్ణాలో కచ్చితంగా 50 శాతం నిష్పత్తితో నీటిని పంచాల్సిందేనని చెప్పారు. పలు ప్రాజెక్టులు పూర్తవడంతో పాటు నిర్మాణంలో ఉన్నందున, వాటికీ నీటి కేటాయింపులు అవసరమని పేర్కొన్నారు. మే 10న జరిగిన కేఆర్‌ఎంబీ సమావేశంలో నీటి వాటాను తేల్చే బాధ్యతను అపెక్స్‌ కౌన్సిల్‌కు కేటాయిస్తూ తీర్మానం చేశారని గుర్తు చేశారు. ఈ నెల 1 నుంచి కొత్త వాటర్‌ ఇయర్‌ ప్రారంభమైనందున.. 50 శాతం వాటా మేరకు నీటిని విడుదల చేయాలని బోర్డును కోరతామని తెలిపారు. 2022-23 వాటర్‌ ఇయర్‌లో ఏపీ 661.771 టీఎంసీల నీటిని వినియోగించుకుందని, తెలంగాణ 248.068 టీఎంసీలు మాత్రమే వాడుకుందని తెలిపారు. 50 శాతం నీటి వాటాను పరిగణనలోకి తీసుకుంటే ఏపీ 214 టీఎంసీలను అదనంగా వాడుకుందని నివేదించారు. ఈ అంశాలను కేంద్రానికి సత్వరమే నివేదించాలని కోరారు.

Updated Date - 2023-06-02T02:29:01+05:30 IST