19 రోజుల్లో అంబేడ్కర్‌ విగ్రహం పూర్తయ్యేనా?

ABN , First Publish Date - 2023-03-26T02:20:02+05:30 IST

హుస్సేన్‌ సాగర్‌ తీరాన ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహం పనులు సమయానికి పూర్తవుతాయా అంటే..

19 రోజుల్లో అంబేడ్కర్‌ విగ్రహం పూర్తయ్యేనా?

ఇప్పటివరకు 75ు మేర జరిగిన పనులు

ఇంకా పూర్తి కాని లోపలి, బయట పనులు

హైదరాబాద్‌, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): హుస్సేన్‌ సాగర్‌ తీరాన ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహం పనులు సమయానికి పూర్తవుతాయా అంటే.. అధికారుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ఏప్రిల్‌ 14 అంబేడ్కర్‌ జయంతి రోజున విగ్రహావిష్కరణ ఉంటుందని ఇప్పటికే సీఎం కేసీఆర్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రారంభోత్సవానికి 19 రోజులు మాత్రమే ఉండటం, పనులు పూర్తికాకపోవడంతో సమయానికి ఆవిష్కరణ జరుగుతుందా లేదా అనే సందిగ్ధం ఏర్పడింది. ఇప్పటివరకు విగ్రహం పనులు 70 నుంచి 75 మేర పూర్తవ్వగా.. ఇంకా తల, చేయి భాగాలు బిగించాల్సి ఉంది. విగ్రహం కింది అంతస్తుల్లో ఏర్పాటు చేయదల్చిన అంబేడ్కర్‌ జీవిత చరిత్ర మ్యూజియం, యాంప్‌ థియేటర్‌ పనులు పెండింగ్‌లో పడ్డాయి. ప్రహరీతోపాటు అంబేడ్కర్‌ విగ్రహానికి చేరుకునే మెట్ల మార్గం ఇంకా పూర్తికాలేదు. ఇక మెయిన్‌ బిల్డింగ్‌తో పాటు అనుబంధ భవనాల పనులు, లోపలి రోడ్లు, ఇతరత్రా అభివృద్ధి పనులు, ఎలక్ట్రిసిటీ, వాటర్‌, శానిటరీ పనులు ఇంకా పూర్తికాలేదు. ఇటు ప్రభుత్వ కార్యదర్శి శాంతికుమారి శనివారం విగ్రహ నిర్మాణ పనులను పరిశీలించారు. ఏప్రిల్‌ 10 నాటికే పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

బడ్జెట్‌ అంచనాలు పెరగొచ్చు..

అంబేడ్కర్‌ విగ్రహ నిర్మాణ బడ్జెట్‌ అంచనాలు పెరుగుతున్నాయి. 2021 జూన్‌ 3న రూ.104 కోట్ల అంచనాతో 2023 ఏప్రిల్‌ 30 నాటికి విగ్రహం పూర్తిచేయాలనే షరతుతో ఓ నిర్మాణ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. అయితే ధరలు పెరిగాయన్న కారణంగా అదనంగా మరో రూ.60 కోట్లు అవసరం పడతాయని అధికారులు భావిస్తున్నారు. అంతకుమించి కూడా పెరిగే అవకాశముందని సర్కారుకు తాజాగా నివేదించినట్లు తెలిసింది.

Updated Date - 2023-03-26T02:20:02+05:30 IST