ఎందుకింత డ్రామా?

ABN , First Publish Date - 2023-05-27T04:13:39+05:30 IST

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సహ నిందితుడిగా ఉన్న కడప ఎంపీ అవినాశ్‌రెడ్డిని అరెస్టు చేసే ప్రక్రియలో ఇంత డ్రామా ఎందుకని తెలంగాణ హైకోర్టు సీబీఐని ప్రశ్నించింది. ‘

ఎందుకింత డ్రామా?

అవినాశ్‌రెడ్డిని అరెస్టు చేయకుండా రక్షణ ఆదేశాలు లేవు కదా!

నేడు సీబీఐ వాదనలు

అవినాశ్‌రెడ్డి తరఫున 5 గంటలు వాదనలు వినిపించిన ఉమామహేశ్వరరావు సాయంత్రం 5 గంటలకు ముగించారు. సునీతారెడ్డి తరఫు సీనియర్‌ న్యాయవాది ఎల్‌.రవిచందర్‌ 1.15 గంటలపాటు వాదనలు కొనసాగించారు. అప్పటికే సాయంత్రం 6.15 కావడంతో సీబీఐ వాదనలు శనివారం వింటామని హైకోర్టు తెలిపింది. తొలుత సోమవారం సునీతారెడ్డి, సీబీఐ వాదనలు వింటామని పేర్కొంది. అందరూ అంగీకరిస్తే వేసవి సెలవుల తర్వాత ఆదేశాలిస్తామని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇప్పుడే వాదనలు వినిపిస్తామని.. అవినాశ్‌రెడ్డి న్యాయవాదికి ఎంత సమయమిచ్చారో తమకు కూడా అంత సమయం ఇవ్వాలని కోర్టులోనే ఉన్న సునీతారెడ్డి వ్యాఖ్యానించారు. దీంతో అసహనం వ్యక్తం చేసిన ధర్మాసనం.. ‘మీ పరిమితుల్లో మీరుండాలి’ అని సూచించింది.

మరి నోటీసివ్వకుండా ఎందుకు అరెస్టు చేయలేదు?

వివేకా హత్య సంగతి జగన్‌కు ముందే తెలుసా?

సీబీఐకి హైకోర్టు ప్రశ్నలు

హైదరాబాద్‌, మే 26 (ఆంధ్రజ్యోతి): వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సహ నిందితుడిగా ఉన్న కడప ఎంపీ అవినాశ్‌రెడ్డిని అరెస్టు చేసే ప్రక్రియలో ఇంత డ్రామా ఎందుకని తెలంగాణ హైకోర్టు సీబీఐని ప్రశ్నించింది. ‘నోటీసు ఇవ్వాల్సిన అవసరమేముంది? నేరుగా అరెస్టు చేయలేకపోయారా’ అని అడిగింది. ఎంపీ అవినాశ్‌రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై శుక్రవారం జస్టిస్‌ ఎం.లక్ష్మణ్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పలు ప్రశ్నలు సంధించింది. అవినాశ్‌రెడ్డిని అరెస్టు చేయొద్దని ఎలాంటి రక్షణ ఆదేశాలూ అమలులో లేనప్పుడు ఎందుకు అరెస్టు చేయడం లేదు? నోటీసులు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? నేరుగా అరెస్టు చేస్తే ఇంత డ్రామా ఉండేది కాదు కదా! అవినాశ్‌ తండ్రి వైఎస్‌ భాస్కర్‌రెడ్డిని ఎలా అరెస్టు చేశారో ఆయన్నూ అలాగే అరెస్టు చేస్తే సరిపోయేది కదా..’ అని వ్యాఖ్యానించింది. ఇప్పటికైనా సీబీఐ తెలివైన నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నామని వివేకా కుమార్తె సునీతారెడ్డి తరఫున సీనియర్‌ న్యాయవాది ఎల్‌ రవిచందర్‌ సమాధానమిచ్చారు. అలాగే వివేకా హత్య సంగతి ప్రపంచానికి తెలియడానికి ముందే సీఎం జగన్‌కు తెలుసా అని ధర్మాసనం ప్రశ్నించింది. జగన్‌కు ముందే తెలుసని సీబీఐ చెబుతోందని.. అవినాశ్‌రెడ్డి ద్వారా తెలిసి ఉండొచ్చని.. మరిన్ని విషయాలు దర్యాప్తుసంస్థనే అడగాలని రవిచందర్‌ పేర్కొన్నారు.

అవినాశ్‌రెడ్డి మొసలి కన్నీరు కారుస్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ‘జమ్మలమడుగు వెళ్తూ వివేకా హత్య సంగతి తెలుసుకుని హుటాహుటిన తిరిగొచ్చానని ఆయన చెప్పడం పచ్చి అబద్ధం. సీబీఐ నోటీసు ఇచ్చినప్పుడల్లా ఏదో వంక చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి పార్లమెంటు సమావేశాలని చెప్పారు. మరోసారి తన స్టేట్‌మెంట్‌ ఆడియో, వీడియో రికార్డు చేయడం లేదని హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దర్యాప్తు అధికారి వివక్షాపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దర్యాప్తు కీలక దశకు చేరి తన పాత్ర బయటపడుతోందని తెలిసేసరికి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ వేశారు. ఇప్పుడేమో తన తల్లి ఆరోగ్యం బాగా లేదంటున్నారు. వైఎస్‌ భాస్కర్‌రెడ్డిని, ఉదయ్‌కుమార్‌రెడ్డిని అరెస్టు చేసినప్పుడు.. కేసు విచారణలో ఉండగా ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు.. ఇప్పుడేమో వారిని అరెస్టు చేసినప్పుడే తననెందుకు చేయలేదని ప్రశ్నిస్తున్నారు. సందర్భాన్ని బట్టి తమకు అనుకూలంగా మాటమారుస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. కర్నూలులో అవినాశ్‌ తల్లి చికిత్స పొందుతున్న ఆస్పత్రి వద్ద ఆయన మందీమార్బలంతో ధర్నాలు చేయిస్తున్నారు. వారంతా రోడ్లపై డిజైనర్‌ కార్పెట్లు వేసుకుని ధర్నాలు చేస్తున్నారు. అవినాశ్‌రెడ్డి అమాయకుడు కాదు.. శక్తిమంతమైన పార్లమెంటు సభ్యుడు.. ఆయన వెంట ఉన్న మందినిబట్టి అర్థం చేసుకోవచ్చు’ అని తెలిపారు. ఈ దశలో జోక్యం చేసుకున్న ధర్మాసనం..

అధికారం ఉంటే అందరూ వస్తారని.. అది ‘పవర్‌ మాగ్నేట్‌’ మహిమ అని వ్యాఖ్యానించింది. రవిచందర్‌ వాదనలు కొనసాగిస్తూ.. వివేకా హత్య వెనుక వజ్రాల వ్యాపారం, ఆర్థిక లావాదేవీలు, అక్రమ సంబంధాలు ఉన్నాయంటూ అవినాశ్‌ కట్టుకథలు అల్లుతున్నారని తెలిపారు. వివేకా గుండెపోటుతో చనిపోయినట్లు.. బందోబస్తుకు నలుగురు కానిస్టేబుళ్లను పంపాలని అవినాశ్‌ తనతో చెప్పారని సీఐ శంకరయ్య స్వయంగా స్టేట్‌మెంట్‌ ఇచ్చారని.. రక్తాన్ని కడుగుతుండగా అవినాశ్‌ అక్కడే ఉన్నాడని సీఐ చెప్పారని గుర్తుచేశారు. ఈ హత్య వెనుక విస్తృత కుట్రను సీబీఐ బయటకు తీస్తోందని తెలిపారు. ‘పిటిషనర్‌ ఎంపీ అయితే గొప్పేంటి? ఆయన చట్టానికి అతీతుడా? అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని పిటిషన్లు వేస్తారు.. మళ్లీ ఇక్కడకు వచ్చి ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నిస్తారు. ద్వంద్వ విధానానికి ఇది నిదర్శనం’ అని రవిచందర్‌ అన్నారు.

అవినాశ్‌పై ఆధారాల్లేవు: ఉమామహేశ్వరరావు

అవినాశ్‌రెడ్డి తరఫున న్యాయవాది ఉమామహేశ్వరరావు వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్‌కు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలూ లేవని.. ఒక్క దస్తగిరి స్టేట్‌మెంట్‌ను అడ్డంపెట్టుకుని సీబీఐ కథ నడిపిస్తోందని అన్నారు. ‘కన్నతండ్రిని హత్య చేసిన దస్తగిరి విషయంలో సునీతారెడ్డి ఎందుకు మెతక వైఖరి ప్రదర్శిస్తున్నారు? హత్య చేసిన నిందితులందరూ లోపల ఉండగా.. దస్తగిరి స్వేచ్ఛగా రోడ్లమీద ఎలా తిరుగుతాడు? వివేకాకు మహిళల విషయంలో కొంత చెడ్డపేరు ఉంది. ఏ–2 సునీల్‌ యాదవ్‌ తల్లి, ఏ–3 ఉమాశంకర్‌ రెడ్డి భార్యతో అసభ్యంగా ప్రవర్తించడంతో వారు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. వజ్రాల వ్యాపారంతోపాటు భూసెటిల్‌మెంట్‌కు సంబంధించిన ఆర్థిక లావాదేవీల విషయంలో నిందితులతో వివేకాకు విభేదాలు ఉన్నాయి. ఆయన మరణానికి ఏడాది ముందు వరకు దస్తగిరి ఆయన డ్రైవర్‌గా ఉండేవాడు. ఉద్యోగం నుంచి తొలగించడంతో శత్రుత్వం పెంచుకోవడంతోపాటు ఆర్థిక లావాదేవీల్లో విభేదాలు ఉన్నాయి. దస్తగిరిపై సీబీఐ ఎక్కడ లేని ప్రేమ చూపిస్తోంది. అవినాశ్‌రెడ్డి సీబీఐ పిలిచిన ప్రతిసారీ సహకరించారు. అవినాశ్‌ తండ్రి జైల్లో ఉన్నారు. సోదరి అమెరికాలో ఉంది. తీవ్ర అనారోగ్యంతో ఉన్న తల్లిని చూసుకోవడానికి ఆయనొక్కరే ఉన్నారు. ఆయనకు వ్యతిరేకంగా సాక్ష్యాలు లేనందున ముందస్తు బెయిల్‌ ఇవ్వండి’ అని కోరారు.

Plant Banana Peels All Over Your Garden, Look What Happens A Week LaterTips and Tricks|Sponsored


Updated Date - 2023-05-27T04:14:07+05:30 IST