దశాబ్ది ఉత్సవాలు ఎందుకు?

ABN , First Publish Date - 2023-06-02T02:55:59+05:30 IST

తెలంగాణ రాష్ట్రం భౌగోళికంగా ఏర్పాటయింది తప్ప ప్రజలు కోరుకున్న సామాజిక, ఆర్థిక లక్ష్యాలు ఈ ప్రభుత్వ పాలనలో నెరవేరలేదని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు.

దశాబ్ది ఉత్సవాలు ఎందుకు?

కల్లబొల్లి హామీలతో ప్రజలను మభ్యపెట్టినందుకా..?

రూ.5 లక్షల కోట్ల అప్పులతో ముంచినందుకా: భట్టి

అచ్చంపేట, జూన్‌ 1 : తెలంగాణ రాష్ట్రం భౌగోళికంగా ఏర్పాటయింది తప్ప ప్రజలు కోరుకున్న సామాజిక, ఆర్థిక లక్ష్యాలు ఈ ప్రభుత్వ పాలనలో నెరవేరలేదని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజల ఆశలు, ఆకాంక్షలను నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా లింగాల మండలంలోని అంబట్‌పల్లి, అవుసలికుంట గ్రామాల్లో గురువారం భట్టి పాదయాత్ర సాగింది. ఈ సందర్భంగా దశాబ్ది ఉత్సవాలు దేని కోసం చేసుకోవాలని భట్టి ప్రశ్నించారు. ‘‘ఇంటికో ఉద్యోగం ఇచ్చినందుకా..? ప్రతీ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు ఇస్తామని.. ఇవ్వనందుకా..? కేజీ టూ పీజీ ఉచిత ఇంగ్లిష్‌ విద్యనందిస్తామని.. మోసగించినందుకా..? డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు కట్టిస్తామని.. మరచిపోయినందుకా..? కృష్ణా, గోదావరిపై నిర్మించే ప్రాజెక్టులను పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నందుకా..? ప్రజలను తాకట్టు పెట్టి రూ.5 లక్షల కోట్లు అప్పు చేసినందుకా..? గత ప్రభుత్వం పంపిణీ చేసిన 24 లక్షల ఎకరాలను గుంజుకున్నందుకా..? పేదల భూములు లాక్కొని బహుళజాతి కంపెనీలకు అప్పజెప్పి, ప్రజా సంపదను దోపిడీ చేస్తున్నందుకా..?’’ అని నిలదీశారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో సబ్బండ వర్గాలు భయంతో బతకాల్సిన దుస్థితి ఎందుకు వచ్చిందో చర్చ జరగాలన్నారు. ఎన్నికలు వస్తేనే మంత్రి హరీశ్‌ రావుకు చెన్నకేశవ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు గుర్తుకొస్తుందని ఆయన విమర్శించారు.

Updated Date - 2023-06-02T02:55:59+05:30 IST