Sub-committees: సబ్ కమిటీలు ఎటుపాయె?
ABN , First Publish Date - 2023-06-12T03:00:36+05:30 IST
ఏదైనా ఒక అంశంపై ప్రభుత్వం మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసిందంటే.. సర్కారు ఆ సమస్యపై చాలా సీరియ్‌సగా దృష్టి సారించిందని అర్థం. మంత్రి నేతృత్వం వహించే.. మంత్రులు సభ్యులుగా ఉండే ఈ కమిటీలతో సమస్యలకు సత్వర, శాశ్వత పరిష్కారం లభిస్తుందని ప్రజలు ఆశిస్తుంటారు.
రెండేళ్లలో పదికి పైగా మంత్రివర్గ ఉపసంఘాల ఏర్పాటు
ఒక్క సమస్యనూ పరిష్కరించని సర్కారు.. గిరిజనులకు కలగానే పోడు పట్టాలు
సంస్కరణకు నోచుకోని ధరణి వెబ్‌సైట్.. అటకెక్కిన అనాథ పిల్లల సంరక్షణ అంశం
ఊసేలేని ప్రైవేటు ఫీజు నియంత్రణ చట్టం.. పట్టించుకోని సీఎం.. నెరవేరని లక్ష్యం
హైదరాబాద్, జూన్ 11 (ఆంధ్రజ్యోతి): ఏదైనా ఒక అంశంపై ప్రభుత్వం మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసిందంటే.. సర్కారు ఆ సమస్యపై చాలా సీరియ్‌సగా దృష్టి సారించిందని అర్థం. మంత్రి నేతృత్వం వహించే.. మంత్రులు సభ్యులుగా ఉండే ఈ కమిటీలతో సమస్యలకు సత్వర, శాశ్వత పరిష్కారం లభిస్తుందని ప్రజలు ఆశిస్తుంటారు. కేబినెట్ సబ్ కమిటీ అంటే అంత ప్రాముఖ్యం, విశ్వాసం ఉంది. అయితే తెలంగాణ ప్రభుత్వం నియమిస్తున్న కేబినెట్ సబ్ కమిటీలు మాత్రం పేరుకే ఏర్పాటవుతున్నాయి. కొవిడ్ తర్వాత నుంచి ఇప్పటి వరకు పలు శాఖల్లోని సమస్యల పరిష్కారం కోసం సర్కారు సుమారు పదికి పైగా కేబినెట్‌సబ్ కమిటీలను నియమించింది. వీటిలో ఏ ఒక్కటి కూడా ఇంత వరకు సమస్యను పరిష్కరించలేదు. కనీసం మార్గదర్శకాలను అందించలేదు.
కొన్ని సమస్యలపై ప్రభుత్వానికి రిపోర్టులు ఇస్తున్నా అవి సీఎం వద్ద పెండింగ్‌లో ఉంటున్నాయి. కమిటీల పని తీరును సీఎం సైతం పట్టించుకోకపోవడం గమనార్హం. దీంతో కేబినెట్‌సబ్ కమిటీలను ప్రభుత్వం తక్షణ ఉపశమనం కోసమే ఏర్పాటు చేసింది తప్ప, సమస్యల పరిష్కారం కోసం కాదన్న విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలోని పోడు భూముల సమస్యలు, పట్టాల పంపిణీ తదితర సమస్యల పరిష్కారం కోసం 2021 సెప్టెంబరు 16న గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ చైర్‌పర్సన్‌గా ప్రభుత్వం కేబినెట్‌సబ్ కమిటీని నియమించింది. ఇందులో మంత్రులు జగదీశ్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, అజయ్ సభ్యులుగా ఉన్నారు. కమిటీ ఏర్పాటై ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకూ ఏ ఒక్క గిరిజనుడికీ పోడు పట్టా అందలేదు. తండాలు సైతం పూర్తిస్థాయి అభివృద్ధికి నోచుకోలేదు. కమిటీ ఏర్పాటైన మొదట్లో మినహా మళ్లీ ఇప్పటి వరకూ సభ్యులు భేటీ అయిన దాఖలాలు లేవు. 2022 డిసెంబరు నుంచి ప్రతి నెలా పోడు పట్టాలిస్తామంటూ గిరిజన శాఖ మంత్రి ప్రకటిస్తూ వస్తున్నా.. పట్టాలు మాత్రం అందడం లేదు. తాజాగా రాష్ట్రంలో పర్యటించిన జాతీయ ఎస్టీ కమిషన్.. గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్యంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించింది. ధరణి పోర్టల్‌లో సమస్యల పరిష్కారం కోసం మంత్రి హరీశ్ అధ్యక్షతన.. మంత్రులు నిరంజన్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివా్‌సగౌడ్ సభ్యులుగా సబ్ కమిటీ ఏర్పాటైంది.
అయితే, నేటికీ ధరణి సమస్యలు పరిష్కారం కాకపోగా, రోజురోజుకూ కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా పాస్ బుక్ డేటా కరెక్షన్, పట్టా భూములు పీవోబీలో నమోదైన సమస్యలు, సాదాబైనమా మార్గదర్శకాలు, మ్యుటేషన్ సమస్యలు, పట్టాదారుల వివరా లు ఆన్‌లైన్‌లో కనిపించకపోవడం లాంటి సమస్యలు ముందు నుంచి ఉన్నా.. ఇంతవర కూ పరిష్కారం కాలేదు. ఇక, తెలంగాణ ఏర్పాటైన తర్వాత 10 జిల్లాలను 33 జిల్లాలుగా మార్చిన ప్రభుత్వం కొత్త జిల్లాల్లో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల ఏర్పాటు, తదితర సమస్యల పరిష్కారం కోసం హోంమంత్రి మహమూద్ అలీ చైర్మన్‌గా కేబినెట్ సబ్‌కమిటీని నియమించింది. కానీ ఇప్పటికీ పూర్తిస్థాయిలో ఈ సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. ధరణి, పోడు భూములు, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల కోసం ఏర్పాటు చేసిన ఈ మూడు సబ్ కమిటీలను ప్రభుత్వం 2021 సెప్టెంబరు 16న నియమించింది. ఏళ్లు గడుస్తున్నా కమిటీలు సమస్యలకు పరిష్కార మార్గాన్ని చూపించలేకపోయాయి.
నాసిరకంగా ‘మన ఊరు-మన బడి’..
గ్రామీణ, పట్టణ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ ఆధునికీకరించాలని, అవసరమైన చోట మ రమ్మతులు చేయాలని నిర్ణయించిన సర్కారు ‘మన ఊరు-మన బడి’ పేరుతో కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ఇందుకోసం విద్యాశాఖమంత్రి సబిత చైర్‌పర్సన్‌గా.. పలువురు మంత్రులు సభ్యులుగా కేబినెట్‌సబ్ కమిటీ ఏర్పాటైంది. కానీ ఈ పథకాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో కమిటీ విఫలమైంది. పలుచోట్ల చేసిన మరమ్మతులు కూడా నాసిరకంగా ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల ఫీజు వసూళ్లపై ఫీజు నియంత్రణ చట్టం కోసం కూడా ఈ కమిటీ పలు మార్గదర్శకాలను, నిబంధనలను ఖరారు చేస్తుందని ప్రకటించినా.. ఇంతవరకూ అలాంటిదేమీ జరగలేదు.
ప్లాట్లలో పాట్లు యథాతథం..
అక్రమ లే ఔట్లు, ప్లాట్లు, ఇంటి స్థలాలు, గ్రామకంఠం సంబంధిత సమస్యల పరిష్కారం కోసం మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సెప్టెంబరు 21, 2021న కేబినెట్‌సబ్ కమిటీ కొలువుదీరింది. ఏళ్ల నుంచి సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపని ఈ కమిటీ రెండు వారాల క్రితం జీవో నెం 58, 59ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. నాన్ అగ్రికల్చర్ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ అవినీతి రహితంగా, సులభంగా జరగాలని.. అందుకు అవసరమైన చర్యల కోసం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చైర్మన్‌గా సీఎం కేసీఆర్ కమిటీని నియమించారు. వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు పారదర్శకంగా జరిగేందుకు, లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితులు లేకుండా ఉండేందుకు ఈ కమిటీ విధివిధానాలను ఖరారు చేయాలని సూచించారు. కానీ ఆశించిన ఫలితాలు కనిపించడం లేదు. లంచం ఇవ్వనిదే వ్యవసాయ, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు జరగడం లేదు.
ఆయిల్ పామ్ హడావుడి లేదు..
కొవిడ్ సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల సంరక్షణ, అనాథ బిడ్డలను చేరదీయడం, వారికి విద్యనందించడం తదితర అవసరాల కోసం మంత్రి సత్యవతి రాథోడ్ చైర్‌పర్సన్‌గా సబ్‌కమిటీ ఏర్పాటైంది. కానీ నేటికీ అనాథ పిల్లల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారు, అందుకు అవసరమైన విధివిధానాలు ఏంటన్నదానిపై కమిటీ ఏమీతేల్చలేదు. దేశానికే వంట నూనెను సరఫరా చేయాలన్న లక్ష్యంతో రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ఆయిల్‌పామ్‌ను విస్తృతంగా సాగు చేయించాలని వ్యవసాయ శాఖకు లక్ష్యాన్ని విధించింది. ఆయిల్‌పామ్ సాగు ప్రమోషన్ కోసం వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి చైర్మన్‌గా కమిటీ నియామకమైంది. అంతేకాదు.. ఇంటర్నల్ కమిటీని కూడా నియమించారు. అయినా, రాష్ట్రంలో ఇప్పటి వరకూ ఆశించిన మేర ఆయిల్‌పామ్ సాగుకాలేదు. ఫ్యాక్టరీల నిర్మాణంలోనూ జాప్యం జరుగుతోంది. కాగా, పలు సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటైన కమిటీలు ఏమాత్రం పరిష్కారాలను చూపాయో తెలియదు కాని స్వరాష్ట్ర దశాబ్ది ఉత్సవాల కమిటీ మాత్రం ఆగమేఘాల మీద పలు నిర్ణయాలను తీసుకుంటుండటం గమనార్హం.
కమిటీలకు కాలపరిమితి ఏదీ..?
కేబినెట్ సబ్ కమిటీలకు కాలపరిమితి లేకపోవడంతో ఏళ్లు గడుస్తున్నా కమిటీలు సమస్యల పరిష్కారానికి కృషి చేయడంలేదు. ఫలితంగా కమిటీల ఏర్పాటు లక్ష్యం నెరవేరడం లేదు. ఇక, ప్రధానమైన సమస్యల కోసం ఏర్పాటవుతున్న కమిటీలు పలు నిర్ణయాలు తీసుకుని ప్రభుత్వానికి రిపోర్టులు ఇస్తున్నా.. అవి అమలుకు మాత్రం నోచుకోవడంలేదు. సబ్ కమిటీలు ఇస్తున్న రిపోర్టులు సీఎం వద్దకు చేరుతుండటంతో అవన్నీ పెండింగ్‌లో ఉంటున్నాయి. దీంతో ఏ ఒక్క సమస్యా పరిష్కారం కావడంలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నియమిస్తున్న మంత్రి వర్గ ఉప సంఘాలకు సమస్య తీవ్రతను బట్టి కాల పరిమితిని విధిస్తే త్వరితగతిన సమస్యలు పరిష్కారం అవుతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.