సచివాలయ గుమ్మటాలు కూల్చేస్తాం
ABN , First Publish Date - 2023-02-11T04:11:59+05:30 IST
బీజేపీ అధికారంలోకి రాగానే నూతన సచివాలయ గుమ్మటాలను కూల్చేస్తామని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన ప్రకటన చేశారు. నిజాం వారసత్వ బానిస మరకలను సమూలంగా తుడిచివేస్తామని..
నిజాం వారసత్వ బానిస మరకలను తుడిచేస్తాం
భారత, తెలంగాణ సంస్కృతిని చాటేలా మార్పులు చేస్తాం..
ఒవైసీ కళ్లల్లో ఆనందం కోసమే ఆ డిజైన్
రూ.400 కోట్లు అని.. 1,500 కోట్లకు పెంచారు..
ప్రగతి భవన్‌ను ప్రజా దర్బార్ చేస్తాం: సంజయ్
రాష్ట్రవ్యాప్తంగా ‘జనం గోస-బీజేపీ భరోసా’ ప్రారంభం
హైదరాబాద్/ఓల్డ్ బోయిన్‌పల్లి/జగిత్యాల, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): బీజేపీ అధికారంలోకి రాగానే నూతన సచివాలయ గుమ్మటాలను కూల్చేస్తామని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన ప్రకటన చేశారు. నిజాం వారసత్వ బానిస మరకలను సమూలంగా తుడిచివేస్తామని.. భారతీయ, తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా సచివాలయంలో మార్పులు చేస్తామని చెప్పారు. ‘జనం గోస-బీజేపీ భరోసా’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఓల్డ్ బోయిన్‌పల్లిలో ప్రారంభమైన స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లో.. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సంజయ్ ప్రసంగించారు. తాజ్‌మహల్ కంటే అందమైన సచివాలయాన్ని కేసీఆర్ కట్టారంటూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై సంజయ్ స్పందించారు. ఒవైసీ కళ్లల్లో ఆనందం కోసమే తాజ్‌మహల్ లాంటి సమాధిని కట్టారని మండిపడ్డారు. నూతన సచివాలయ ప్రాంగణంలో పోచమ్మతల్లి గుడి కట్టాలని డిమాండ్ చేశారు. సెక్రటేరియట్‌కు రూ.400 కోట్లు అవుతాయని చెప్పి అంచనాలను రూ.1,500 కోట్లకు పెంచారని మండిపడ్డారు. సచివాలయాన్ని ఏప్రిల్ 14న ప్రారంభించాలని సంజయ్ డిమాండ్ చేశారు. తాము అధికారంలోకి రాగానే ప్రగతి భవన్‌ను ప్రజా దర్బార్‌లా మారుస్తామని చెప్పారు. దమ్ముంటే రోడ్డుకు అడ్డంగా ఉన్న మసీదులు, చర్చిలు, మందిరాల కూల్చివేతను పాతబస్తీ నుంచి ప్రారంభించాలని మంత్రి కేటీఆర్‌కు సవాల్ విసిరారు. పోడు భూములకు వెంటనే పట్టాలివ్వకపోతే గిరిజనులు కేసీఆర్ ఫాంహౌ్‌సను దున్నడం ఖాయమని హెచ్చరించారు. విలేకరుల గొంతు నొక్కుతున్న కేసీఆర్ ప్రభుత్వం.. జర్నలిస్టుల సంక్షేమంలో నంబర్ వన్‌గా నిలిచిందని అసెంబ్లీ సాక్షిగా చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. ఎంతమంది జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇచ్చారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న 1,100 మందికి నిజాంపేట, పేట్‌బషీరాబాద్‌లో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చి 6 నెలలైనా.. ఇంత వరకు ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. జర్నలిస్టులకు ఇళ్లు ఇచ్చేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని.. కేసీఆర్ ప్రతిపాదన పంపితే వారం రోజుల్లో ఇళ్లు మంజూరు చేయించే బాధ్యత తీసుకుంటానని సంజయ్ తెలిపారు.
‘జనం గోస-బీజేపీ భరోసా’ ప్రారంభం
రాష్ట్రవ్యాప్తంగా జనం గోస-బీజేపీ భరోసా కార్యక్రమం శుక్రవారం ప్రారంభమైంది. దీని ద్వారా 119 నియోజకవర్గాల్లో 11వేల స్ట్రీట్ కార్నర్ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించారు. బీఆర్‌ఎస్ మూర్ఖత్వపు పాలనను ప్రజలకు వివరించడం, పేదల సంక్షేమం కోసం మోదీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను తెలియజేసేందుకు ఈ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు సంజయ్ చెప్పారు. కాగా, రాష్ట్రంలో సీఎం కేసీఆర్ కుటుంబానికి గుణపాఠం తప్పదని, ఎమ్మెల్సీ కవిత దొంగ సారా దందాలో జైలుకు వెళ్లడం ఖాయమని ఎంపీ అర్వింద్ వ్యాఖ్యానించారు. జగిత్యాలలోని గాంధీనగర్ కాలనీలో జరిగిన జనం గోస-బీజేపీ భరోసా కార్యక్రమంలో అర్వింద్ మాట్లాడారు. ఎత్తిపోతల పేరిట ఇతర రాష్ట్రాలకు తెలంగాణ నీరు ఇవ్వడానికి కేసీఆర్ కుట్ర చేస్తున్నారని విమర్శించారు. కాగా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ వచ్చారు. శనివారం సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో జరిగే ఐపీఎ్‌సల పాసింగ్ ఔట్ పరేడ్‌లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన శుక్రవారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయంలో దిగారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, సంజయ్, డీజీపీ అంజనీకుమార్ ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం నోవోటెల్ హోటల్‌లో నేతలతో షా భేటీ అయ్యారు.