ఆ 45 టీఎంసీలపై హక్కు మాదే

ABN , First Publish Date - 2023-02-02T02:25:00+05:30 IST

పోలవరం ప్రాజెక్టు నుంచి కృష్ణా డెల్టా సిస్టమ్‌కు తరలించే 80 టీఎంసీలకు బదులుగా సాగర్‌ ఎగువన ఉన్న రాష్ట్రాలు కృష్ణా జలాల్లో 80 టీఎంసీలను వాడుకోవాలనే బచావత్‌ ట్రైబ్యునల్‌ను అనుసరించి...

ఆ 45 టీఎంసీలపై హక్కు మాదే

సాగర్‌ ఎగువన ఉన్న బేసిన్‌ రాష్ట్రం తెలంగాణే

బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ లో తె లంగాణ పిటిషన్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు నుంచి కృష్ణా డెల్టా సిస్టమ్‌కు తరలించే 80 టీఎంసీలకు బదులుగా సాగర్‌ ఎగువన ఉన్న రాష్ట్రాలు కృష్ణా జలాల్లో 80 టీఎంసీలను వాడుకోవాలనే బచావత్‌ ట్రైబ్యునల్‌ను అనుసరించి... అందులో దక్కిన వాటా ప్రకారం 45 టీఎంసీలను వాడుకునే అధికారం తమకే ఉందని తెలంగాణ తాజాగా స్పష్టం చేసింది. నాగార్జున సాగర్‌కు ఎగువన కృష్ణా బేసిన్‌లో తెలంగాణ మాత్రమే ఉందని పేర్కొంది. 80 టీఎంసీల్లో 35, కర్ణాటక 21, మహారాష్ట్ర 14 టీఎంసీలు ఇదివరకే వాడుకున్నాయని, మిగిలిన 45 టీఎంసీలపై పూర్తి హక్కు తెలంగాణకే ఉందని పేర్కొంది. ఈ మేరకు జస్టిస్‌ బ్రిజే్‌షకుమార్‌ ట్రైబ్యునల్‌(కృష్ణా-2)లో ఇంటర్‌ లోకేటరీ పిటిషన్‌ను దాఖలు చేసింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 45 టీఎంసీల కృష్ణా జలాలను కేటాయిస్తూ తెలంగాణ జారీ చేసిన ఉత్తర్వులను (జీవో నం.246పై) నిలుపుదల చేయాలని కోరుతూ ఏపీ వేసిన పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలని ట్రైబ్యునల్‌ ఆదేశించడంతో ఆ మేరకు పిటిషన్‌ను రాష్ట్రం దాఖలు చేసింది. పోలవరం ప్రాజెక్టు ద్వారా 80 టీఎంసీలను కేడీఎస్‌ (కృష్ణా డెల్టా సిస్టమ్‌)కు తరలించడానికి పోలవరానికి అనుమతిస్తే... సాగర్‌ ఎగువన ఉన్న రాష్ట్రాలు 80 టీఎంసీలు వాడుకోవడానికి బచావత్‌ ట్రైబ్యునల్‌ తీర్పునిచ్చిన విషయాన్ని గుర్తు చేసింది. బచావత్‌ ట్రైబ్యునల్‌ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీల కృష్ణా జలాలను గంపగుత్తగా కేటాయించిందని, ఆ జలాలను బేసిన్‌లోని ఏ ప్రాంతంలోనైనా వాడుకునే స్వేచ్ఛ రాష్ట్రానికి ఇచ్చిందని తెలిపింది. దాంతో మైనర్‌ ఇరిగేషన్‌లో పొదుపు చేసిన 45 టీఎంసీలతో పాటు పోలవరం ప్రాజెక్టు ద్వారా లభించిన 45 టీఎంసీలు కలుపుకొని 90 టీఎంసీలతో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నామని నివేదించింది. ఈ కౌంటర్‌ పిటిషన్‌కు బదులు ఇవ్వడానికి ఏపీకి ట్రైబ్యునల్‌ రెండు వారాల గడువునిచ్చింది.

Updated Date - 2023-02-02T02:25:03+05:30 IST