దశాబ్ది ఉత్సవాలను బహిష్కరిస్తున్నాం

ABN , First Publish Date - 2023-06-02T02:55:04+05:30 IST

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను బహిష్కరిస్తున్నట్టు భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలానికి చెందిన 19 గ్రామాల సర్పంచులు ప్రకటించారు.

దశాబ్ది ఉత్సవాలను బహిష్కరిస్తున్నాం

ప్రకటించిన మహాముత్తారం మండల సర్పంచులు

సన్నాహాక సమావేశం నుంచి వాకౌట్‌

నిధులు రాకపోవడంపై నిరసన

మహాముత్తారం, జూన్‌ 1: తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను బహిష్కరిస్తున్నట్టు భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలానికి చెందిన 19 గ్రామాల సర్పంచులు ప్రకటించారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో దశాబ్ది ఉత్సవాల సన్నాహాక సమావేశాన్ని గురువారం నిర్వహించారు. దీనికి హాజరైన సర్పంచులు.. తమ గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరు చేయనప్పుడు ఈ వేడుకలు ఎందుకంటూ ప్రశ్నించారు. గ్రామ పంచాయతీలకు నెలనెలా రావాల్సిన నిధులను తొమ్మిది నెలలుగా నిలిపేశారని, దాంతో సిబ్బందికి జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీల నిర్వహణకు అప్పులు చేయాల్సి వస్తోందని వాపోయారు. సర్పంచుల పట్ల రాష్ట్రప్రభుత్వం సవతి తల్లి ప్రేమను కనబరుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించి, సమావేశం నుంచి వాకౌట్‌ చేశారు.

Updated Date - 2023-06-02T02:55:04+05:30 IST