నిప్పుల రాళ్లపై నడక

ABN , First Publish Date - 2023-03-31T03:24:49+05:30 IST

నెత్తిన భానుడి భగభగ.. కాళ్ల కింద కృష్ణ శిలల ఉష్ణ సెగ.. తలను గిర్రున తిప్పేస్త్తున్న ఎండ ఉడుకుతో ఉరుకులు..

నిప్పుల రాళ్లపై నడక

ఎండ సెగకు కృష్ణ శిలల భగ భగ

యాదాద్రిపై పిల్లలు, వృద్ధులకు ఇక్కట్లు

హైదరాబాద్‌ శివారులో 40 డిగ్రీలు దాటిన వేడి

యాదాద్రి/హైదరాబాద్‌ సిటీ, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): నెత్తిన భానుడి భగభగ.. కాళ్ల కింద కృష్ణ శిలల ఉష్ణ సెగ.. తలను గిర్రున తిప్పేస్త్తున్న ఎండ ఉడుకుతో ఉరుకులు.. పాదాలను ఎర్రగా కాల్చుతున్న వేడి దగడుతో పరుగులు.. నిలుచుందామంటే చలువ పందిళ్లు లేవు.. వెరసి యాదగిరిగుట్టపై దర్శనానికి వెళ్లిన భక్తులకు దేవుడు కనపడుతున్నాడు. లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ప్రాంగణమంతా కృష్ణ శిలలతో నిర్మితమై ఉండటంతో ఎండ సెగకు రాళ్లు వేడెక్కుతున్నాయి. తిరువీధుల్లో చలువ పందిళ్లు, మ్యాట్‌లు ఏర్పాటు చేయకపోవడంతో.. వేడెక్కిన శిలలపై నడవలేక భక్తులు పరుగులు తీస్తున్నా రు. సామాన్య భక్తులు ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు అధికారులు చర్యలు తీసుకోవడంలేదని భక్తులు విమర్శిస్తున్నారు.

అలియాబాద్‌లో 41.2 డిగ్రీల ఉష్ణోగ్రత..

గ్రేటర్‌ హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో భానుడు భగ్గుమంటున్నాడు. సాధారణం కంటే మూడు డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదవుతుండటంతో బయటకు వెళ్లాలంటేనే జనం జంకుతున్నారు. గురువారం మేడ్చల్‌ జిల్లా అలియాబాద్‌లో 41.2 డిగ్రీలు, రంగారెడ్డి జిల్లా కేతిరెడ్డిపల్లిలో 40.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్‌లోని తిరుమలగిరిలో 39.6, గచ్చిబౌలిలో 39.3 డిగ్రీలు నమోదైంది. మరో రెండు రోజులు ఎండలు ఇలాగే ఉంటాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

Updated Date - 2023-03-31T03:24:49+05:30 IST