ఖమ్మం రోడ్డుకు అండర్‌పాస్‌

ABN , First Publish Date - 2023-04-27T04:06:47+05:30 IST

హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి(ఎన్‌హెచ్‌-65)పై తరచూ చోటుచేసుకుంటున్న ప్రమాదాల నివారణపై జాతీయ రహదారుల విభాగం దృష్టి సారించింది.

ఖమ్మం రోడ్డుకు అండర్‌పాస్‌

హైదరాబాద్‌ - విజయవాడ హైవేపై ప్రమాదాల నివారణకు ఎన్‌హెచ్‌ఏఐ చర్యలు

రూ.264.84 కోట్లతో 17 బ్లాక్‌స్పాట్‌లలో బ్రిడ్జ్‌లు, అండర్‌పాస్‌లు, జంక్షన్ల నిర్మాణం

రూ.155.42 కోట్లతో చౌటుప్పల్‌, టేకుమట్ల వద్ద ఫ్లైఓవర్‌, అండర్‌పాస్‌

వచ్చేనెల 2న టెండర్ల ప్రక్రియ ప్రారంభం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి(ఎన్‌హెచ్‌-65)పై తరచూ చోటుచేసుకుంటున్న ప్రమాదాల నివారణపై జాతీయ రహదారుల విభాగం దృష్టి సారించింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఉన్న ఎన్‌హెచ్‌-65 రహదారిలో 40వ కిలోమీటరు నుంచి 221వ కిలోమీటర్‌ మధ్యలో ప్రమాదాలకు కారణమవుతున్న 19 బ్లాక్‌స్పాట్‌లను గుర్తించింది. ఈ బ్లాక్‌స్పాట్ల వద్ద రూ.420 కోట్లతో అండర్‌ పాస్‌లు, జంక్షన్లు, సర్వీసు రోడ్లను నిర్మించనుంది. వీటి నిర్మాణాలకు అవసరమైన టెండర్ల ప్రక్రియను వచ్చేనెల 2 నుంచి ప్రారంభించనుంది. 19 బ్లాక్‌స్పాట్‌లలో 17 చోట్ల అండర్‌పా్‌సలు, స్వల్పకాలిక చర్యలు, సర్వీస్‌ రోడ్లను నిర్మించేందుకు రూ.264 కోట్లను కేటాయించింది. చౌటుప్పల్‌ వద్ద రూ.114 కోట్లతో ఫ్లైఓవర్‌, ఒక అండర్‌పా్‌సను నిర్మించాలని నిర్ణయించింది. దీంతో పాటు ఈ హైవే నుంచి సూర్యాపేట దగ్గర్లో ఖమ్మం వైపు వెళ్లే ప్రాంతమైన టేకుమట్ల వద్ద రూ.41కోట్లతో అండర్‌ పాస్‌ను కూడా నిర్మించనున్నారు.

కాగా.. ఎన్‌హెచ్‌-163లోని వంగపల్లి-మోటకొండూరు క్రాస్‌ రోడ్‌ వద్ద లైట్‌ వెహికల్‌ అండర్‌పా్‌సను నిర్మించేందుకు ఎన్‌హెచ్‌ఏఐ ఇప్పటికే టెండర్‌ ప్రక్రియను ప్రారంభించింది. ఈ రెండు జాతీయ రోడ్లపై జరుగుతున్న ప్రమాదాలు, వాటి నివారణకు చర్యలు తీసుకోవాలని పలుమార్లు కేంద్ర మంత్రులను కలిసానని, స్పందించిన కేంద్రం తాజాగా వీటి నివారణకు అవసరమైన నిర్మాణాలను చేపట్టేందుకు చర్యలు చేపట్టడం ఎంతో సంతోషంగా ఉందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన మీడియాకు ఒక ప్రకటనను విడుదల చేశారు. నిర్మాణానికి నిధులు మంజూరు చేసినందుకు ప్రధాని మోదీ, కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2023-04-27T04:06:47+05:30 IST