ఉదయ్‌కుమార్‌రెడ్డి విధులకు వచ్చేవాడా?
ABN , First Publish Date - 2023-04-27T04:04:19+05:30 IST
ముఖ్యమంత్రి జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు గత కొన్నిరోజులుగా నిర్విరామంగా కొనసాగుతోంది.
హత్య ముందురోజు డ్యూటీకి వచ్చాడా?
‘యురేనియం’ ప్లాంట్ సిబ్బందికి సీబీఐ ప్రశ్న
హైదరాబాద్, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి)/పులివెందుల : ముఖ్యమంత్రి జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు గత కొన్నిరోజులుగా నిర్విరామంగా కొనసాగుతోంది. వివేకానంద రెడ్డి వద్ద కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేసిన ఇనాయతుల్లా అనే వ్యక్తితోపాటు ఈ హత్య కేసు నిందితుడు గజ్జల ఉదయ్‌కుమార్ రెడ్డి పనిచేసిన తుమ్మలపల్లి యురేనియం కర్మాగారం మెకానికల్ విభాగం అధికారుల్ని సీబీఐ అధికారులు పిలిచి విచారించారు. ఉదయ్‌కుమార్‌రెడ్డి విధులకు సక్రమంగా హాజరయ్యేవాడేనా అంటూ జనరల్ మేనేజర్ ఎంఎస్ రావును ఆరా తీశారు. యూసీఐఎల్ ఉద్యోగులైన చంద్రశేఖర్‌రెడ్డి, రాజు, వెంకటరాజేశ్‌ను హైదరాబాద్‌కు విచారణకు రావాలంటూ మంగళవారం నోటీసులు ఇచ్చింది.
బుధవారం వీరు హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఉదయ్‌కుమార్‌రెడ్డి తీరు ఎలా ఉండేది అని ఆ ముగ్గురిని అడిగి వారి స్టేట్‌మెంట్ రికార్డు చేసినట్లు సమాచారం. వివేకా హత్యకు గురికావడానికి ముందురోజు ఉదయ్‌కుమార్‌రెడ్డి విధులకు హాజరయ్యారా లేదా అనే అంశంపై ఆరాతీశారు. ఆ రోజు ఉదయం ఇన్ టైమింగ్ పంచ్ మాత్రమే నమోదైందని, సాయంత్రం ఔట్ టైమింగ్ పంచ్ లేదని సీబీఐ గుర్తించిందని సమాచారం. వివేకా హత్య తర్వాత ఆయన ఫొటోలు, వీడియోలు తీసి కుటుంబసభ్యులకు ఇనాయతుల్లా పంపించినట్లు సీబీఐ గుర్తించింది. ఇటీవల కడపలో సీబీఐ ప్రత్యేక బృందం కేసు విచారణలో భాగంగా ఇనాయతుల్లాను ప్రశ్నించింది. సాక్షిగా నోటీసులు జారీ చేసిన అధికారులు... సీబీఐ కార్యాలయానికి పిలిచి విచారించారు. వివేకా మృతి చెందిన రోజు మొదటి కొన్ని గంటల్లో జరిగిన పరిణామాలను ఎవరెవరికి చేరవేశారు వంటి అంశాలపై ఇనాయతుల్లాను ప్రశ్నించినట్లు సమాచారం.