TSPSC Chairman Janardhan Reddy: నమ్మినవారే మోసం చేశారు

ABN , First Publish Date - 2023-03-15T03:19:27+05:30 IST

‘నమ్మిన వారే మోసం చేశారు.. ఈ ఏడాది 23 వేల ఉద్యోగాల కోసం 26 నోటిఫికేషన్లు విడుదల చేస్తే ఇప్పటిదాకా ఆరు పరీక్షలు జరిగాయి. ఏ పరీక్ష నిర్వహణలోనైనా లోపాలు జరిగాయా అనే అంశంపై సైబర్‌ సెక్యూరిటీతో అధ్యయనం చేయిస్తున్నాం.’’ ..అని టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ జనార్దన్‌ రెడ్డి అన్నారు.

TSPSC Chairman Janardhan Reddy: నమ్మినవారే మోసం చేశారు

అభ్యర్థులు ఆందోళనకు గురికావొద్దు

ప్రశ్నపత్రాలన్నీ కొత్తగా రూపొందిస్తున్నాం

గ్రూప్‌-1పై అపోహలొద్దు: టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌

48 గంటల్లోగా నివేదిక ఇవ్వండి

పూర్తిస్థాయి విచారణ జరపండి: గవర్నర్‌ ఆదేశం

హైదరాబాద్‌/అఫ్జల్‌గంజ్‌ మార్చి 14 (ఆంధ్రజ్యోతి): ‘‘నమ్మిన వారే మోసం చేశారు.. ఈ ఏడాది 23 వేల ఉద్యోగాల కోసం 26 నోటిఫికేషన్లు విడుదల చేస్తే ఇప్పటిదాకా ఆరు పరీక్షలు జరిగాయి. ఏ పరీక్ష నిర్వహణలోనైనా లోపాలు జరిగాయా అనే అంశంపై సైబర్‌ సెక్యూరిటీతో అధ్యయనం చేయిస్తున్నాం.’’ ..అని టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ జనార్దన్‌ రెడ్డి అన్నారు. అసిస్టెంట్‌ ఇంజనీర్‌(ఏఈ) పరీక్ష రద్దుపై బుధవారం న్యాయనిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రకటించారు. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం నేపథ్యంలో.. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. టౌన్‌ప్లానింగ్‌ ఉద్యోగాల భర్తీ కోసం పరీక్షకు ముందు తమకు అనుమానం రావడంతో వెంటనే కాన్ఫిడెన్షియల్‌ విభాగం నుంచి వివరాలు తీసుకుని పోలీసులకు సమాచారం ఇచ్చామని.. ఈ వ్యవహారంపై తమకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని, తామే అప్రమత్తమై నిందితుల్ని పట్టుకున్నామని స్పష్టం చేశారు. ‘‘నెట్‌వర్క్‌ ఎక్స్‌పర్ట్‌గా ఉన్న రాజశేఖర్‌రెడ్డి ఐపీ అడ్ర్‌సలు కనుక్కొని హ్యాకింగ్‌కు పాల్పడినట్లు గుర్తించాం. రాజశేఖర్‌రెడ్డి హ్యాకింగ్‌ చేసిన సమాచారాన్ని అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ ప్రవీణ్‌ దుర్వినియోగం చేసి, అందరికీ చేరవేశారు’’ అని ఆయన వివరించారు.

ప్రశ్నపత్రం లీకేజీతో ప్రమేయం ఉన్న ఐదుగురి ఉద్యోగాలూ పోతాయని చెప్పారు. గ్రూప్‌-1 పరీక్షలపై అపోహలు వద్దని, మెరిట్‌ ప్రకారమే నియామకాలు చేపడతామని తెలిపారు. జూన్‌లో గ్రూప్‌-1 మెయిన్స్‌ నిర్వహిస్తామని తెలిపారు. పరీక్షల కోసం కొత్తగా ప్రశ్నపత్రాలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. ‘‘యూపీఎస్సీలో ఏటా నాలుగువేల నియామకాలు మాత్రమే జరుగుతాయి. టీఎ్‌సపీఎస్సీలోనూ... ఏపీపీఎస్సీ ఉన్నప్పుడు కూడా ఏటా సగటున 3 వేల ఉద్యోగాలే భర్తీ చేశారు. కానీ, ఈ ఏడాది 23 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపడుతున్నందున మాపై ఒత్తిడి ఉంది. నియామక ప్రక్రియ అంతా పారదర్శకంగానే జరుగుతుంది. మాస్‌ కాపీయింగ్‌కు తావు లేకుండా మల్టిపుల్‌ జంబ్లింగ్‌, మల్టిపుల్‌ ఆప్షన్‌ అమలు చేశాం. గతంలో ఎప్పుడూ ఈ విధానం అమలు కాలేదు’’ అని జనార్దన్‌ రెడ్డి తెలిపారు.

నా పిల్లలు పరీక్ష రాయలేదు

తమ పిల్లలు నాన్‌లోకల్‌ అని.. వారెవరూ గ్రూప్‌-1 రాయలేదని జనార్దన్‌ రెడ్డి వెల్లడించారు. దరఖాస్తు చేస్తామని తనకు చెబితే వద్దని చెప్పానని.. వారు దరఖాస్తు చేస్తే తాను చైర్మన్‌ పదవిని వదులుకోవాల్సి ఉంటుందని గుర్తు చేశానని ఆయన వివరించారు. పరీక్షల విధానంలో పారదర్శకతను, సైబర్‌ సెక్యూరిటీని మరింత పెంచుతామని చెప్పారు.

Updated Date - 2023-03-15T05:02:47+05:30 IST