దేశ ప్రజలను ప్రేమించడమే నిజమైన దేశభక్తి

ABN , First Publish Date - 2023-02-21T04:16:03+05:30 IST

దేశ ప్రజల పట్ల ప్రేమ, వారి అభ్యున్నతి పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించడమే నిజమైన దేశభక్తిగా తాను విశ్వసిస్తున్నట్లు మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు తెలిపారు.

దేశ ప్రజలను ప్రేమించడమే నిజమైన దేశభక్తి

మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు

హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): దేశ ప్రజల పట్ల ప్రేమ, వారి అభ్యున్నతి పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించడమే నిజమైన దేశభక్తిగా తాను విశ్వసిస్తున్నట్లు మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు తెలిపారు. ద్రవిడ విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు పులికొండ సుబ్బాచారి రాసిన ‘రేవు తిరగబడితే’ నవలను, ‘తెలుగుల వైభవం’ పద్య కావ్యాన్ని సోమవారం హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని జాకీర్‌ హుస్సేన్‌ హాల్లో వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వరాజ్యం సాధించిన తొలినాళ్లలో ఇంకా స్వాతంత్య్రం సిద్ధించని ప్రజల స్థితిగతులను ఈ నవల కళ్లకు కడుతుందన్నారు. తెలుగు వారంతా ఇంట, బయట తెలుగులోనే సంభాషణలు కొనసాగించాలంటూ పిలుపునిచ్చారు. ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ కె. శ్రీనివాస్‌ మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో ‘మాలపల్లి’ తర్వాత అంతటి సాంఘిక చరిత్రను ప్రతిబింబించిందీ ‘రేవు తిరగబడితే’ నవల అంటూ అభివర్ణించారు. హెచ్‌సీయూ వైస్‌ చాన్సలర్‌ ఆచార్య ఆర్‌ఎస్‌ సర్రాజు, నగర సిటీ కళాశాల తెలుగు శాఖ ఆచార్యుడు కోయి కోటేశ్వరరావు, హెచ్‌సీయూ వైస్‌ చాన్సలర్‌ ఆచార్య బీజే రావు, ప్రముఖ కవి కొప్పర్తి వెంకట రమణమూర్తి, హెచ్‌సీయూ తెలుగు శాఖ అధ్యక్షుడు ఆచార్య వెంకటేశ్వరరావు, దళిత, ఆదివా సీ అధ్యయన అనువాద కేంద్రం అధ్యక్షుడు ఆచార్య విష్ణుసర్వదే, రచయిత ఆచార్య పులికొండ సుబ్బాచారి తదితరులు పాల్గొన్నారు. ‘‘తెలుగు దినపత్రికల్లో ప్ర ప్రథమంగా సాహిత్యానికి ప్రత్యేక పేజీని కేటాయించిన ఘనత ఒక్క ఆంధ్రజ్యోతికే సొంతమని’’ పులికొండ సుబ్బాచారి అన్నారు. తెలుగులో ప్రామాణిక సాహిత్య విమర్శ కోసం ఆంధ్రజ్యోతి ‘వివిధ’ సాహిత్య పేజీని ఆశ్రయించాల్సిందేనంటూ ఆయన మాట్లాడుతున్నప్పుడు సభంతా చప్పట్లతో మార్మోగింది.

Updated Date - 2023-02-21T04:16:05+05:30 IST