పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలి
ABN , First Publish Date - 2023-02-21T03:50:08+05:30 IST
ఎటువంటి ఆంక్షలు లేకుండా పోడు భూములు సాగు చేసుకునే వారందరికీ హక్కు పత్రాలు ఇవ్వాలని ఆదివాసీ హక్కుల పరిరక్షణ సమన్వయ కమిటీ నేతలు డిమాండ్ చేశారు.
అటవీ హక్కుల పరిరక్షణ సమన్వయ కమిటీ మహా ధర్నా
కవాడిగూడ, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): ఎటువంటి ఆంక్షలు లేకుండా పోడు భూములు సాగు చేసుకునే వారందరికీ హక్కు పత్రాలు ఇవ్వాలని ఆదివాసీ హక్కుల పరిరక్షణ సమన్వయ కమిటీ నేతలు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అటవీ హక్కుల నియమాలు-2022ను రద్దు చేయాలని ఆదివాసీ అటవీ హక్కుల పరిరక్షణ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో సోమవారం మహాధర్నా నిర్వహించారు. పౌరహక్కుల సంఘం నాయకులు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ హరగోపాల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఉప ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన హామీ ప్రకారం ఆంక్షలు లేకుండా పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ పోడు భూముల సమస్యలపై అనేక రౌండ్‌టేబుల్ సమావేశాలు నిర్వహించడంతో పాటు గవర్నర్‌కు అనేకసార్లు వినతిపత్రాలు ఇవ్వడం జరిగిందన్నారు. అటవీ హక్కుల చట్టం పరిధిలో పోడు రైతులపై చర్యలు తీసుకోవాలే తప్ప బలవంతంగా ఖాళీ చేయించవద్దన్నారు. మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సీపీఐ (ఎంఎల్) న్యూ డెమొక్రసీ రాష్ట్రకార్యదర్శి వర్గసభ్యు లు మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు పశ్య పద్మ, ఏఐకేఎంస్ జాతీయ అధ్యక్షుడు వేములపల్లి వెంకట్రామయ్య, సీపీఐ (ఎంఎల్) రాష్ట్ర నాయకులు సాధినేని వెంకటేశ్వరరావు, టీపీసీసీ నాయకులు మల్లు రవి, ప్రజాపంథా నాయకులు వి. ప్రభాకర్, తదితరులు కూడా మాట్లాడారు.