MLA purchase Case: సుప్రీంకే వెళ్లండి!

ABN , First Publish Date - 2023-02-07T03:18:24+05:30 IST

ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసును సీబీఐకి బదిలీ చేస్తూ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును కొట్టేయాలని కోరుతూ..

MLA purchase  Case: సుప్రీంకే వెళ్లండి!

మ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ

సర్కారు, సిట్‌ వేసిన పిటిషన్లను కొట్టేసిన డివిజన్‌ బెంచ్‌

ఆ పిటిషన్లకు విచారణార్హత లేదని ధర్మాసనం స్పష్టీకరణ

రామ్‌కిషన్‌ ఫౌజీ తీర్పుమేరకు సుప్రీంకే వెళ్లాలని సూచన

సుప్రీంలో అప్పీలుకు వెళ్లే దాకా ఈ ఆదేశాలను సస్పెండ్‌ చేయాలని కోరిన అడ్వొకేట్‌ జనరల్‌.. తోసిపుచ్చిన కోర్టు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసును సీబీఐకి బదిలీ చేస్తూ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును కొట్టేయాలని కోరుతూ.. రాష్ట్ర ప్రభుత్వం, సిట్‌ దాఖలు చేసిన అప్పీళ్లను హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ కొట్టేసింది. ప్రభుత్వ అప్పీల్‌ పిటిషన్‌లకు విచారణార్హత లేదని పేర్కొంటూ చీఫ్‌ జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌, జస్టిస్‌ ఎన్‌ తుకారాంజీ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం కీలక తీర్పు వెలువరించింది. దీనిపై సుప్రీంకోర్టుకే వెళ్లాలని తేల్చిచెప్పింది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే వాదనలు వినిపించారు. ఈ కేసులో సిట్‌ అప్పటివరకూ చేసిన దర్యాప్తును.. ఎవరూ అడగకముందే సింగిల్‌ జడ్జి క్వాష్‌ చేశారని.. సిట్‌ జీవోను కొట్టేశారని.. అత్యంత అసాధారణమైన ఆదేశాలను జారీచేశారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఎటువంటి ఆధారాలను పరిశీలించకుండానే దర్యాప్తును సీబీఐకి ఇచ్చారని.. ఇది రాష్ట్రపోలీసుల హక్కులను కాలరాయడమేనని పేర్కొన్నారు. అత్యంత సమర్థులైన ఐపీఎస్‌ అధికారులు కలిగిన సిట్‌ను కాదని.. కేసును సీబీఐకి బదిలీ చేయడానికి సరైన కారణాలు లేవని అభ్యంతరం చెప్పారు.

ముఖ్యమంత్రి దీనిపై పత్రికా సమావేశం పెట్టడం దర్యాప్తులో జోక్యం కిందికి రాదని.. ఒక రాజకీయ పార్టీ చట్టబద్ధంగా, తన రాజకీయ లక్ష్యాల మేరకు చేసిన రాజకీయ కార్యక్రమంగానే చూడాలని పేర్కొన్నారు. ప్రభుత్వాధినేతగా తన ప్రభుత్వానికి ప్రమాదం పొంచిఉందని సీఎం చెప్పడంలో తప్పులేదని తెలిపారు. నిందితులకు, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి మధ్య జరిగిన సంభాషణల ఎలకా్ట్రనిక్‌ ఆధారాలు అప్పటికే జనబాహుళ్యంలో ఉన్నాయని.. వాటిని ముఖ్యమంత్రికి పోలీసులు ఇవ్వలేదని స్పష్టంచేశారు. ఆ ఆధారాలను సీఎం వివిధ హైకోర్టులకు, సుప్రీంకోర్టుకు పంపడం దర్యాప్తులో జోక్యం చేసుకోవడం కిందికి రాదని పేర్కొన్నారు. నిందితులు బేరసారాలు చేస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికారని.. దీనికి సంబంధించి స్పష్టమైన ఆధారాలున్నాయని గుర్తుచేశారు.

క్రిమినల్‌ అధికార పరిధిలోనే..

సింగిల్‌ జడ్జి క్రిమినల్‌ అధికార పరిధిలో ఆదేశాలు జారీచేసినందున డివిజన్‌ బెంచ్‌లో అప్పీల్‌ ఉండదని.. ‘రామ్‌కిషన్‌ ఫౌజీ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ హరియాణా’ కేసులో సుప్రీం తీర్పు ప్రకారం క్రిమినల్‌ కేసుల్లో హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చే ఆదేశాలపై నేరుగా సుప్రీంకోర్టులోనే అప్పీల్‌ ఉంటుందని నిందితుల తరఫున సీనియర్‌ న్యాయవాది డీవీ సీతారామమూర్తి ధర్మాసనానికి గుర్తుచేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలతోపాటు తెలంగాణ హైకోర్టు లెటర్స్‌ పేటెంట్‌ రూల్స్‌లోని క్లాజ్‌ 15ను ఆయన ప్రస్తావించారు. సింగిల్‌ జడ్జి ఎదుట ఉన్నవి ఆర్టికల్‌ 226 ప్రకారం దాఖలైన రిట్‌ పిటిషన్‌లే అయినా.. సింగిల్‌ జడ్జి తన క్రిమినల్‌ అధికార పరిధిని ఉపయోగించి ఆదేశాలు జారీచేశారని తెలిపారు. సిట్‌ అప్పటివరకు చేసిన దర్యాప్తును క్వాష్‌ (కొట్టేయడం) చేశారని.. ఆ అధికారం కేవలం క్రిమినల్‌ అధికార పరిధిలోనే ఉంటుందని తెలిపారు. క్రిమినల్‌ అధికార పరిధిలో ఇచ్చిన ఏ ఆదేశంపైనా ఇంట్రా కోర్టు అప్పీల్‌ ఉండదని.. నేరుగా సుప్రీంకోర్టుకే వెళ్లాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

అన్నివర్గాల వాదనలు విస్తృతంగా పరిశీలించిన ధర్మాసనం.. సింగిల్‌ జడ్జి ఎదుట ఉన్న పిటిషన్లు క్రిమినల్‌ సబ్జెక్ట్‌ మ్యాటర్లని చెప్పడంలో తమకు ఎలాంటి అనుమానం లేదని వ్యాఖ్యానించింది. వాటిపై సింగిల్‌ జడ్జి తన క్రిమినల్‌ అధికార పరిధి (క్రిమినల్‌ జ్యూరి్‌సడిక్షన్‌)ను ఉపయోగించి ఆదేశాలు జారీచేశారని స్పష్టంచేసింది. సింగిల్‌జడ్జి ఇచ్చిన తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చిన ‘రామ్‌కిషన్‌ ఫౌజీ’ తీర్పులో పేర్కొన్న నిర్వచనం పరిధిలోకే వస్తుందని తెలిపింది. లెటర్‌ పెటెంట్‌ రూల్స్‌ ప్రకారం సింగిల్‌ జడ్జి ఆదేశాలపై ఇంట్రా కోర్టు అప్పీల్‌ ఉండదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం, సిట్‌ దాఖలు చేసిన అప్పీల్‌ పిటిషన్‌లకు విచారణార్హత లేదని.. విచారణాధికారం సుప్రీంకోర్టుకే ఉందని తేల్చిచెప్పింది. ఈ మేరకు ప్రభుత్వ రిట్‌ అప్పీళ్లను కొట్టేస్తున్నట్లు తుది ఆదేశాలను ప్రకటించింది.

ఏజీ విజ్ఞప్తి తిరస్కరణ..

తీర్పు వెలువరించిన వెంటనే.. ఈ ఆదేశాలపై సుప్రీంలో అప్పీల్‌కు వెళ్లేవరకూ తీర్పును సస్పెండ్‌ చేయాలని అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ ధర్మాసనాన్ని కోరారు. విస్తృతస్థాయిలో పరిశీలించి తీర్పు వెలువరించినందున తీర్పుపై స్టే ఇవ్వలేమని ధర్మాసనం స్పష్టంచేసింది. ఏజీ విజ్ఞప్తిని తోసిపుచ్చింది.

రెండు కీలక కేసులు..

రాష్ట్ర సర్కారు సీబీఐకి తెలంగాణలోకి నో ఎంట్రీ చెప్పిన తర్వాత కోర్టు ఆదేశాలతో రెండు కీలక కేసులు సీబీఐ వద్దకు చేరాయి. అవి..వివేకా హత్య కేసు, ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.

ఇక రంగంలోకి సీబీఐ

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తమ విచారణకు న్యాయపరంగా లైన్‌ క్లియర్‌ కావడంతో ఇక రంగంలోకి దిగేందుకు సీబీఐ సిద్ధమైంది. ఈ కేసులో సోమవారంతీర్పు వెలువడుతుందని ముందే తెలిసిన సీబీఐ అధికారులు.. విచారణ సమయంలో హైకోర్టుకు వచ్చారు. అప్పీల్‌కు వెళ్లేవరకూ ఈ ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించడంతో.. కేసు ఫైళ్లు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వంపై సీబీఐ ఒత్తిడి పెంచనుంది. గత అక్టోబరులో నమోదైన ఈ కేసుకు సంబంధించి.. హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం డిసెంబరులో సీబీఐ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈమేరకు సీబీఐ హైదరాబాద్‌ విభాగం అధికారులు.. కేసు వివరాలు ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌)కి లేఖ రాశారు. కానీ సిట్‌ అధికారులకు ఆ సమాచారం అందలేదు. ఫలితంగా సిట్‌ నుంచి ఎలాంటి సమాచారం సీబీఐ అధికారులకు చేరలేదు. తాజాగా హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తీర్పు నేపథ్యంలో సీబీఐ అధికారులు మరోసారి ప్రభుత్వానికి లేఖ రాసి వివరాలు తెప్పించుకోనున్నారు. వివరాలు అందాక, సీబీఐ వాటిని పరిశీలించి.. కేసులో నిందితులుగా ఉన్న రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్‌తోపాటు ఫిర్యాదుదారు ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌ రెడ్డి తదితరులకు నోటీసులు జారీ చేసి, విచారించి వారి వాంగ్మూలాన్ని నమోదు చేయనుంది. ఈడీ... త్వరలోనే మరికొందరికి నోటీసులు జారీ చేసి విచారించి వాంగ్మూలం నమోదు చేయనుంది.

సుప్రీంను ఆశ్రయిస్తాం: గువ్వల

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సీబీఐ విచారణకు అనుమతిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని.. దీనిపై ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడుతామని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తెలిపారు. ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్నవారిపై ఐటీ, ఈడీలతో కేంద్రం దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు.

Updated Date - 2023-02-07T03:32:14+05:30 IST