దార్శనికతకు అసలైన అర్థం ‘కె. శ్రీనివాస్’
ABN , First Publish Date - 2023-02-05T02:46:10+05:30 IST
హిందూ మతమంటే పరోపకారాన్ని ఆచరించడమే కానీ, ప్రజల సొమ్మును అదానీకి దోచిపెట్టడం కాదని తెలంగాణ శాసనమండలి సభ్యుడు గోరటి వెంకన్న వ్యాఖ్యానించారు.
శాసన మండలి సభ్యుడు గోరటి వెంకన్న
ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్,
గాయకుడు జయరాజ్‌కు మఖ్దూమ్ స్మారక అవార్డుల ప్రదానం
హైదరాబాద్ సిటీ, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి) : హిందూ మతమంటే పరోపకారాన్ని ఆచరించడమే కానీ, ప్రజల సొమ్మును అదానీకి దోచిపెట్టడం కాదని తెలంగాణ శాసనమండలి సభ్యుడు గోరటి వెంకన్న వ్యాఖ్యానించారు. ఆంధ్రజ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్ దార్శనికతకు అసలైన అర్థమని, విద్వేష కాలం లో గళం వినిపిస్తున్న విప్లవ గాయకుడు జయరాజ్ అని కొనియాడారు. ఈ మేరకు ప్రభుత్వ సిటీ కాలేజీ గ్రేటర్ హాల్లో శనివారం జరిగిన మఖ్దూమ్ మొహియుద్దీన్ జాతీయ పురస్కారాల ప్రదానోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 2022కు ప్రజా గాయకుడు జయరాజ్‌కు, 2023కి గాను ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివా్‌సకు ఈ పురస్కారాలను అందజేసి సత్కరించారు. అనంతరం గోరటి వెంకన్న మాట్లాడుతూ క్లిష్టమైన అంశాలనూ సరళమైన వాక్యంలోకి ఒంచగలిగిన కె. శ్రీనివాస్ వ్యాసాలకు తెలుగు సమాజంలోని బుద్ధి జీవులంతా అభిమానులేనని కొనియాడారు. విప్లవ గాయకుడు జయరాజ్ పాటల్లోని గొప్ప మాటలంటే తనకిష్టమని చెప్పారు.
తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ తెలుగులో మిగిలిన ఏకైక ఎడిటర్ కె. శ్రీనివాస్ అని, సమాజాన్ని మేల్కొలిపే రచనలు చేస్తున్న ఏకైక సంపాదకుడు కూడా ఆయనే అని శ్లాఘించారు. కె.శ్రీనివాస్ రాసిన ‘కొత్తవంతెన’ తెలంగాణకు పెద్ద వంతెన వేసిందన్నారు. మఖ్దూం స్మారక అవార్డు స్వీకరించడం తనకు గొప్ప అనుభూతినిచ్చిందని పురస్కార గ్రహీత జయరాజ్ పేర్కొన్నారు. ఇక, తనకు ఇది అత్యంత ప్రతిష్ఠాత్మకమైన అవార్డు అంటూ మఖ్దూమ్ పట్ల తనకు ఉన్న అభిమానాన్ని కె.శ్రీనివాస్ వెల్లడించారు. నిజాం రాచరికానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు చేసిన పోరాటాన్ని, ముస్లిం రాజుపై హిందువులు చేసిన తిరుగుబాటుగా చిత్రిస్తూ కొందరు చరిత్రను వక్రీరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి దుష్ప్రచారాలకు మఖ్దూమ్ మొహియుద్దీన్, షేక్ బందగీ వంటి పోరాటయోధుల జీవితమే సమాధానమన్నారు. కార్మికోద్యమ నాయకుడిగా, ప్రజానేతగా, కవిగా మఖ్దూమ్ పోరాట స్ఫూర్తిని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సిటీ కళాశాల ప్రిన్సిపాల్ పి. బాలభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.