మహానిరాశ

ABN , First Publish Date - 2023-02-07T01:04:23+05:30 IST

అంతర్జాతీయ వేదికలపై హైదరాబాద్‌ పేరు చెప్పి పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం చేస్తోన్న పాలకులు.. మహానగరంలో మౌలిక సదుపాయాల మెరుగుదలను పట్టించుకోవడం లేదు.

మహానిరాశ

గ్రేటర్‌కు నిధుల్లేవు

కీలక ప్రాజెక్టులకూ దక్కని ప్రాధాన్యం

జీహెచ్‌ఎంసీకి మొండిచేయి

ఇతర విభాగాలకూ అరకొరే..

హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ వేదికలపై హైదరాబాద్‌ పేరు చెప్పి పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం చేస్తోన్న పాలకులు.. మహానగరంలో మౌలిక సదుపాయాల మెరుగుదలను పట్టించుకోవడం లేదు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో గ్రేటర్‌ను అభివృద్ధి చేస్తామన్న ప్రకటనలు తప్ప.. పద్దులో ఆశించిన మేరకు కేటాయింపులు దక్కలేదు. తెలంగాణ ఆవిర్భావం నుంచి నగరానికి అరకొర కేటాయింపులతో వివక్ష చూపుతోన్న సర్కారు 2023-24 బడ్జెట్‌లోనూ అదే పంథా కొనసాగించింది. విశ్వనగర రూపకల్పనలో కీలకమైన వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం(ఎ్‌సఆర్‌డీపీ), వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమం(ఎ్‌సఎన్‌డీపీ), మిస్సింగ్‌ / లింక్‌ రోడ్ల నిర్మాణానికి నిధుల ఊసెత్తలేదు. అప్పులు చేసి ఆయా ప్రాజెక్టుల భారం తలకెత్తుకున్న జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఆర్‌డీసీఎల్‌.. ఇక రుణాలు తీసుకోవడం మా వల్ల కాదు మహాప్రభో అని చేతులెత్తేసిన వేళ ప్రతిపాదిత అభివృద్ధి పరిస్థితేంటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వేల కోట్ల ప్రాజెక్టులు నెత్తికెత్తుకున్న జీహెచ్‌ఎంసీకి కేవలం రూ.31.44 కోట్లు విదిల్చారు. మెట్రోకు రూ. 2,500 కోట్లు కేటాయించగా, మిగిలిన ప్రాజెక్టులకు అరకొరగానే నిధులు కేటాయించారు.

హైదరాబాద్‌ అగ్లమరేషన్‌కు రూ.150.94 కోట్లు

గతేడాది కేటాయింపునకే పరిమితం

హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): నగర శివారులో ఔటర్‌ రింగ్‌రోడ్డు వరకు పలు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన ద్వారా అభివృద్ధి విస్తరణకు బాటలు వేయనున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌ అర్బన్‌ అగ్లమరేషన్‌ కింద రూ.150.94 కోట్లు బడ్జెట్‌లో కేటాయించనున్నట్టు ప్రకటించారు. శాటిలైట్‌ టౌన్‌షి్‌పల తరహాలో అభివృద్ధిని ప్రోత్సహిస్తూ ఆయా ప్రాంతాల్లో రహదారులు, తాగునీరు, మురుగునీటి నిర్వహణ, వీధి దీపాలు వంటి సదుపాయాలు కల్పించనున్నారు. కిందటి యేడాది కూడా రూ.150.94 కోట్లు కేటాయించినా పైసా విదిల్చిన దాఖలాలు లేవు. ఈ సారైనా నిధులు విడుదల ఉంటుందా..? ప్రకటనకే పరిమితమా చూడాలి.

కుడా’కు రూ.12 కోట్లు

కులీకుతుబ్‌షా అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ(కుడా)కి గ్రాంట్ల కింద రూ.12 కోట్లు కేటాయించారు. వేతనాలు, నిర్వహణ కోసం ఈ నిధులు ఇవ్వనున్నట్టు బడ్జెట్‌లో ప్రకటించారు. చార్మినార్‌ పాదచారుల ప్రాజెక్టు, మూసీపై ఓ వంతెన నిర్మాణం, వారసత్వ కట్టడాల పునరుద్ధరణ పనులు చేపడుతోన్న సంస్థకు ఇతరత్రా కేటాయింపులు కనిపించ లేదు. గతేడాది రూ.11.45 కోట్లు ఇవ్వగా.. ఇప్పుడా మొత్తాన్ని రూ.12 కోట్లకు పెంచారు.

కేటాయింపులేవి..?

హైదరాబాద్‌ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి అని.. రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటికీ హామీని నిలబెట్టుకోలేదు. చేసిన అప్పులకు వడ్డీలు, వాయిదాలు చెల్లించలేని దీనస్థితిలో ఉన్న జీహెచ్‌ఎంసీకి అభివృద్ధి, సదుపాయాల కల్పనకు సంబంధించి నయాపైసా దక్కలేదు. నగరంలోని ప్రభుత్వ భవనాల ఆస్తిపన్ను కింద రూ.10 కోట్లు, వృత్తిపన్ను పరిహారం రూ.10 కోట్లు, వేతనాలు, ఇతరత్రా భత్యాల కోసం రూ.11.34 కోట్లు, మోటార్‌ వాహనాల నష్ట పరిహారం కింద రూ.10 లక్షలతో కలిపి మొత్తంగా రూ.31.44 కోట్లు కేటాయించారు. గతేడాది వేతనాలు, ఇతరత్రా భత్యాల కేటాయింపులు రూ.7.38 కోట్లు ఉండగా.. ఈ సారి రూ.11.34 కోట్లకు పెంచారు. ఫైనాన్స్‌ కమిషన్‌ గ్రాంటుగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల్లో రూ.349 కోట్లు ఇస్తామని చూపారు.

మహిళా వర్సిటీకి మళ్లీ రూ.100కోట్లు

2022-23 విద్యా సంవత్సరానికి ఏర్పాటైన మహిళా యూనివర్సిటీకి మళ్లీ రూ.100కోట్లను బడ్జెట్‌లో కేటాయించారు. గత బడ్జెట్‌లో రూ.100 కోట్లను కేటాయించగా, ఇప్పటి వరకు కోఠి ఉమెన్స్‌ కళాశాలలో ఎలాంటి పనులు చేపట్టలేదు. అభివృద్ధి పనులను ప్రారంభించ లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు నెలరోజులే సమయం ఉంది. నిధులు వచ్చే పరిస్థితి లేదు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన నిధులను ఈసారైనా విడుదల చేయాలని విద్యార్థినులు కోరుతున్నారు.

వాటర్‌బోర్డుకు అరకొరే..

హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర బడ్జెట్‌పై వాటర్‌బోర్డు గంపెడు ఆశలు పెట్టుకుంటే ప్రభుత్వం అత్తెసరుగానే కేటాయించింది. మొత్తంగా రూ.5595 కోట్ల ప్రతిపాదనలు పంపగా, రూ.1960.70 కోట్లు కేటాయించింది. ఇందులో అభివృద్ధి నిధులు కేవలం వెయ్యి కోట్లు మాత్రమే ఉన్నాయి. అది కూడా గతంలో నిర్ణయించిన ప్రాజెక్టులను, పథకాలను కొనసాగించడానికే. తాగునీరు, మురుగునీటి నిర్వహణ కోసం కొత్తగా ఒక్క ప్రాజెక్టును కూడా మంజూరు చేయలేదు. గ్రేటర్‌కు తాగునీటి భరోసా కల్పించే కేశవపూర్‌ ప్రాజెక్టుకు మాత్రం నిధులు కేటాయించడం లేదు.

సుంకిశాలకు రూ.725 కోట్లు

రూ.1,450 కోట్లతో చేపట్టిన సుంకిశాల ప్రాజెక్టు పనుల అంచనా వ్యయం రెండేళ్లలో రూ.2,175 కోట్లకు చేరింది. గత కేబినెట్‌లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అందుకనుగుణంగా 2023-24 బడ్జెట్‌లో పెరిగిన అంచనా వ్యయం రూ.725కోట్లు కేటాయించారు.

రుణాల చెల్లింపులకే రూ.935.70కోట్లు

రుణాల చెల్లింపులకు మొత్తం రూ.935.70 కోట్లు కేటాయించారు. ఎల్లంపేట నుంచి గోదావరి జలాలను, నాగార్జున్‌ సాగర్‌ నుంచి కృష్ణా జలాలను మూడు ఫేజ్‌ల్లో హైదరాబాద్‌కు తరలించడానికి వాటర్‌బోర్డు తీసుకున్న రుణాలకు సంబంధించి వార్షిక చెల్లింపులు, వడ్డీల కోసం అందులో రూ.635.70కోట్లను కేటాయించారు. మిగతా రూ.300కోట్లను హడ్కో ప్రాజెక్టు కింద తీసుకున్న రుణాలకు వడ్డీల చెల్లింపు కోసం కేటాయించారు.

ఉచిత తాగునీటికి రూ.300కోట్లు

నెలకు 20వేల లీటర్ల ఉచిత తాగునీటి పథకం కోసం బడ్జెట్‌లో రూ.300కోట్లను కేటాయించారు. ఈ పథకం ద్వారా గ్రేటర్‌ పరిధిలో 4.9లక్షల గృహ కనెక్షన్ల ద్వారా లక్షలాది కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి.

మూసీకి మళ్లీ రూ.200 కోట్లు

కేటాయింపులే కానీ.. నిధులివ్వట్లే

మూసీనది సుందరీకరణ కోసం ప్రభుత్వం బడ్జెట్‌లో మళ్లీ రూ.200కోట్లు కేటాయించింది. గతేడాది బడ్జెట్‌లో రూ.200కోట్లు కేటాయించినా నయా పైసా విడుదల చేయలేదు. ఈ నిధులన్నీ ఇతర శాఖలకు దారి మళ్లిస్తున్నారు. ఎంఆర్‌డీసీఎల్‌ కార్యాలయ నిర్వహణ ఉద్యోగుల, జీత భత్యాల కోసం ఒకటి, రెండు కోట్లను విదుల్చుతున్నారు. ఈ సారైనా కేటాయించిన నిధులు విడుదల చేస్తారా? లేదా.. అన్న సందేహాలు నెలకొన్నాయి.

జేఎన్‌టీయూహెచ్‌కు రూ. 48.94 కోట్లు

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌లో జేఎన్‌టీయూహెచ్‌కు రూ.48.94 కోట్లు కేటాయించారు. గత యేడాదిలో రూ.44.21కోట్లు కేటాయించగా ఈసారి నాలుగుకోట్లు పెంచి బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. రాష్ట్రంలో జేఎన్టీయూ పరిధిలో నాలుగు కొత్త ఇంజనీరింగ్‌ కాలేజీలు ఏర్పాటు చేస్తునట్లు మంత్రి హరీ్‌షరావు బడ్జెట్‌ ప్రసంగంలో తెలిపారు. సిరిసిల్ల, వనపర్తి కాలేజీలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని త్వరలో మహబూబ్‌నగర్‌, కొత్తగూడెంలలో కొత్త కాలేజీలు ప్రారంభిస్తామని తెలిపారు.

సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులకు రూ. 500 కోట్లు

నగరం నలుమూలలా నిర్మించనున్న సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులకు రూ. 500 కోట్లు కేటాయించారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి నాలుగు సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు అందుబాటులోకి తీసుకువస్తామని ప్రభుత్వం ప్రకటించింది. నిమ్స్‌లో కొత్త భవనాలకు రూ.200 కోట్లు కేటాయించారు. ఎంఎన్‌జే ఆస్పత్రి కొత్త భవనం నిర్మాణం కోసం రూ.2.7 కోట్లు కేటాయించారు. అయితే, ఉస్మానియా ట్విన్‌ టవర్‌ ప్రస్తావన లేకపోవడంతో కొత్త భవనం ఈసారి కూడా లేనట్లే. చెస్ట్‌ ఆస్పత్రిలో 750 పడకల భవనం కోసం ఏళ్ల తరబడి ప్రతిపాదనలు పెండింగ్‌లోనే ఉన్నాయి. నిలోఫర్‌, మానసిక చికిత్సాలయం ప్రస్తావన కన్పించలేదు. గాంధీ, ఉస్మానియా, నిలోఫర్‌ ప్రసూతి ఆస్పత్రుల్లో పడకలు, కొత్త భవనాలకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంపై పలు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

హెచ్‌ఎండీకు రూ.10 లక్షలే..

హైదరాబాద్‌ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ)కు రూ.10 లక్షలే కేటాయించారు. అదికూడా హెచ్‌ఎండీఏకు రుణాల కోసం చెల్లించినట్లుగా నిర్వహణ పద్దు కింద పేర్కొన్నారు. సంస్థ ఆధ్వర్యంలో గ్రేటర్‌తోపాటు శివారు ప్రాంతాల్లో రోడ్లు, మౌలిక సదుపాయాల కల్పన కోసం తగిన నిధులను కేటాయించలేదు. అయితే, అభివృద్ధి పనులన్నీ స్వయం సమృద్ధితో చేపట్టాలని పరోక్షంగా సర్కారు సంకేతాలిచ్చింది. కొన్నేళ్లుగా ఓఆర్‌ఆర్‌ కాంట్రాక్టర్లకు యాన్యుటీ చెల్లింపులు హెచ్‌ఎండీఏ చేస్తుండగా, బకాయిలు చెల్లించాలని బడ్జెట్‌కు ప్రతిపాదించినా నిధులు కేటాయించలేదు.

Updated Date - 2023-02-07T01:04:24+05:30 IST