Telangana: ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలు.

ABN , First Publish Date - 2023-06-02T07:47:02+05:30 IST

హైదరాబాద్: ప్రభుత్వ ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలు జరగనున్నాయి. 9 ఏళ్లు పూర్తిచేసుకుని పదో వసంతంలోకి తెలంగాణ అడుగుపెట్టింది.

Telangana: ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలు.

హైదరాబాద్: ప్రభుత్వ ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలు జరగనున్నాయి. 9 ఏళ్లు పూర్తిచేసుకుని పదో వసంతంలోకి తెలంగాణ అడుగుపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 21 రోజులపాటు ఈ వేడుకలు జరగనున్నాయి. సీఎం కేసీఆర్ 10.20 గంటలకు గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పించనున్నారు. 10:30 గంటలకు నూతన సచివాలయంలో జాతీయ పతాకావిష్కరణ చేస్తారు. అనంతరం వేడుకలను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ప్రముఖులు వేడుకలను ప్రారంభిస్తారు. అలాగే రాజ్‌భవన్‌లో 9 గంటలకు అవతరణ వేడుకలు జరగనున్నాయి. కాగా గవర్నర్ తమిళిసై కామెంట్స్‌పై సర్వాత్ర ఆసక్తి నెలకొంది.

కాగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాల వేళ.. అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు నాడు రాష్ట్ర ఏర్పాటు కోసం తాము పోషించిన పాత్రను చెప్పుకుంటూ పోటాపోటీగా కార్యక్రమాలను చేపడుతున్నాయి. అధికార బీఆర్‌ఎస్‌ తామే తెలంగాణ తెచ్చామంటూ ప్రభుత్వం తరఫున ఉత్సవాలను నిర్వహిస్తోంది. పనిలో పనిగా ప్రభుత్వ ఖర్చుతో భారీగా ప్రకటనలిచ్చి పార్టీకి ప్రయోజనకరంగా మార్చుకునే పనిలో ఉంది. పత్రికల్లో ప్రకటనలు, కార్యక్రమాల కోసం ప్రభుత్వం నుంచి వందలకోట్ల రూపాయలను నీళ్లలా ఖర్చుచేస్తోంది. పార్టీ-ప్రభుత్వం అనే హద్దులు చెరిపేసి బీఆర్‌ఎస్సే తెలంగాణ చాంపియన్‌ అన్న పేరు తెచ్చుకుని వచ్చే ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించేందుకు ప్రాతిపదికను ఏర్పాటు చేసుకోవాలనే అంతర్గత లక్ష్యంతో ఉంది. పనిలో పనిగా ఈ ఉత్సవాల ముసుగులో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను కూడా మరిపించేలా కార్యక్రమాలను రూపకల్పన చేసింది. మరోవైపు అధికార పక్షంలా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టకుండానే ప్రతిపక్ష కాంగ్రెస్‌ కూడా దానికి ధీటుగానే కొన్ని కార్యక్రమాలకు ఏర్పాట్లు చేసింది.

అసలు తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్‌ అన్న అంశాన్ని తెరపైకి తీసుకొస్తోంది. ఆనాడు కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వమే తెలంగాణ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుందని పేర్కొంటోంది. ఒకపక్క ఆంధ్రప్రదేశ్‌లో ఘోరంగా దెబ్బతింటామని తెలిసి కూడా నాడు తెలంగాణ ఇవ్వాలనే సాహసోపేత నిర్ణయాన్ని సోనియాగాంధీ తీసుకుందని గుర్తుచేస్తోంది. తెలంగాణ రాష్ట్ర బిల్లు ఆమోదంలో కీలకంగా వ్యవహరించిన నాటి లోక్‌సభకు స్పీకర్‌గా ఉన్న మీరాకుమార్‌ను రాష్ట్రానికి తీసుకొచ్చి కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇక బీజేపీ కూడా తెలంగాణ రావడంలో తమ పాత్రను ప్రముఖంగానే చెప్పేందుకు కార్యక్రమాలు ఏర్పాటు చేసింది. నాటి ఉద్యమకారులకు చిన్నమ్మగా చిరపరిచితమైన దివంగత సుష్మాస్వరాజ్‌ పోషించిన పాత్రను మళ్లీ గుర్తుచేయనుంది. అంతేకాకుండా ఆ రోజు కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉండి కేంద్రానికి మద్దతు ఇవ్వడం వల్లే తెలంగాణ వచ్చిందని చెబుతోంది. మరోవైపు నాడు ఉద్యమానికి నాయకత్వం వహించి, తెలంగాణ జేఏసీకి కన్వీనర్‌గా ఉన్న కోదండరాం, ఇతర పార్టీలు కూడా వేటికవే కార్యక్రమాలు చేపడుతున్నాయి.

Updated Date - 2023-06-02T07:47:02+05:30 IST