TS News: కేసీఆర్ సర్కార్‌కు తమిళిసై మళ్లీ షాక్.. ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలు తిరస్కరణ

ABN , First Publish Date - 2023-09-25T15:02:49+05:30 IST

తెలంగాణ గవర్నర్ తమిళిసై మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వం గవర్నర్ కోటాలో ఎంపిక చేసిన ఎమ్మెల్సీ అభ్యర్థులు

TS News: కేసీఆర్ సర్కార్‌కు తమిళిసై మళ్లీ షాక్.. ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలు తిరస్కరణ

హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వం గవర్నర్ కోటాలో ఎంపిక చేసిన ఎమ్మెల్సీ అభ్యర్థులు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ అభ్యర్థిత్వాలను తిరస్కరించారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎంపిక చేయటానికి అర్హతలు అడ్డొస్తున్నాయంటూ ప్రభుత్వానికి ఆమె లేఖ రాశారు. అభ్యర్థులిద్దరూ ఎక్కడా సామాజిక సేవా కార్యక్రమాలు.. సేవా విభాగాల్లో పాల్గొన్నట్లు కనిపించలేదంటూ గవర్నర్ ప్రత్యేక లేఖ ద్వారా తెలియజేశారు. రాజకీయ నాయకులను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా సిఫార్సు చేయొద్దని రాజ్యాంగంలోని ఆర్టికల్ 171(5) చెబుతోందని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు.

గతంలో కౌశిక్‌రెడ్డికి కూడా ఇదే ఎదురుదెబ్బ తగిలింది. కౌశిక్‌రెడ్డిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించి గవర్నర్‌కు పంపించింది. అప్పుడు కూడా కౌశిక్‌రెడ్డి ఎక్కడా సేవా కార్యక్రమాలు చేసినట్లు కనిపించలేదని తిరస్కరించారు. తాజాగా దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణకు కూడా ఇలాంది ఎదురుదెబ్బ తగిలింది.

ఇటీవల పట్నం మహేందర్‌రెడ్డి ప్రమాణస్వీకారం సందర్భంగా రాజ్‌భవన్‌కు సీఎం కేసీఆర్, మంత్రులు, ప్రజాప్రతినిధులంతా వచ్చారు. ఆ సమయంలో తమిళిసైతో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. అనంతరం నూతన సచివాలయాన్ని సందర్శించి.. అక్కడే నిర్మించిన చర్చి, గుడి, మసీదులను ప్రారంభించారు. అనంతరం అనేక సమావేశాల్లో కూడా సీఎం కేసీఆర్‌ను తమిళిసై పొగడ్తలతో ముంచెత్తారు. ఈ పరిణామాలతో ప్రభుత్వం-రాజ్‌భవన్ మధ్య చోటుచేసుకున్న గ్యాప్ తొలగిపోయిందని రాజకీయ విశ్లేషకులు భావించారు. అంతేకాకుండా ఆర్టీసీ విలీనం బిల్లును కూడా ఇటీవల ఆమె ఆమోదించారు. ఇంతలోనే ప్రభుత్వం సిఫార్సు చేసి పంపించిన గవర్నర్ కోటా అభ్యర్థులను తమిళిసై తిరస్కరించడంతో బీఆర్ఎస్ నాయకులు షాక్‌కు గురయ్యారు. ప్రభుత్వ పెద్దలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Updated Date - 2023-09-25T16:46:09+05:30 IST