విద్యార్థులు సైబర్ వారియర్లవ్వాలి: హోం మంత్రి
ABN , First Publish Date - 2023-01-12T04:39:19+05:30 IST
విద్యార్థులు సైబర్ వారియర్లుగా తయారవ్వాలని, ఇతరులకు సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించాలని హోంమంత్రి మహమూద్ అలీ ఆకాంక్షించారు.
హైదరాబాద్, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు సైబర్ వారియర్లుగా తయారవ్వాలని, ఇతరులకు సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించాలని హోంమంత్రి మహమూద్ అలీ ఆకాంక్షించారు. అంతకంటే ముందు విద్యార్థులు సైబర్ నేరాల పట్ల అవగాహన పెంచుకోవాలని, సెల్‌ఫోన్‌ను అవసరం మేరకు మాత్రమే వినియోగించాలని కోరారు. జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా రవీంద్రభారతిలో పోలీసు మహిళా భద్రత విభాగం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సైబర్ అంబాసిడర్స్ ప్లాట్‌ఫాం(సీఏపీ)ని ప్రారంభించారు. సీఏపీకి సంబంధించిన పోస్టర్లు, లోగో, పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ.. రోజురోజుకూ పెరుగుతున్న సైబర్ నేరాల నియంత్రణకు ప్రభుత్వం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తోందన్నారు. టెక్నాలజీ దుర్వినియోగం వల్లే సైబర్ నేరాలు జరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో డీజీపీ అంజనీకుమార్ మహిళా భద్రత విభాగం చీఫ్ షికా గోయల్ తదితరులు పాల్గొన్నారు.